ఫుట్‌బాల్ బాస్, ‘కింగ్ ఆఫ్ పోర్న్’ లైంగిక దోపిడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ సలివన్ ఎవరు?

    • రచయిత, బిల్లీ కెన్‌బర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 7 నిమిషాలు

‘‘కొంతమంది స్టాంపులు సేకరించినట్టు, నేను మహిళలను కూడా ఒక సేకరణగానే చూస్తాను’’ అని ఒకప్పుడు తన గురించి తాను అభివర్ణించుకున్నారు వెస్ట్ హామ్ మాజీ జాయింట్ ఛైర్మన్ డేవిడ్ సలివన్.

"నేను రోజుకు ముగ్గురు మహిళలతో గడుపుతాను. మరికొన్నిరోజులు ఎవరితోనూ అలాంటి సంబంధం ఉండదు. అది నా మానసిక స్థితి, ఇతర విషయాలపై ఆధారపడి ఉంటుంది. నాకు చాలామంది మహిళలతో శారీరక సంబంధం పెట్టుకోవాలనే కోరిక ఉంది" అని 1989లో ఒక వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సలివన్ చెప్పారు.

ఇంటర్నెట్‌ అందుబాటులోకి రాకముందు అశ్లీలపత్రికలు, అర్థనగ్న చిత్రాలు, టెలిఫోన్ చాట్ లైన్లు, అలాగే టాప్‌లెస్ గ్లామర్ మోడళ్లు, అప్పుడే 16 ఏళ్ల ప్రాయంలోకి అడుగుపెట్టిన బాలికల ఫోటోలతో నిండిన పత్రికలను విక్రయించడం ద్వారా ఈ వ్యాపారవేత్త అపార సంపదను పోగేసుకున్నారు.

పరిశ్రమలో కొందరికి "పోర్న్ కింగ్"గా తెలిసిన ఈ 77 ఏళ్ల వ్యక్తి తన 14 పడకగదుల ఎసెక్స్ భవనంలోని కార్యాలయం నుంచే మీడియా,స్థిరాస్థి, ప్రచురణ సామ్రాజ్యాన్ని పర్యవేక్షిస్తూ, దేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరిగా కొనసాగారు.

ఇప్పుడు బీబీసీ పనోరమా, టైమ్స్ సంయుక్తంగా జరిపిన దర్యాప్తులో దశాబ్దాల క్రితం జరిగిన లైంగిక దోపిడీ, వేధింపుల ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

అయితే సలివన్ ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు. అవి పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో బీబీసీ దర్యాప్తు ‘‘మొత్తంగా నిష్పాక్షికంగా లేదని’’ విమర్శించారు.

తన అధికారాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఇంతటి సంపదను, పలుకుబడిని ఎలా సంపాదించారు?

అశ్లీలతను నమ్ముకున్న వ్యాపారులు

సలివన్ 2010లో తన వ్యాపార భాగస్వాములతో కలిసి వెస్ట్ హామ్ క్లబ్‌ బాధ్యతలు తీసుకున్నాక పోషించిన పాత్రవల్లే ఆయన ప్రసిద్ధి చెందారు.

ప్రాగ్యూలో 2023లో జట్టు యూఫా కాన్ఫరెన్స్ లీగ్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ఆయన మైదానంలో ఉన్నారు. ఆ సమయంలో క్లారెట్ కలర్ బ్లేజర్, క్లబ్ టై ధరించారు. లండన్ స్టేడియంలో జరిగే మ్యాచ్‌ల సమయంలో డైరెక్టర్ల బాక్స్‌లో తరచుగా కనిపిస్తూ ఉండేవారు.

జాయింట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినప్పటికీ, వ్యాపారంలో 38.8% వాటాతో ఇప్పటికీ ఛాంపియన్‌షిప్ క్లబ్‌లో అతిపెద్ద ఏకైక వాటాదారుగా కొనసాగుతున్నారు.

కార్డిఫ్‌లో రాయల్ ఎయిర్ ఫోర్స్ అధికారి దంపతులకు 1949లో జన్మించిన సలివన్, ఫుట్‌బాల్ ప్రోగ్రామ్స్ అమ్మడం ద్వారా వ్యాపారంలోని రుచిని పసిగట్టారు.

లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత, ప్రకటనల రంగంలో పనిచేశారు. అక్కడ పెంపుడు జంతువుల ఆహారం, చేతితో తయారుచేసిన పొగాకు ఉత్పత్తులను అమ్మేవారు.

కానీ 1970ల ప్రారంభంలో వారానికి 30 పౌండ్ల జీతం మాత్రమే రావడంతో అసంతృప్తి చెందిన సలివన్, ఆయన స్నేహితుడు తూర్పు లండన్‌లోని ఫారెస్ట్ గేట్‌లోని ఒక గోడౌన్‌ దగ్గర మహిళా మోడళ్ల టాప్‌లెస్ ఫోటోలను అమ్మడం మొదలుపెట్టారు.

తపాలా ఆర్డర్ల ద్వారా సాగే ఈ వ్యాపారం త్వరగానే ఊపందుకున్నాక అశ్లీల పత్రికలు, లైంగిక విధానాలపై పుస్తకాలు కూడా అమ్మడం మొదలుపెట్టారు.

కొద్దికాలానికే వీరిపై న్యూస్ ఆఫ్ ది వరల్డ్ ‘‘బ్రిటన్‌లో కొత్త అశ్లీల వ్యాపారులు’’ అనే ముద్ర వేసింది. ఆ పేరు తన తల్లిని కన్నీరుపెట్టించిందని సలివన్ తరువాత చెప్పారు.

వీరు సాధించిన వ్యాపార విజయం అధికారుల దృష్టి వీరిపై పడేలా చేసింది. 1973లో ఇరవై ఏళ్ల సలివన్, ఆయన వ్యాపార భాగస్వామిపై అశ్లీల అంశాలు ప్రచురించడానికి, పోస్ట్ చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలు వచ్చాయి.

ఓల్డ్ బెయిలీలో తమ నేరాన్ని అంగీకరించిన తర్వాత, వారికి చెరో 50 పౌండ్ల జరిమానా విధించారు.

డేవిడ్ సలివన్ వ్యాపార భాగస్వామి ఆ రంగాన్ని వదిలేశారు. కానీ సలివన్ మాత్రం ఆగలేదు. తర్వాతి కాలంలో ఆయన పోర్న్ వ్యాపారం వేగంగా పెరిగింది. అప్పట్లో సమాజం ఆమోదించిన పరిమితులను కూడా ఆయన దాటేశారు.

1970ల చివరి నాటికి ఆయన రోజురోజుకు మరింత అశ్లీలంగా మారుతున్న పోర్న్ మ్యాగజైన్‌లను నెలకు పది లక్షల కాపీలకుపైగా అమ్ముతూ, తాను విక్రయించే సెక్స్ టాయ్స్, అశ్లీల సినిమాల ప్రచారం కోసం వాటిని ఉపయోగించుకునేవారు.

ఆయన దేశవ్యాప్తంగా సెక్స్ షాపుల వ్యాపారాన్ని మొదలుపెట్టి, సొంతంగా అడల్ట్ సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. వాటిలో కొన్ని చిత్రాలలో ఆయన గర్ల్‌ఫ్రెండ్ మేరీ మిల్లింగ్టన్ నటించారు. ఆమె ఒక గ్లామర్ మోడల్, ఆ తర్వాత పోర్నోగ్రఫీ నటిగా మారారు. అప్పటికే ఆమెకు మరొక వ్యక్తితో వివాహమైంది, 33 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకున్నారు.

" మేరీకి ప్రజాదరణ రావడంలో నా పాత్ర చాలా ఉంది. సెక్స్ ఇండస్ట్రీలో నేను సైమన్ కోవెల్ లాంటివాడిని" అని సలివన్ చెప్పారు.

కొత్త పత్రిక ప్రారంభం

సలివన్ ఆస్తి విలువ 1980ల ప్రారంభం నాటికి సుమారు 10 మిలియన్ పౌండ్లు అని, 100కు పైగా సెక్స్ షాపులు, అనేక రేసు గుర్రాలు, చిగ్‌వెల్‌లో ఒక విలాసవంతమైన ఇల్లు ఉన్నాయని 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' పత్రిక నివేదించింది.

ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని 1981లోనే సండే వార్తాపత్రికలో వార్తలు వచ్చాయి. సలివన్‌తో శృంగారంలో పాల్గొనడానికి నిరాకరించినందుకు తనకు ఉద్యోగం ఇవ్వలేదని ఒక మహిళ చేసిన ఫిర్యాదును ఆ పత్రిక ప్రచురించింది.

"ప్రమోషనల్ ఎంటర్‌టైన్‌మెంట్ వర్క్" కోసం ఇచ్చిన ప్రకటనకుఈ పత్రికా రిపోర్టర్ టీనా డాల్గీష్ దరఖాస్తు చేశారు. ఆ ఉద్యోగంలో భాగంగా శారీరక సంబంధం పెట్టుకోవాల్సి ఉంటుందని, ఆమె పనితీరును అంచనా వేయాల్సిన అవసరం తనకు ఉందని సలివన్ తనతో చెప్పినట్లు ఆమె అన్నారు. పై అంతస్తుకు వచ్చి లోదుస్తుల్లో నిలబడమని అడిగాడని, తాను అలానే చేశానని, కానీ తర్వాత దుస్తులు ధరించి అక్కడి నుంచి వెళ్లిపోయానని’’ ఆమె రాశారు.

లండన్‌లో పురుషులు డబ్బు చెల్లించి లైంగిక సేవలు పొందే మసాజ్ పార్లర్ల ద్వారా లాభం పొందినందుకు 1982లో సలివన్ దోషిగా తేలారు. మొదట ఆయనకు 9 నెలల జైలు శిక్ష విధించారు. తర్వాత అప్పీల్‌లో శిక్ష తగ్గడంతో 71 రోజులు మాత్రమే జైలులో గడిపారు.

జైలు నుంచి బయటకు వచ్చాక సలివన్ తన దృష్టిని మెయిన్‌స్ట్రీమ్ పత్రికల ప్రచురణ వ్యాపారం వైపు మళ్లించారు.

సలివన్ 1986లో 'సండే స్పోర్ట్' ప్రారంభించారు. ఇందులో విచిత్రమైన, అసభ్యకరమైన, కామోద్దీపన కథలతో పాటు గ్లామర్ మోడళ్ల ఫోటోలు ఎక్కువగా ఉండేవి. ఈ పత్రిక కొద్దికాలంలోనే ప్రజాదరణ పొందింది. కొన్నేళ్ల తర్వాత 'డైలీ స్పోర్ట్' కూడా ప్రారంభమైంది.

ఆ పత్రికలు "కౌంట్‌డౌన్ టు 16" అనే శీర్షికతో ఒక కథనాన్ని ప్రచురించేవి. ఇందులో ప్రచురితమైన సగం దుస్తులు ధరించిన పాఠశాల విద్యార్థినుల ఫోటోలు ఉండేవి. తర్వాత పై వస్త్రాలు లేని ఫోటోలను ప్రచురించి, ఆ అమ్మాయిల 16వ పుట్టినరోజున మరింత బహిరంగంగా ఫోటోలను ప్రచురించేవారు.

ఆ సమయంలో టాప్‌లెస్‌గా కనిపించడానికి చట్టబద్ధమైన కనీస వయస్సు 16 ఏళ్లు. 2004లో దాన్ని 18కి పెంచారు.

స్పోర్ట్ వార్తాపత్రికల మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్, ప్రస్తుతం బీబీసీ రేడియో 5 లైవ్‌లో ప్రెజెంటర్‌గా ఉన్న టోనీ లైవ్‌సే ఆ పత్రికల గురించి పుస్తకం రాశారు. అందులో ఆ ఫీచర్‌ను తానూ, సలివన్ కలిసి సృష్టించామని చెప్పారు అయితే ఇప్పుడు ఆయన అది తన ఆలోచన కాదని, తన పుస్తకంలోని అనేక భాగాలు కథను ఆసక్తికరంగా చూపించడానికి కల్పితంగా రాశానని చెబుతున్నారు.

