ఔరంగజేబు గురించి, మొఘలుల పాలన గురించి అప్పటి వార్తా కథనాల్లో ఏముంది?

మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు, వార్తా పత్రికలు, చరిత్రకారులు

ఫొటో సోర్స్, Heritage Images via Getty Images

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

యూరప్ వార్తా పత్రికలను కనుక్కునే రోజుల్లో మొఘలుల పాలనలోని భారతదేశానికి తనదైన సొంత న్యూస్‌నెట్ వర్క్ ఉండేది.

16వ శతాబ్దం చివరి రోజుల్లో రచయితలు, ఏజెంట్లు, కార్యదర్శుల సమూహాలు.. ఆస్థాన కుట్రలు, సైనికుల దండయాత్రలు, నియామకాలు, ఆర్థిక అంశాలు, వదంతుల గురించి సంక్షిప్త వార్తా నివేదికలైన అఖ్బారత్‌ల రూపంలో రాసి పెట్టేవారు.

పెళుసుగా ఉండే కాగితాల మీద పర్షియన్ భాషలో హడావుడిగా రాసినట్లు కనిపించే అఖ్బారత్‌లు మొఘలు సామ్రాజ్యపు సమాచార నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశాయి.

వీళ్లు రాసే వాటిలో గూఢచారుల నివేదికలు, కొన్ని అధికారిక ప్రకటనలు, కొన్ని వార్తా కథనాలు ఉండేవి.

ఇవి ప్రతీరోజూ వందలు, కొన్నిసార్లు వేల సంఖ్యలో రాజ దర్బారు, ప్రాంతీయ దర్బారుల మధ్య పంపిణీ అయ్యేవి. భారత ఉపఖండంలో అధిక భాగాన్ని, ప్రపంచ జనాభాలో నాలుగో భాగాన్ని పాలించిన సామ్రాజాన్ని ఐక్యంగా ఉంచడంలో ఇవి సాయపడ్డాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

రాజ దర్బారు నుంచి సామ్రాజ్యం నలుమూలల నుంచి వచ్చిన వార్తలను సమావేశమైన అధికారుల ఎదుట పెద్దగా అరుస్తూ చదివి వినిపించేవారు.

కొన్ని దశాబ్ధాల పాటు పాలకుల ఆదేశాలు, ప్రభుత్వ రికార్డులకు సంబంధించిన వేల కొలదీ పేజీలు భారత్, బ్రిటన్‌లోని లైబ్రరీలలో పడి ఉన్నాయి.

అవి ఉన్నాయని చరిత్రకారులకు కూడా తెలుసు. కొంతమంది వాటిని లోతుగా పరిశీలించారు.

బర్కిలీలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో చరిత్రకారుడు మునిస్ డి ఫరూఖీ దాదాపు 2 దశాబ్దాల పాటు ఆ పత్రాల పరిశీలనలో గడిపారు.

2007 నుంచి ఆయన భారత్, బ్రిటన్‌లో భద్రపరిచిన పురాతన అఖ్బారత్ ఇ దర్బార్ ఇ ముల్లా( ఉన్నత దర్బారులోని వార్తాపత్రికలు)లను సేకరించడంలో నిమగ్నమయ్యారు.

కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీలో 6,500కు పైగా పేజీలను పరిశీలించిన ఫరూఖీ, అందులో రాకుమారులు, సేనాధిపతులు, ఆస్థాన కవులు, రాచరిక మహిళలు, సామంతులైన హిజ్రాలు, మరెందరో ప్రముఖుల గురించి ఉన్న సమచారం గురించి తెలుసుకున్నారు.

మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు, వార్తా పత్రికలు, చరిత్రకారులు

ఫొటో సోర్స్, Royal Asiatic Society of Great Britain and Ireland

ఫొటో క్యాప్షన్, మొఘల్ అఖ్బారత్ (వార్తా నివేదిక) నుంచి తీసుకున్న పేజీలు పర్షియన్ భాషలో చేతితో రాసి ఉన్నాయి.

మొఘల్ సామ్రాజ్యమంతటా విస్తరించిన నెట్‌వర్క్

దీనివల్ల 17వ శతాబ్దం చివరిలో ఔరంగజేబు, మొఘల్ సామ్రాజ్యం చరిత్ర గురించి అనేక వివరాలు తెలిశాయి.

ఇది భారత దేశపు వివాదాస్పద మొఘల్ పాలకుడి గురించి సమాచారాన్ని వెల్లడించడంతో పాటు ప్రపంచంలోని తొలి ఆధునిక సామ్రాజ్యాలలో ఒకటిగా గుర్తింపు పొందిన రాజ్యంలో పరిస్థితులపై అవగాహన కల్పిస్తుంది.

