మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితుల విడుదల - దర్యాప్తు సంస్థలు భిన్నమైన రిపోర్టులు ఇవ్వడంపై బాంబే హైకోర్టు ఏమన్నది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఉమాంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
మహారాష్ట్రలోని మాలేగావ్‌లో, 2006లో జరిగిన పేలుళ్లలో 31 మంది మరణించగా, 300 మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులోని నలుగురు నిందితులపై ఉన్న అభియోగాలను ఏప్రిల్ 22న బాంబే హైకోర్టు డిశ్చార్జ్ చేసింది.
నిందితులపై విచారణ కొనసాగించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు పేర్కొంది.
ఈ పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ), యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) "పరస్పర విరుద్ధ కథనాలు" సమర్పించాయని కోర్టు తెలిపింది. ఈ కేసులో 'సహజమైన వైరుధ్యం', 'స్వాభావిక అసంబద్ధత' ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
చార్జిషీట్ దాఖలైన తర్వాత వచ్చే దశ డిశ్చార్జ్. కోర్టు చార్జిషీట్‌ను పరిశీలించి, నిందితులపై విచారణ కొనసాగించేందుకు తగినన్ని సాక్ష్యాధారాలున్నాయా? లేవా? అని పరిశీలిస్తుంది.
తగిన ప్రాథమిక సాక్ష్యాధారాలు లేవని కోర్టు భావిస్తే, నిందితులపై నమోదైన అభియోగాలను డిశ్చార్జ్ చేస్తుంది. అంటే నిందితులను విడుదల చేస్తుంది. బాంబే హైకోర్టు ఇప్పుడు అదే చేసింది.

దాదాపు 20 ఏళ్ల తర్వాత, మూడు సంస్థలు దర్యాప్తు చేసిన బాంబు పేలుళ్ల కేసు ఇలా నీరుగారిపోయింది.
దీంతో ఈ కేసులో నిందితులెవరూ విచారణను ఎదుర్కోవడం లేదు.
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) 9 మంది ముస్లింలు ఈ పేలుళ్లకు పాల్పడినట్లు ఆరోపించగా, ఎన్ఏఐ మాత్రం నలుగురు హిందువులు ఈ పేలుళ్లకు పాల్పడ్డారంటూ పూర్తిగా భిన్నమైన ఆరోపణలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలేం జరిగిందంటే..
దాదాపు ఇరవై ఏళ్ల కిందట, 2006 సెప్టెంబర్ 8న, రంజాన్ పండుగకు రెండు వారాల ముందు వచ్చే ముస్లింలకు పవిత్ర దినమైన షబ్ ఇ బరాత్ రోజున మాలేగావ్‌లో నాలుగు పేలుళ్లు జరిగాయి.
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) 2006 అక్టోబర్‌లో ఈ కేసు దర్యాప్తు ప్రారంభించింది.
హత్య, ఉగ్రవాదం, చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) సహా ఐపీసీలోని పలు ఇతర సెక్షన్ల కింద 9 మంది ముస్లిం పురుషులను అరెస్టు చేసింది.
ఏటీఎస్ కేసు ప్రకారం, ప్రస్తుత నిషేధిత జాబితాలో ఉన్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా (సిమి) సభ్యులైన నిందితులు, ప్రభుత్వాన్ని కూల్చివేసేలా తిరుగుబాటుకు ఉసిగొల్పేందుకు ప్రయత్నించారు.
నిందితుల్లో ఇద్దరు శిక్షణ పొందేందుకు పాకిస్తాన్ వెళ్లారని ఏటీఎస్ ఆరోపించింది.
"ముస్లింలను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు" ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతంలో నిందితులు బాంబు పేలుళ్లకు పూనుకున్నారని ఏటీఎస్ పేర్కొంది. అలాగే, బాంబుల తయారీ కోసం ఇద్దరు నిందితులు 20 కిలోల ఆర్డీఎక్స్ను సేకరించారని, పేలుళ్ల కోసం హిందూ దుకాణదారుల నుంచి సైకిళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. 2007లో సీబీఐ కూడా ఈ కేసులో భాగమై, అనుబంధ చార్జిషీట్లను దాఖలు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
కేసులో కీలక మలుపు
అనంతరం 2010లో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. హైదరాబాద్‌లో, 2007లో జరిగిన బాంబు పేలుళ్ల కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సమయంలో, 2010లో స్వామి అసీమానంద్ అలియాస్ నబా కుమార్ సర్కార్ అనే వ్యక్తి మాలేగావ్ పేలుళ్లకు పాల్పడింది హిందువులేనంటూ ఒక వాంగ్మూలం ఇచ్చారు. (ఆ తర్వాత, అది బలవంతపు వాంగ్మూలమని ఆయన చెప్పారు.)
అనంతరం, ఈ కేసు దర్యాప్తును 2011 ఏప్రిల్‌లో ఎన్ఐఏకు అప్పగించింది కేంద్రం.
రెండేళ్ల తర్వాత ఈ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ, నలుగురు హిందూ పురుషులను నిందితులుగా పేర్కొంటూ అరెస్టు చేసింది.
మాలేగావ్ పేలుళ్లు 'మావాళ్ల పనే' అని నిందితుల్లో ఒకరు తనతో చెప్పారని అసీమానంద్ చెప్పినట్లు ఎన్ఐఏ చార్జిషీట్లో పేర్కొంది.
