ఫిఫా వరల్డ్ కప్ విజేత స్పెయిన్.. 1-0 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై విజయం

ఫొటో సోర్స్, Alex Pantling - FIFA/FIFA via Getty Images
- రచయిత, ఫిల్ మెక్‌నల్టీ
- హోదా, న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియం నుంచి చీఫ్ ఫుట్‌బాల్ రైటర్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను స్పెయిన్ గెలుచుకుంది. ఫైనల్ పోటీలో 1-0 గోల్స్ తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి రెండోసారి ప్రపంచ కప్ విజేతగా నిలిచింది.
మ్యాచ్ ప్రధాన సమయంలో రెండు జట్లు గోల్స్ ఏమీ చేయకపోవడంతో అదనపు సమయం ఆడాల్సి రాగా ఎక్స్‌ట్రా టైంలో(106వ నిమిషం) స్పెయిన్ ఆటగాడు ఫెరాన్ టోరెస్ గోల్ చేశాడు.
మ్యాచ్ మొత్తం ఎక్కువగా డిఫెన్స్ ఆడిన అర్జెంటీనా అదనపు సమయం సహా గోల్స్ ఏమీ చేయలేకపోయింది.
దీంతో స్పెయిన్ 1-0తో విజయం సాధించి రెండోసారి కప్ అందుకుంది.

మ్యాచ్ ఎక్స్‌ట్రా టైంకు వెళ్లడానికి కొద్ది నిమిషాల ముందు అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్‌కు రిఫరీ రెడ్ కార్డ్ చూపడంతో ఆయన మైదానాన్ని వీడాల్సి వచ్చింది.
దీంతో 10 మంది ఆటగాళ్లతోనే ఆడిన అర్జెంటీనా అదనపు సమయంలో స్పెయిన్‌ను పూర్తిగా అడ్డుకోలేకపోయింది.
మ్యాచ్ 106వ నిమిషంలో స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ నికో విలియమ్స్ హెడర్ ద్వారా అందించిన బంతిని అందుకున్న టోరెస్ దాన్ని గోల్ వైపు బలంగా పంపించడంతో అర్జెంటీనా కీపర్ ఎమిలియానో మార్టినెజ్ అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది.
దాంతో స్పెయిన్ సంబరాలు మిన్నంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్.. నెమ్మదిగా మొదలై తుపానులా మారి
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ ప్రయాణం కేప్ వెర్డే అనే చిన్న ద్వీప దేశంపై గోల్స్ లేని డ్రాతో ప్రారంభమైంది.
చివరికి ఫుట్‌బాల్‌లోని అత్యున్నత బహుమతిని రెండోసారి సొంతం చేసుకుంటూ గౌరవప్రదమైన విజయంతో ముగిసింది.
టోర్నమెంట్ మొదలైన తర్వాత స్పెయిన్ జట్టు ఆటతీరు క్రమక్రమంగా మెరుగుపడుతూ వచ్చింది. సెమీఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి, ఫైనల్‌లో అర్జెంటీనాపై గెలిచారు.
స్పెయిన్ కోచ్ లూయిస్ డే లా ఫుయెంటే జట్టును అడుగడుగునా వెన్నంటి ఉండి ముందుకు నడిపించారు.
బెర్లిన్‌లో ఇంగ్లండ్ ను ఓడించి యూరో 2024 ఫైనల్‌ను గెలిచినప్పుడు కూడా ఆయన ఇదే పాత్ర పోషించారు. అర్జెంటీనా రెచ్చగొట్టే ప్రయత్నాల మధ్య కూడా ఆయన జట్టు అదే సంయమనాన్ని ప్రదర్శించింది.
అర్జెంటీనా ఆటగాడు ఫెర్నాండెజ్ మైదానాన్ని వీడిన తర్వాత స్పెయిన్‌కు సంఖ్యాపరమైన ఆధిక్యం లభించింది.