మొఘలుల కాలం నాటి వార్తా కథనాల ప్రతులు లండన్, బికనేర్, సీతామౌ, కోల్‌కతాలో భద్రంగా ఉన్నాయి. మరి కొన్ని ప్రైవేటు వ్యక్తుల దగ్గర ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు.

ఈ ప్రతుల్లో కొన్నింటిని జైపూర్ కోటలో చల్లగా, పొడిగా ఉండే నేల మాళిగలో భద్రపరిచారు. ఈస్టిండియా కంపెనీ అధికారి, పురావస్తు శాస్త్రవేత్త జేమ్స్ టాడ్, ఈ నివేదికల్లో కొన్నింటిని అరువుగా తీసుకుని 1823లో బ్రిటన్ తిరిగి వెళ్ళేటప్పుడు వాటిని తిరిగి ఇవ్వలేదు. తర్వాతి కాలంలో ఆయన వాటిని రాయల్ ఏషియాటిక్ సొసైటీ గ్రంథాలయానికి విరాళంగా ఇచ్చారు.

కోల్‌కతా జాతీయ గ్రంథాలయంలో ఉన్న ప్రతుల్లో 1658 నుంచి 1707 వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన ఔరంగజేబు పాలన గురించిన 21సంపుటాలు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు చరిత్రకారుడైన సర్ జదునాథ్ సర్కార్ వ్యక్తిగత గ్రంథాలయంలో భాగం.

వీటిని చూస్తే ఇందులో ఉన్న కొన్ని వివరాలు అంటే... నియామకాలు, వివాదాలు, సైనికుల కదలికలు, బహుమతులు, జబ్బులు, పాలనాపరమైన చిన్న చిన్న విషయాలు అంత ప్రాధాన్యమున్నవిగా అనిపించకపోవచ్చు.

అయితే వాటన్నింటినీ కలిపి చూస్తే, ఒక సామ్రాజ్యం తన గురించి ప్రతీ చిన్న అంశాన్ని రికార్డు చేయడం అనే అరుదైన విషయం స్పష్టమవుతుందని ఫరూఖీ అంటున్నారు.

ఔరంగజేబు సింహాసనం అధిష్టించిన తర్వాత 20 ఏళ్ల కాలానికి సంబంధించి చారిత్రక ఆధారాల లభ్యత అసంపూర్తిగా ఉంది. అయితే 1680ల నుంచి లభించిన సమాచారం అసాధారణమైనది. ఇది ఏళ్ల తరబడి ప్రతీరోజూ వచ్చే నివేదికలను అందుబాటులోకి తెస్తుంది. మొత్తంగా చూస్తే ఔరంగ జేబు 50 ఏళ్ల పాలనలో సుమారు మూడోవంతు భాగాన్ని వెలుగులోకి తెస్తాయి.

మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు, వార్తా పత్రికలు, చరిత్రకారులు
ఫొటో క్యాప్షన్, మునిస్ డి ఫరూఖీ 20 ఏళ్ల పాటు అఖ్బారత్‌లను అధ్యయనం చేశారు.

చరిత్రకారులెందుకు పట్టించుకోలేదు?

ఫరూఖీ తన విద్యా జీవితంలో ఎక్కువ భాగాన్ని 17వ శతాబ్దం చివరినాటి మొఘల్ సామ్రాజ్యం గురించి ఆలోచిస్తూ గడిపారు.

ఆ శతాబ్దిలో మొఘల్ సామ్రాజ్యం ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ క్రమంగా పతనమవుతూ బ్రిటిష్ పాలనకు మార్గం సుగమం చేసింది. అయితే నాటి మొఘల్ సామ్రాజ్యాన్ని చూసేందుకు అఖ్బారత్‌ ఫరూఖీకి మార్గాన్ని చూపింది.

"అఖ్భారత్‌ గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు నా జీవితంలో ఒక దాని తర్వాత ఒకటిగా నేను కనుక్కున్న గొప్ప ఆవిష్కరణ లాంటిది. ఆ సమయంలో సమాచార వ్యవస్థ ఎంత పటిష్ఠంగా దట్టంగా అల్లుకుని ఉండేదో చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది" అని బీబీసీతో చెప్పారు ఫరూఖీ.

ఫరూఖీ అధ్యయనం చేసిన వార్తా నివేదికల్లో జైపూర్ రాజు గురించిన సమాచారం ఉంది.

మొఘల్ సామ్రాజ్యం నలుచెరగులా ఉన్న వందలమంది రాజులు, రాకుమారులు, అధికారులు ఏజంట్లు ఈ నివేదికలను అందుకుని ఉంటారు. దీని ద్వారా తొలి ఆధునిక ప్రపంచంలో అత్యంత అధునాతన సమాచార వ్యవస్థలలో ఒకటి ఏర్పడింది.

