కుక్కలను రక్షిస్తామన్న చోటే 100కుపైగా శునకాల కళేబరాలు, వాటిపై తుపాకీ గాయాలు, అసలేం జరిగింది?

    • రచయిత, నార్డిన్ శాడ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

ఉత్తర కాలిఫోర్నియాలో వివిధ రకాలుగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న 117 శునకాల అవశేషాలు కనిపించాయి. వాటిలో చాలావాటికి తుపాకీ గాయాల గుర్తులున్నాయి. జంతుసంరక్షణకు ఉద్దేశించిన ''నో – కిల్''కేంద్రం ప్రాంగణంలో ఇవి కనిపించాయి.

పెద్ద ఎత్తున జంతువులను పూడ్చిపెట్టారనే ఆరోపణలపై ఆధారాల కోసం అధికారులు మిమిరాండా జంతు సంరక్షణ కేంద్రంలోని బహిరంగ ప్రదేశాలలో తవ్వకాలు జరిపారని హమ్‌బోల్ట్ కౌంటీ షరీఫ్ కార్యాలయం తెలిపింది. ఈ తవ్వకాలలో 600 కుక్కల కాలర్లు కూడా గుర్తించారు.

ఈ కేంద్రం నుంచి వందలాది జంతువులు కనిపించకుండాపోయిన తరువాత వీటి విషయంలో ఏమైనా మోసం జరిగిందా..?జంతు హింసకు పాల్పడ్డారా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు.

‘‘ఏదైనా నిర్ణయానికి రావడానికి ముందు నిజాలను పరిగణనలోకి తీసుకోవాలని’’ జంతు సంరక్షణా కేంద్రం యజమాని కోరారు.

సంరక్షణాకేంద్రానికి వెళ్లి పరిశీలించిన స్థానికుడు

ఈ కేసులో మీడియా కవరేజ్, సోషల్ మీడియాలో చూపిస్తున్న విషయాల్లో పూర్తి నిజం లేదని, వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని చేరవేస్తున్నాయని షెల్టర్ యజమాని, షన్నన్ మిరాండా చెప్పారు. శునకాల అవశేషాలు బయటపడకముందు ఆయన ఈ ప్రకటన చేశారు.

ఆ జంతుసంరక్షణా కేంద్రానికి బీబీసీ వెళ్లింది.

మిరాండాపై ప్రస్తుతం ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు నమోదుచేయలేదు.

మిరాండా రెస్క్యూ కేంద్రంపై పలు ఆరోపణలొచ్చాయి. జంతువులపై తీవ్రమైన హింస, క్రూరత్వం, మోసం, కుట్ర వంటి ఆరోపణలున్నాయి. దీనిపై విశ్వసనీయ సమాచారం అందిన తర్వాత ఏప్రిల్‌లో హమ్‌బోల్ట్ కౌంటీ షరీఫ్ కార్యాలయం దర్యాప్తు ప్రారంభించింది.

కుక్కలను అక్కడ పాతిపెట్టినట్టు భావిస్తున్న ఓ స్థానికుడు ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకోడానికి ఏప్రిల్‌లో అనుమతి లేకుండా ఆ కేంద్రం ప్రాంగణంలోకి ప్రవేశించి, అక్కడ తవ్వి చూశారు. ఆ తర్వాత ఈ విచారణ ప్రారంభమైందని స్థానిక మీడియా రాస్తోంది.

ఆ రెస్క్యూ కేంద్రానికి 2025 ప్రారంభం నుంచి 900కుక్కలను తీసుకొచ్చినట్టు దర్యాప్తులో తేలింది. వాటిలో 116 కుక్కలను మాత్రమే పెంచుకోడానికి తీసుకెళ్లారు. 700కు పైగా కుక్కల లెక్క తేలడం లేదని షరీఫ్ విలియమ్ హోన్సాల్ చెప్పారు.

‘కాల్చిచంపినట్టు అనుమానాలు’

కాలిఫోర్నియాలోని ఫోర్టునా ప్రాంతంలో ఉన్న ఈ సంరక్షణాకేంద్రం ప్రాంగణంలో రెండు ప్రదేశాలలో తవ్వగా 117కుక్కల అవశేషాలు బయటపడ్డాయని షరీఫ్ కార్యాలయం జూన్ 26న ప్రకటించింది.

50 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ జంతుసంరక్షణాకేంద్రంలో మరో 21 కుక్కల పుర్రెలు, వందలసంఖ్యలో ఇతర ఎముకలను గుర్తించారు. అలాగే మరో ప్రదేశంలో తవ్వగా ఆరు మైక్రో చిప్‌లు దొరికాయి.

70 కుక్కల కళేబరాలకు నిర్వహించిన ఎక్స్‌రేలో బుల్లెట్ ముక్కలు కనిపించాయి. కాల్పుల వల్ల అయిన గాయాలతోనే చాలా కుక్కలు మరణించినట్టు ప్రాథమిక పరీక్షల్లో తేలిందని అధికారులు చెప్పారు.

అదే పొలంలో ఉత్తరం వైపు జరిపిన తవ్వకాల్లో మరింత కుళ్లిపోయిన స్థితిలో ఇంకొన్ని కుక్కల కళేబరాలు కనిపించాయని షరీఫ్ కార్యాలయం తెలిపింది.

ఒక పశువుల కొట్టాన్ని గుర్తించామని, బహుశా కుక్కలను అక్కడే చంపి ఉండొచ్చని పేర్కొంది.

మైక్రో చిప్స్ ఎందుకున్నాయి?

చనిపోయిన కుక్కల్లో చాలావాటికి మైక్రోచిప్స్ అమర్చిఉన్నాయి. ఆ చిప్‌లను పరిశీలించి కుక్కల సమాచారం తెలుసుకునేప్రయత్నం చేస్తున్నారు.

తన కేంద్రం ''నో కిల్ రెస్క్యూ''పై మీడియాలో వస్తున్న, అధికారులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని మిరాండా చెప్పారు.

దత్తత ఇవ్వడం కష్టమైన విషయాల్లో ఇతర షెల్టర్లు చివరి ఆప్షన్‌గా తమలాంటి రెస్క్యూ కేంద్రాలను ఆశ్రయిస్తాయని ఆయన చెప్పారు. మిరాండా రెస్క్యూని నో కిల్ రెస్క్యూగా నిర్వహిస్తున్నానని ఆయన తెలిపారు.

ఖాళీ స్థలం కోసం తామెప్పుడూ జంతువులకు యూథనేసియా(కారుణ్య మరణం)కు గురిచేయలేదన్నారు. ప్రాణాంతక వ్యాధితో జంతువు బాధపడుతున్నప్పుడు, తీవ్రమైన ప్రమాదంగా మారినప్పుడు, మనుషులు లేదా ఇతర జంతువులకు ప్రమాదకరంగా మారినప్పుడు మాత్రమే యూథనేషియా నిర్వహించామని ఆయన వివరించారు.

దర్యాప్తు కొనసాగుతోందని, ఇది చాలా క్లిష్టమైన కేసని, పరిశీలించాల్సిన ఆధారాలున్నాయని షరీఫ్ కార్యాలయం తెలిపింది. రెండు నెలలుగా దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు.

''జంతువులపై క్రూరత్వం, మోసం లేదా ఇతర చట్టాల ఉల్లంఘన జరిగినట్టు తగిన ఆధారాలు లభిస్తే, ఈ కేసును ప్రభుత్వ న్యాయవాదుల బృందానికి పంపిస్తాం. వారు క్రిమినల్ కేసులు నమోదు చేయాలా వద్దో నిర్ణయిస్తారు'' అని అధికారులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)