సింగీతం శ్రీనివాసరావు: కాలం కంటే ముందు నడిచిన దర్శకుడు

ఫొటో సోర్స్, instagram.com/ikamalhaasan
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
సింగీతం శ్రీనివాసరావు కాలం కంటే ముందు నడిచిన వ్యక్తి. అందుకే తెలుగులో మొదటి టైమ్ మిషన్ కథ ఆదిత్య 369 తీయగలిగారు.
మాయాబజార్ తీసిన కేవీ రెడ్డి ప్రపంచస్థాయి డైరక్టర్. ఆయన శిష్యుడు సింగీతం స్థాయి కూడా అదే. ప్రపంచంలోని గొప్ప సినిమాల్లో పుష్పక విమానం ఒకటి. వయో భారంతో సింగీతం 94 ఏళ్ల వయసులో మరణించారు. మనకు మరుపురాని సినిమాలు మిగిల్చారు.
ఉదయగిరిలో 1931లో పుట్టిన సింగీతానికి ఇంటిపేరులోనే గీతం, సంగీతం రెండూ వున్నాయి. తల్లి వయోలిన్ విద్వాంసురాలు. గానం చిన్నప్పుడే అబ్బింది.
మద్రాసులో చదువుతున్నపుడు హరీంద్రనాథ్ (సరోజనిదేవి సోదరుడు) నాటకం నేర్పించారు. సింగీతానికి చిత్రలేఖనంలోనూ ప్రవేశం ఉంది.
చదువు పూర్తయ్యాక సూళ్లూరుపేటలో టీచర్‌గా పని చేశారు. కానీ విధి నిర్ణయం ఇంకోలా వుంది.

సింగీతం 23 ఏళ్ల వయసులో చెన్నై (అప్పట్లో మద్రాసు) వెళ్లి కేవీ రెడ్డిని కలిశారు. మాయాబజార్ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడు. కానీ నిర్మాతల మధ్య గొడవలు. సినిమా ఆగిపోయింది. తర్వాత దొంగరాముడు (1955)లో అవకాశం దక్కింది. పేరు, డబ్బు రెండూ అడగకూడదు, ఇదీ షరతు. పంతానికి సరేనన్నారు సింగీతం.
మాయాబజార్ షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. జీతం 200రూపాయలు. పెళ్లి తర్వాత 50 రూపాయలు పెంచారు. ఆ డబ్బుతో ఆనందంగా ఉండటమే కాదు, ఇంకా మిగిలేవి కూడా. సింగీతం అంటే ఆనందం. సెన్సాఫ్ హ్యూమర్ ఆయన బలం.
కేవీ శిష్యరికంలో జగదేకవీరుని కథ, కృష్ణార్జున యుద్ధం సినిమాలకి పని చేశారు. ఒకసారి కృష్ణార్జునయుద్ధం షూటింగ్‌లో సింగీతానికి ఏదో సందేహం వస్తే కేవీ రెడ్డి షూటింగ్ ఆపి, కెమెరామెన్ మార్కస్ బాట్లేతో చర్చించారు. శిష్యుడంటే గురువుకి అంత గురి. అసిస్టెంట్‌గా సింగీతం తీసుకున్న ఆఖరి జీతం 400 రూపాయలు.
సింగీతం అంటేనే ప్రయోగం
సింగీతం తొలి సినిమా 1972లో విడుదలైన నీతి నిజాయితీ. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం సింగీతం అయితే, మాటలు పింగళి నాగేంద్రరావు. 72 నాటికి ప్రపంచంలో ఇంకా వేగం పెరగలేదు. పట్టణీకరణ అందుకోలేదు. కానీ నీతి నిజాయితీ సినిమాలో మొదటి డైలాగే "జీవితంలో వేగం పెరిగింది" అని ఉంటుంది.
"గ్రామాల్లో ఇంకేమీ లేదు, పదండి పట్టణాలకు" అని పల్లె ప్రజలకి నాగభూషణం ఉపదేశించడంతో సినిమా మొదలవుతుంది. నీతినిజాయితీని విమర్శకులు మెచ్చుకున్నారు కానీ డబ్బు రాలేదు. దీనికి కారణం హీరో మూగవాడు (హిందీ నటుడు సంతోష్ అరోరా).
ప్రయోగాలు చేయడం మొదటి సినిమా నుంచే సింగీతానికి అలవాటు.
తొమ్మిదేళ్ల తర్వాత కమల్‌హాసన్ లాంటి పెద్ద హీరోతో అమావాస్య చంద్రుడు తీశారు (1981). ఎల్వీ ప్రసాద్ అద్భుతంగా తాత పాత్ర వేసిన ఈ సినిమా అమావాస్యనే మిగిల్చింది. కారణం హీరో అంధుడు. డబ్బులు రాకపోయినా క్లాసిక్‌గా మిగిలింది. తర్వాత ఆయన కమల్‌తో చేసిన ప్రయోగాలకి మాటలు చాలవు.
మొదటి సినిమా తుస్సుమనే సరికి రెండో సినిమా దిక్కట్రపార్వతి (1974) తమిళంలో తీశారు. నీతి నిజాయితీకి డబ్బులు రాకపోయినా, రెండో సినిమాకి కూడా వాళ్లే నిర్మాతలు (ఎం.లక్ష్మీకాంతరెడ్డి , సంజీవరెడ్డి). సింగీతం అంటే అంత నమ్మకం వాళ్లకి.
సి.రాజగోపాలచారి కథతో తీసిన దిక్కట్ర పార్వతికి నేషనల్ అవార్డ్ వచ్చింది. దిల్లీలో మొదటిసారి కమల్‌హాసన్ పరిచయమయ్యారు.