"అంతటి గొప్ప జ్ఞాన సముపార్జనకు దారి తీసిన వ్యవస్థ గురించి ఆలోచిస్తే అబ్బురమనిపిస్తుంది" అని ఫరూఖీ అన్నారు.

అందుబాటులో ఉన్న సమచారాన్ని ఆధునిక లేదా నాటి ప్రమాణాలతో పోల్చితే మొఘల్ సామ్రాజ్యం తన పరిధిలోని ప్రాంతాలపై అసాధారణమైన, సునిశితమైన పట్టు కలిగి ఉండేదని అనిపిస్తుంది.

పాలకులు తమకు అందిన సమాచారం ప్రకారం చర్యలు తీసుకోవడం అన్నది రకరకాలుగా ఉన్నప్పటికీ అది కోట్లమంది ప్రజల జీవితాల మీద కొన్నిసార్లు సానుకూలంగా, మరికొన్నిసార్లు ప్రతికూలంగా ప్రభావం చూపిందని ఫరూఖీ విశ్వసిస్తున్నారు.

ఈ నివేదికలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఫరూఖీ అంచనాలు పదేపదే తలకిందులయ్యాయి.

ఔరంగజేబు పాలన గురించి ప్రస్తావించినప్పుడల్లా తెరపైకి వచ్చే విస్తృత మత మార్పిడులకు సంబంధించిన ఆధారాలేవీ అఖ్బారత్‌లో లభించలేదని ఫరూఖీ చెప్పారు. ఔరంగజేబు పాలనలో అంతఃపురం, హిజ్రాలు "ఎవరూ ఊహించని స్థాయిలో రాజకీయాల మీద ప్రభావం చూపేవారు"

అందరూ ఊహించిన దాని కంటే ఔరంగజేబు ప్రజలకు దగ్గరగా, నిరాడంబరమైన వ్యక్తిగా కనిపించారు. ఆ కథనాల్లో సిక్కుల వంటి సమూహాలపట్ల శత్రుత్వానికి సంబంధించిన ప్రస్తావనలు చాలా తక్కువగా ఉన్నాయని, అవి తాను అంచనా వేసిన దానికంటే చాలా తక్కువని ఫరూఖీ చెప్పారు.

1711నాటికి ఔరంగజేబు సిక్కు సమాజాన్ని, వారి ఆధ్యాత్మిక గురువుల్ని హింసించారని చెప్పిన దానికి ఈ పరిస్థితి వ్యతిరేకంగా ఉంది.

మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు, వార్తా పత్రికలు, చరిత్రకారులు

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీలో మొఘలుల కాలంనాటి వార్తా నివేదికలు భద్రంగా ఉన్నాయి.

పాలనపై ఔరంగజేబు కుమార్తె ప్రభావం

కొన్ని విషయాలు నాటకీయమైన కథనాల వల్ల కాకుండా, పదే పదే చెప్పడం ద్వారా వెలుగులోకి వచ్చాయి.

నాటి వార్తా కథనాల్లో ఔరంగ జేబు కుమార్తె జినత్ ఉన్ నిసా పేరు పదే పదే కనిపించడాన్ని ఫరూఖీ గుర్తించారు. చరిత్రకారులకు ఆమె గురించి తెలుసు. కానీ రాజ ఆస్థానంలో ఆమె పాత్ర గురించి పెద్దగా ప్రస్తావన లేదు.

అయితే అఖ్బారత్‌లో ప్రతీ పేజీలో ఆమె పేరు ఉంది.

జినత్ ఉన్ నిసా రాకుమారి మాత్రమే కాదని ఫరూఖీ గ్రహించారు.

ఆమె శక్తివంతులైన రాజకీయ నాయకురాలు. ఔరంగజేబు వృద్ధాప్యంలో, రాజకీయంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆమె "అసాధారణమైన పలుకుబడి ఉన్న, రాజకీయ రక్షణ కవచం"గా నిలిచారు. అఖ్బారత్‌లో ఆమె ప్రస్తావన ప్రతీసారీ ఫరూఖీ నోట్ చేసుకున్నారు. మొఘలుల అంతఃపురం గురించి ఫరూఖీ చేసిన వివరణలలో ఆమె ప్రముఖంగా కనిపిస్తారు.

ఫరూఖీ ఆ వార్తా పత్రికల్ని చూడటం మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్కటి ఆయన దృక్కోణాన్ని మార్చేశాయి.

