ఏపీ మునిసిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్ ఎన్నికలు
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి.
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల సమస్యల కారణంగా అభ్యర్థులు ఎక్కడెక్కడ నామినేషన్లు దాఖలు చేయలేకపోయారో, ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల గడువు పొడిగించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు సూచించింది.

ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి 48 గంటల గడువు ఇచ్చింది.

ఈ మునిసిపల్ ఎన్నికల్లో నామినేషన్ల గడువును పొడిగించేలా కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించగా, ఆ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.

దీంతో ఆ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పార్టీ తరపున న్యాయవాది మహీందర్ సింగ్ వాదనలు వినిపించారు.

ఈ కేసును విచారించిన జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఒకవేళ నామినేషన్ల గడువు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులకు కనీసం 48 గంటల గడువు ఇవ్వాలని కోర్టు సూచించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్ ఎన్నికలు
ఫొటో క్యాప్షన్, తుది జాబితా ప్రకటనను అక్టోబర్ 25 వరకు నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది.

సాధారణంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక, పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. ఏదైనా స్థానంలో ఒక్కరే పోటీలో ఉంటే, ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. ఆ జాబితా ప్రకటించిన తరువాత పోలింగ్ ప్రక్రియ నిలిపివేయడం కష్టం.

ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు 12 మునిసిపాలిటీల్లో ఏకగ్రీవ ఎన్నికలకు అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అభ్యర్థుల తుది జాబితా అక్టోబర్ 21 (బుధవారం)న విడుదల కావాల్సి ఉంది.

తుది జాబితా ప్రకటనను అక్టోబర్ 25 వరకు నిలిపివేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, ఈ ఆదేశం రాష్ట్రమంతటికీ వర్తిస్తుందా, లేక సంబంధిత మునిసిపాలిటీలకు మాత్రమే వర్తిస్తుందా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

ప్రభుత్వం ఏమని వాదించింది?

అంతేకాకుండా, నామినేషన్ల గడువు పొడిగిస్తే నామినేషన్ కేంద్రాల వద్ద తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, సీసీటీవీ కెమెరాల నిఘా ఉండేలా చూడాలని, అభ్యర్థులకు రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

''గడువును ఒక రోజు పొడిగించేందుకు ప్రయత్నించండి'' అని జస్టిస్ బాగ్చీ ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి సూచించినట్టు లైవ్‌లా వెబ్‌సైట్ రిపోర్ట్ చేసింది.

ఈ ఆదేశాలపై తీసుకున్న చర్యలకు సంబంధించి అక్టోబర్ 27న అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

''పుంగనూరు, రాయచోటి, కడప, తిరుపతి వంటి ప్రాంతాల్లో తీవ్ర హింస జరిగింది. కడపలో నామినేషన్ పత్రాలను లాక్కుని చింపేశారు. తిరుపతిలో అభ్యర్థులను కార్యాలయాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దాదాపు 63 శాతం స్థానాల్లో మా అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు'' అని వైఎస్సార్సీపీ తరఫున న్యాయవాది మహీందర్ సింగ్ వాదించారు.

ఈ కేసులో రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున పరమేశ్వర్, ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

''హింసకు వైఎస్సార్సీపీయే కారణం. బయటి ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకొచ్చారు. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక కోర్టులు జోక్యం చేసుకోకూడదు. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి'' అని కోర్టుకు తెలిపారు.

సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్ ఎన్నికలు
ఫొటో క్యాప్షన్, అక్టోబర్ 27న అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కోర్టు ఏం చెప్పింది?

సాధారణంగా ఇటీవలి కాలంలో ఎన్నికల షెడ్యూల్ లేదా నోటిఫికేషన్ విడుదల అయిన తరువాత కోర్టులు ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం తగ్గింది. కానీ కొన్ని అరుదైన, కీలక సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి.

''ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగడం ప్రజాస్వామ్యానికి కీలకం. ఎన్నికలు నిర్వహించే బాధ్యత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘానికి ఉన్నప్పటికీ, తాము నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నామని ప్రతిపక్షం మా ముందుకు వచ్చినప్పుడు మౌనంగా ఉండలేం. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా జరిగేలా చూసేందుకు కోర్టులు జోక్యం చేసుకుంటాయి'' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

మరి రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్ల గడువును పొడిగిస్తుందా, లేదా? పొడిగిస్తే వైఎస్సార్సీపీతో పాటు ఇతర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అనుకూల పరిస్థితులు కల్పించేలా డీజీపీ చర్యలు తీసుకుంటారా? ఒకవేళ ఎన్నికల సంఘం గడువు పొడిగించకపోతే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది? ఈ అంశాలు ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అక్టోబర్ 27న మళ్లీ విచారణ జరగనుంది.

కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ: వైసీపీ

''సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు చేస్తూ, బెదిరిస్తూ, నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్ పత్రాలను ముక్కలు ముక్కలుగా చించేశారు. మా పార్టీ అభ్యర్థులను రక్షించడంలో పోలీసులు విఫలమయ్యారు. ఈ సంఘటనలన్నింటినీ ఆధారాలతో సహా రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించాం" అని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు.

''సుప్రీంకోర్టు అందిన ఫిర్యాదులు, ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలన్నింటినీ పరిశీలించి, నామినేషన్ల గడువు పొడిగించాలని నిర్ణయిస్తే, అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసేందుకు కనీసం 48 గంటల సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే అభ్యర్థులకు తగినంత పోలీసు బందోబస్తు, భద్రత, రక్షణ కల్పించాలని, సీసీటీవీ నిఘా ఉండేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీని ఆదేశించింది'' అన్నారు.

సుప్రీం ఆదేశాలను వక్రీకరించారు: ఏపీ సీఎంఓ

''మునిసిపల్ ఎన్నికలపై సొంత మీడియా ద్వారా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. 19 చోట్ల మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పొడిగిస్తున్నట్లు సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినట్టు వక్రీకరించారు. వైసీపీ అభ్యంతరాలు లేవనెత్తిన చోట్ల వారి ఫిర్యాదులను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని మాత్రమే ఎస్ఈసీకి సుప్రీంకోర్టు సూచించింది. అంటే ఫిర్యాదులు వచ్చిన చోట మళ్లీ నామినేషన్లు తీసుకోవాలా వద్దా అనే విషయాన్ని ఎస్ఈసీకే వదిలివేసింది. నామినేషన్ల ప్రక్రియతో పాటు ఎన్నికల నిర్వహణపై సుప్రీంకోర్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను నిలిపివేయాలని ఆదేశించింది కేవలం 19 చోట్ల మాత్రమే. నామినేషన్ కేంద్రంలో ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన అనుచరుల అరాచకాలను ప్రభుత్వ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుంచి మారణాయుధాలతో దుండగులను వైసీపీ తీసుకొచ్చిందని, వారిని పోలీసులు అరెస్టు చేశారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాం'' అని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)