డిఫెన్స్ విషయంలో స్పెయిన్ ఎక్కడా పెద్దగా ఇబ్బంది పడలేదు. ప్రత్యామ్నాయ ఆటగాడిగా విలియమ్స్ రంగంలోకి దిగడంతో స్పెయిన్ ఎదురుదాడి పుంజుకుంది.
ఈ ఫైనల్.. టోర్నీలోని అనేక ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ల స్థాయిలో లేకున్నా.. ప్రపంచకప్‌కు పాత విజేతను కొత్తగా పరిచయం చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అర్జెంటీనా.. మెస్సీకి వీడ్కోలు
అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ఫైనల్ మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయాడు. డిఫెండింగ్ చాంపియన్లు తమ కిరీటాన్ని కోల్పోవడంతో మెస్సీ నిష్క్రమణ తీవ్ర నిరాశతో ముగిసింది.
39 ఏళ్ల మెస్సీ ఆటలో ఎక్కువ భాగం నడక వేగంతోనే ఆడుతున్నప్పటికీ ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటికే ఎనిమిది గోల్స్ చేశాడు.
మరోసారి అర్జెంటీనాకు నాయకుడిగా, స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. ముఖ్యంగా ఇంగ్లండ్ పై జరిగిన సెమీ ఫైనల్‌లో 2-1 విజయాన్ని అందించడంలో రెండు గోల్స్‌కు అవకాశాలు సృష్టించాడు.
ఈ మ్యాచ్‌లో మాత్రం స్పెయిన్ అతన్ని సమర్థంగా నియంత్రించింది. అతనికి కేవలం ఒకే షాట్ అవకాశం లభించింది, అది కూడా లక్ష్యాన్ని తాకలేదు. గోల్‌కు అవకాశం ఉన్న ప్రాంతాల నుంచి కూడా అతన్ని దూరంగా ఉంచుతూ నిలువరించింది.
అర్జెంటీనా వ్యూహం కూడా మెస్సీకి సహాయపడలేదు. వారు తమ అసలు ఆటను ప్రదర్శించడంపై దృష్టి పెట్టకుండా స్పెయిన్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆడుతున్నట్లు కనిపించింది.
ప్రపంచ కప్‌ను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించిన అర్జెంటీనా ఈ టోర్నీలో ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది.
అయితే ఫైనల్స్‌లో పరాజయం విషయంలో ఆ జట్టుకు ఎలాంటి కంప్లైంట్లు ఉండకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ ప్రారంభానికి ముందు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ హెలికాప్టర్ కాన్వాయ్‌లో న్యూజెర్సీకి చేరుకున్నారు.
పాప్ గాయకులు షకీరా, మడోనా, జస్టిన్ బీబర్ వరల్డ్ కప్ హాఫ్-టైమ్ షోలో ప్రదర్శన ఇచ్చారు. దీంతో విరామ సమయం 27 నిమిషాలకు పొడిగించారు.
అనేక అంతరాయాలతో సుదీర్ఘంగా సాగిన ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సోమవారం వేకువన 3.30కి ముగిసింది.
కాగా ఈ ఫిఫా వరల్డ్ కప్-2026లో గోల్డెన్ బూట్‌ను ఫ్రాన్స్ ఆటగాడు కిలియన్ ఎంబపే అందుకున్నాడు. మొత్తం 8 మ్యాచ్‌లలో ఎంబపే 10 గోల్స్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు.
స్పెయిన్ మిడ్‌ఫీల్డర్ రోడ్రీ బెస్ట్ ప్లేయర్ అవార్డ్ (గోల్డెన్ బాల్) అందుకున్నాడు.
ఉత్తమ గోల్ కీపర్ అవార్డ్ కూడా స్పెయిన్ ఆటగాడికే దక్కింది. ఆ జట్టు గోల్ కీపర్ యునాయి సైమన్ 'గోల్డెన్ గ్లోవ్' అవార్డ్ దక్కించుకున్నాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