ఫొటో సోర్స్, PTI
కమల్ హాసన్, సింగీతం కాంబినేషన్ అంటే....
మూడో సినిమా జమీందారుగారి అమ్మాయి 1975లో విడుదలయింది.
ఒక షెడ్యూల్ షూటింగ్ తర్వాత ఎస్వీ రంగారావు హఠాత్తుగా చనిపోయారు. జమిందారు పాత్రని గుమ్మడి వేశారు. మంచి పాటలున్న ఈ సినిమాలో అవేవీ జనానికి ఎక్కలేదు. మంగమ్మా నువ్వు ఉతుకుతుంటే పాట సూపర్‌హిట్ అయింది. అది బాబీ సినిమాలో హమ్ తుమ్ ఏక్ కమరేకి కాపీ.
సింగీతం మీద ఆయా కులసంఘాలు కేసులు వేశాయి. బెదిరింపు లేఖలు వచ్చాయి. కమర్షియల్ సంగతి పక్కన పెడితే సింగీతానికి మంచిపేరు వచ్చింది.
సింగీతం 1976లో మూడు సినిమాలు తీస్తే వాటిలో అమెరికా అమ్మాయి ఒక మోస్తరుగా ఆడింది. 1977లో అందమే ఆనందం తీశారు. ఆడవాళ్ల ఫ్రిజిడిటీపై తొలి సినిమా. అయితే అదే సమయంలో దాసరి, శ్రీదేవి కాంబినేషన్‌లో మా బంగారక్క వచ్చింది. రెండూ ఒకటే కథ కావడంతో వివాదం ఒక దశలో కోర్టు వరకు వెళ్లింది.
ఇక 1978లో వచ్చిన సొమ్మొకడిది సోకొకడిది పెద్ద హిట్. కమల్‌తో పుష్పక విమానం, మైకేల్ మదన్ కామరాజు, విచిత్ర సోదరులు వరుస ప్రయోగాలు చేశారు. అల్‌టైమ్ క్లాసిక్స్.

ఫొటో సోర్స్, Kiran_Abbavaram/x.com
పుష్పక విమానం వచ్చి....
బాలకృష్ణతో తీసిన మూడింటిలో రెండు సూపర్ హిట్. భైరవ ద్వీపం, ఆదిత్య 369. సింగీతం అన్ని భాషల్లో దాదాపు 60 సినిమాలు తీశారు. ఆయన ప్రత్యేకత ఏమంటే ఏ ఒక్క కథ మరోదాన్ని పోలి వుండదు. సింగీతం మూస సినిమాల్లో ఇరుక్కుపోలేదు.
అక్కినేనితో తీసిన పిల్ల జమీందార్ కూడా డిఫరెంట్‌గా వుంటుంది. ఎన్టీఆర్‌తో అత్యంత సాన్నిహిత్యం ఉన్నప్పటికీ ఆయనతో ఒక్క సినిమా కూడా తీయలేకపోయారు. బాలకృష్ణతో ఆ కోరిక తీర్చుకున్నారు.
మయూరిలో సుధాచంద్రన్‌తో ఆమె జీవిత కథలోనే నటింపజేశారు. మేడమ్‌లో రాజేంద్రప్రసాద్‌తో ఆడవేషం వేయించారు. విచిత్ర సోదరులులో పొట్టి కమల్‌హాసన్‌ని గ్రాఫిక్స్ లేని రోజుల్లో ఎలా చూపించారో ఇప్పటికీ ఆశ్చర్యమే. కమల్, సింగీతం గొప్పతనం ఏమంటే జపాన్ అనే సెట్ అసిస్టెంట్ వల్లే ఈ మ్యాజిక్ సాధ్యమైందని బహిరంగంగా చెప్పారు. చిన్నవాళ్లని కూడా వాళ్లు గౌరవించే పద్ధతి అది.
కమల్‌కు, సింగీతానికి ఒక దశలో చెడిందని గట్టిగా వినిపించింది. ఆ తర్వాత ఇద్దరూ అనేక సినిమాలకి పని చేశారు. కారణం ఇద్దరిలో సమానంగా ఉన్న హాస్య ప్రవృత్తి.
సెన్సాఫ్ హ్యూమర్ తండ్రి నుంచి వచ్చిందని సింగీతం చెప్పుకుంటారు. ఆయన సినిమాల్లో ఎమోషన్ కంటే హాస్యమే ఎక్కువ వుంటుంది. ఆయన మాటల్లో కూడా.
నాలుగేళ్ల క్రితం సతీమణి చనిపోయినపుడు కొంత దిగులు పడ్డారు. అయినా కూడా ఈ మధ్యనే ‘సింగ్ గీతం’ సినిమా తీసి సంగీతంపై ప్రేమను చాటుకున్నారు. సినిమాలో పాటలుంటాయి కానీ, పాటే సినిమా అయితే అదే ఆయన సృజనాత్మకత.
పుష్పక విమానం వచ్చి ఆయన్ని స్వర్గానికి తీసుకెళుతుంది. అక్కడ సింగీతం, దేవేంద్రుడితో జోకులేస్తూ ఏదో స్క్రిప్ట్ మొదలు పెడతారు.
ఇక సెలవు సార్.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