"1990లలో (అఖ్బారత్ గురించి తొలిసారి విన్నప్పటి నుంచి) నాకు నేను చెప్పుకున్న అనేక కథల గురించి మళ్లీ ఆలోచించాల్సి వచ్చింది" అని ఫరూఖీ అన్నారు.

అఖ్బారత్ ఔరంగజేబు గురించి మాత్రమే కాకుండా, మొత్తం మొఘల్ సామ్రాజ్యాన్ని పునఃపరిశీలించే అవకాశాన్ని కల్పించిందని ఆయన అన్నారు.

చరిత్రకారులు అఖ్బారత్‌కు ఎందుకు ఎక్కువగా దూరంగా ఉన్నారు? వారి సంకోచాన్ని తాను అర్థం చేసుకోగలనని ఫరూఖీ చెప్పారు.

మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబు, వార్తా పత్రికలు, చరిత్రకారులు

ఫొటో సోర్స్, Universal Images Group via Getty Images

ఫొటో క్యాప్షన్, మొఘలుల కాలం నాటి వార్తా పత్రికలు ఔరంగజేబు పాలనాకాలంలో 30 ఏళ్లపాటు జరిగిన పరిణామాలను నమోదు చేశాయి.

పరిశోధించాల్సినవి ఇంకా ఉన్నాయా?

కెరీర్ తొలి నాళ్లలో మొఘలుల గురించి కొన్ని ప్రాచీన చారిత్రక ఆధారాలతో ఏడు వారాల పాటు కుస్తీ పట్టిన ఫరూఖీ చివరకు దాన్ని వదిలేశారు.

"అందులో ఏదైనా వెతకడం అంటే గడ్డి వాములో సూదిని వెదకడం లాంటిది" అనేది ఆయన అభిప్రాయం.

ఆ పేజీల్లో ఎక్కడ ఏముందనే సమాచారం లేకపోవడం, పైగా అవి వేల సంఖ్యలో ఉండటంతో వాటిలో ఒక పేజీలో ఉన్న దాని గురించి తెలుసుకుని దానికి సంబంధించిన మరో పేజీ కోసం పేజీల తర్వాత పేజీలు తిరగేయడానికి ఓపిక, సహనం అవసరం.

ఆధునిక కాలంలోనూ మొఘలు చక్రవర్తుల్లో ఔరంగజేబు గురించి ఎక్కువగా చర్చ జరగడానికి, ఆయన పాలనా కాలంలో అందుబాటులో ఉన్న సమాచారమే కారణం అని ఫరూఖీ చెబుతున్నారు.

మొఘలల పాలన మొదలైన తర్వాత తొలితరం చక్రవర్తుల పాలన గురించి సాక్ష్యాధారాలు తక్కువగా ఉన్నాయి.

అయితే ఔరంగజేబు పాలనాకాలం నాటికి పత్రాలు వెల్లువలా వచ్చాయి. పాలనకు సంబంధించిన వాటితో పాటు వ్యక్తిగత ఉత్తర ప్రత్యత్తురాలు, ప్రాంతీయ చరిత్రలు, జీవితచరిత్ర నిఘంటువులు, కవిత్వం, ఐరోపా వాణిజ్య సంస్థల పత్రాలు, యాత్రికుల రచనలు అందుబాటులో ఉన్నాయి.

ఫరూఖీకి అఖ్బారత్‌లు చాలా ముఖ్యమైనవి. అయితే ఆశ్చర్యకరంగా వాటిని చాలా తక్కువగా ఉపయోగిస్తున్నారు.

"సాహసోపేతమైన చరిత్రకారులు ముందుకు వచ్చి వాటిని ఉపయోగించుకోవాలి. వాటి ఆధారంగా డజన్ల కొద్దీ పుస్తకాలు అంతకంటే ఎక్కువ కూడా రాయవచ్చు" అని ఆయన చెబుతున్నారు.

ఫరూఖీ కోల్‌కతాలో తొలిసారిగా ఈ సేకరణను ప్రారంభించినప్పుడు పెద్దగా ఏమీ ఆశించలేదు.

"మొదటి సంపుటిలోని మొదటి పేజీ తిప్పగానే ఈ సంకలనం ఎంత అసాధారణమైనదో అర్థమైంది" అని ఆయన గుర్తుచేసుకున్నారు.

"చాలాకాలంగా ఎవరూ పట్టించుకోని లేదా పెద్దగా గుర్తించని కథాంశాలు నాకు కనిపించాయి" అని ఆయన అన్నారు.

తన పుస్తకం వాటిలో కొంత భాగాన్ని మాత్రమే పరిశీలిస్తుందని ఆయన చెప్పారు.

ఇతరులు అన్వేషించాల్సినవి ఇంకా ఎన్నో, ఎన్నో ఉన్నాయంటారు ఫరూఖీ.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)