హెర్డ్ దీవిలోని సీల్ సంతతిలో దాదాపు 75 శాతం తుడిచిపెట్టేసిన హెచ్5ఎన్1 బర్డ్‌ఫ్లూ వైరస్, ఆస్ట్రేలియాలోనూ మొదటికేసు

    • రచయిత, ఇవెట్ టాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

ఆస్ట్రేలియాలో మొదటిసారిగా హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ రకం బయటపడినట్లు ఆ దేశ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. తీవ్రంగా వ్యాపించే ఈ వైరస్ రకం ఇప్పుడు అన్ని ఖండాలకూ చేరుకుంది.

పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక సుదూర ప్రాంతంలో, వలస వెళ్లే సముద్ర పక్షి అయిన 'బ్రౌన్ స్కూవా'కు ఈ వైరస్ సోకినట్లు వ్యవసాయ మంత్రి జూలీ కాలిన్స్ శనివారం తెలిపారు

పెర్త్ నగరానికి ఆగ్నేయంగా దాదాపు 700 కి.మీ. దూరంలో ఉన్న ఎస్పెరెన్స్ పట్టణ సమీపంలోని 'కేప్ లె గ్రాండ్ నేషనల్ పార్క్' బీచ్‌లో ఆ పక్షిని గుర్తించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.

ఇంతకుముందు వరకు హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ రకం నమోదు కాని ఏకైక ఖండంగా ఆస్ట్రేలియా ఉండేది. ఈ వైరస్ రకం పెంపుడు కోళ్లు, అడవి పక్షులలో చాలా వేగంగా వ్యాపిస్తుంది.

మనుషులకు ఈ వ్యాధి సోకిన ఘటనలు ఇప్పటికీ చాలా అరుదుగానే ఉన్నాయి.

"బర్డ్ ఫ్లూ బారిన పడకుండా ఎల్లకాలం ఉండలేమని మనందరికీ తెలుసు" అని మంత్రి జూలీ కాలిన్స్ మీడియా సమావేశంలో చెప్పారు.

ఎస్పెరెన్స్ బీచ్‌లోనే నీరసించిపోయి పడివున్న 'సదరన్ పెట్రెల్' అనే పక్షిలో రెండో అనుమానాస్పద బర్డ్ ఫ్లూ కేసు నమోదైందని కాలిన్స్ తెలిపారు. అయితే, ప్రస్తుతం పక్షులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని ఆమె స్పష్టం చేశారు.

ఆస్ట్రేలియాలోని ఇతర జంతువులలో కూడా ఈ వైరస్ ఉందో లేదో కొద్దిరోజుల్లోనే తెలుస్తుందని అంతరించిపోతున్న జాతుల కమిషనర్ ఫియోనా ఫ్రేజర్ చెప్పినట్లు జాతీయ వార్తాసంస్థ ఏబీసీ రిపోర్ట్ చేసింది.

ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చని అధికారులు చాలాకాలంగా అప్రమత్తంగా ఉన్నారని.. దీనిపై శనివారమే అత్యవసర జంతు వ్యాధుల నియంత్రణ కమిటీ సమావేశమైందని ఆస్ట్రేలియా చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ బెత్ కుక్సన్ చెప్పినట్లు తెలిపింది.

గత ఏడాది అక్టోబర్‌లో.. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాన భూభాగానికి చాలా దూరంగా ఉన్న 'హెర్డ్', 'మెక్‌డొనాల్డ్' దీవులలో హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ రకం బయటపడింది.

ఈవారం విడుదలైన ఒక అధ్యయనం ప్రకారం, హెర్డ్ దీవిలో నివసించే 17,000 సీల్ జంతువులలో.. గత ఆగస్టు నుంచి హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ రకం వల్ల దాదాపు 13,000 సీల్ పిల్లలు చనిపోయాయి. అంటే అక్కడ ఉన్న మొత్తం సీల్ సంతతిలో 75 శాతానికి పైగా చనిపోయాయి. పెంగ్విన్‌లు కూడా ఊహించిన దాని కంటే ఎక్కువ సంఖ్యలో మరణించినట్లు వారు గుర్తించారు.

దాదాపు 1,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్రాన్స్ ఆధీనంలోని 'క్రోజెట్' దీవుల నుంచి వలస వచ్చిన పక్షుల ద్వారా గత ఆగస్టులో ఈ దీవులకు బర్డ్ ఫ్లూ సోకి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మొదటిసారి ఎప్పుడు బయటపడింది?

బర్డ్ ఫ్లూ అనేది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది పక్షులకు, కొన్నిసార్లు నక్కలు, సీల్స్, నీటి కుక్కలు (అట్టర్స్) వంటి ఇతర జంతువులకు కూడా సోకుతుంది.

ప్రపంచవ్యాప్తంగా అడవి పక్షులలో వ్యాపిస్తున్న ప్రధాన వైరస్ రకాన్ని హెచ్5ఎన్1 అని పిలుస్తారు. ఇది 1990ల చివర్లో చైనాలో వెలుగుచూసింది.

పక్షుల వలసల కారణంగా పెంపుడు పక్షులు, అడవి పక్షులలో ఈ వ్యాధి వ్యాపించింది. చాలా అరుదైన సందర్భాలలో, సాధారణంగా జబ్బుపడిన జంతువులతో పరిచయం ఏర్పడటం వల్ల మనుషులకు కూడా ఈ వైరస్ సోకింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)