పోర్న్ సంపాదనతో ఇల్లు

సలివన్ 1990ల ప్రారంభంలో థేడాన్ బోయిస్ సమీపంలో 12 ఎకరాల భూమిలో నిర్మించిన బిర్చ్ హాల్ అనే విశాలమైన ఇంటికి మారారు. దీని నిర్మాణానికి ఆయన 7.5 మిలియ‌న్ పౌండ్లు ఖర్చు చేశారు. ఇందులో సొంత బౌలింగ్ అల్లే, రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి.

కొన్నేళ్ల తర్వాత తన 40 ఏళ్ల చివరలో అప్పటి స్నేహితురాలు, పోర్న్ చిత్ర నటి, దర్శకురాలైన ఎమ్మా బెంటన్-హ్యూస్‌తో డేవిడ్ జూనియర్, జాక్ అనే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారు.

అప్పటికే సలివన్ ఫుట్‌బాల్ యాజమాన్య రంగంలోకి అడుగుపెట్టారు. సెక్స్ టాయ్స్, లోదుస్తుల దుకాణాల యాన్ సమ్మర్స్ చైన్‌కు యజమానులైన డేవిడ్, రాల్ఫ్ గోల్డ్‌లతో కలిసి 1993లో బర్మింగ్‌హామ్ సిటీని కొనుగోలు చేశారు.

అప్పటికి 23 ఏళ్ల వయసున్న బారొనెస్ కేరెన్ బ్రాడీ స్పోర్ట్ పత్రికల మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తుండగా, సంస్థకు ఎండీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యురాలిగా ఉన్నారు. అలాగే బీబీసీ వన్‌లో ప్రసారమయ్యే ది అప్రెంటిస్ కార్యక్రమంలో లార్డ్ షుగర్‌కు సహాయకురాలిగా కనిపించే టెలివిజన్ వ్యక్తిగానూ గుర్తింపు పొందారు.

బ్రాడీ చాలా కాలంగా సలివన్‌తో సన్నిహితంగా పనిచేశారు. ఇటీవల దాకా ఆమె వెస్ట్‌హామ్ వైస్‌ చైర్మన్‌గా పనిచేశారు. ఈ పుట్‌బాల్ క్లబ్‌ను సలివన్ 2010లో గోల్డ్ సోదరులతో కలిసి స్వాధీనం చేసుకున్నారు.

క్లబ్‌లో సరిపడా డబ్బు ఖర్చు చేయడం లేదని, జట్టు ప్రదర్శన బాగాలేదని వెస్ట్ హామ్ అభిమానుల నుంచి నిరసనలను ఎదుర్కొన్నారు.

ఏప్రిల్‌లో ప్రీమియర్ లీగ్ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు మిగిలి ఉండగా, వెస్ట్‌హామ్ దిగువస్థాయి క్లబ్ పోరుకు పడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు బ్రాడీ వైస్ చైర్మన్ నుంచి దిగిపోయారు. చివరకు ఆ జట్టు దిగువ క్లబ్ స్థాయికి పడిపోయింది.

తీవ్రమైన హింస, మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యవస్థీకృత నేర ముఠాకు అధిపతి అని న్యాయమూర్తి పేర్కొన్న వ్యక్తి డేవిడ్ హంట్‌తో కూడా సలివన్‌కు సంబంధాలు ఉన్నట్టు కథనాలు వెలువడ్డాయి.

సండే టైమ్స్‌పై 2014లో వేసిన పరువు నష్టం దావా విఫలమైన తరువాత ఆ నేర ముఠా నాయకుడిగా పేరున్న హంట్‌పై 8 లక్షల పౌండ్ల విలువైన కోర్టు ఖర్చుల భారం పడింది. ఆ తరువాత ఆయనకు సలివన్ 10 లక్షల పౌండ్లు అప్పుగా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.

అప్పట్లో అది ‘‘సాధారణ వడ్డీ రేటుతో తగిన భద్రతపై ఇచ్చిన సాధారణ వాణిజ్యరుణం ’’ అని సలివన్ ప్రతినిధి పేర్కొన్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)