ఎన్ఐఏ సమర్పించిన వాంగ్మూలం ప్రకారం, "86 శాతం ముస్లిం జనాభా" ఉన్న కారణంగా మాలేగావ్‌ను "అనువైన ప్రదేశం"గా ఎంచుకున్నారు.
ఏటీఎస్ నిందితులుగా గుర్తించిన ముస్లింలను "బట్టలు విప్పమని బలవంతం చేయడంతో" నేరాంగీకార వాంగ్మూలాలు ఇచ్చారని, ఇప్పుడు వారు ఆ వాంగ్మూలాలు ఉపసంహరించుకుంటున్నారని ఎన్ఐఏ పేర్కొంది. నిందితులుగా ఉన్న 9 మంది ముస్లిం పురుషులపై కేవలం 'అనుమానాల ఆధారంగానే' అభియోగాలు మోపారని పేర్కొంటూ మహారాష్ట్రలోని ఒక సెషన్స్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేసినట్లు ఎన్ఐఏ తన చార్జిషీట్లో తెలిపింది.
ఆసక్తికరమైన విషయమేంటంటే.. 9 మంది ముస్లింల విడుదలను ఏటీఎస్ వ్యతిరేకించగా, ఎన్ఐఏ సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ ఏటీఎస్ దాఖలు చేసిన అప్పీల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
మరోవైపు, 2025 సెప్టెంబర్‌లో మహారాష్ట్రలోని ఒక కోర్టు ఎన్ఐఏ పేర్కొన్న నలుగురు హిందువులపై అభియోగాలు నమోదు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ, తమపై మోపిన అభియోగాలను డిశ్చార్జ్ చేయాలంటూ వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 22న, ఈ అప్పీల్‌పైనే విచారణ జరిగింది.
అభియోగాలు నమోదు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు "సరైన కారణాలతో ఇచ్చినవే" అని, హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ఎన్ఐఏ తరఫు న్యాయవాది వాదించారు.
అయితే, ఎన్ఐఏ సమర్పించిన సాక్ష్యాధారాలు "ఆమోదయోగ్యమైనవి కావు" అని, నిందితులపై విచారణ జరిపేందుకు అవి సరిపోవని నిందితుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
"తదుపరి విచారణ" పేరుతో ఎన్ఐఏ "మళ్లీ కొత్తగా దర్యాప్తు" చేపట్టాలనుకోవడం సరికాదని వాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తులో జాప్యం
నలుగురు నిందితులకు వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలు ఆమోదయోగ్యం కావన్న వాదనలతో కోర్టు కూడా ఏకీభవించింది.
ఎన్ఐఏ కేసు పూర్తిగా 'సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్'(పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలు)పై ఆధారపడి ఉందని.. ప్రధానంగా నిందితులు, అసీమానంద్ ఇచ్చిన నేరాంగీకార వాంగ్మూలాలు.. ఏటీఎస్, సీబీఐ మొదటి విడత నిందితుల నుంచి సేకరించిన వాంగ్మాలాల ఆధారిత కేసుగా పేర్కొంది.
విచారణలో ఎన్ఐఏ జాప్యాన్ని, అది సాక్ష్యాధారాలను ఎలా ప్రభావితం చేస్తుందో కోర్టు ప్రస్తావించింది.
భారతీయ చట్టాల ప్రకారం, పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కొత్తగా మరేదైనా సాక్ష్యం లభిస్తేనే దానిని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ కేసులో సదరు నలుగురు నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు "బాంబు పేలుళ్లకు ప్రణాళికలు, ఏర్పాట్లు" జరిగిన ప్రాంతాలను చూపించాయని ఎన్ఐఏ వాదించింది.
అయితే, పేలుడు జరిగిన ఆరేళ్ల తర్వాత స్వాధీనం చేసుకున్న వస్తువుల ఆధారంగా నిందితుల వాంగ్మూలాలను విశ్వసించలేమని కోర్టు పేర్కొంది. అలాగే, స్వాధీనం చేసుకున్న ఆ వస్తువులు ఎవరూ తిరగని రక్షిత ప్రదేశంలో దొరికినవి కాదని, అందరూ తిరిగే బహిరంగ ప్రదేశంలో అవి దొరికాయని పేర్కొంది.
అనంతరం, నిందితులను గుర్తించేందుకు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్‌ను నిర్వహించినట్లు ఎన్ఐఏ తెలిపింది.
ఎవరైనా నిందితుడిని గుర్తించేందుకు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహిస్తారు. అప్పుడు నిందితుడిని చూశానని చెబుతున్న సాక్షి, నిందితులు కానివారితో కలిపి వరుసగా నిల్చుని ఉన్న వారిలో నుంచి నిందితుడిని గుర్తుపట్టాల్సి ఉంటుంది.
ఈ కేసులో భారీ జాప్యం తర్వాత ఎన్ఐఏ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ నిర్వహించిందని కోర్టు పేర్కొంది. "ఘటన జరిగిన ఆరేళ్ల తర్వాత నిర్వహించే పరేడ్‌కు సాక్ష్యంగా పరిగణించేంతటి విలువ ఉండదు" అని కూడా కోర్టు తెలిపింది. కేవలం టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడ్ మాత్రమే బలమైన ఆధారంగా పరిగణింపజాలదని కోర్టు పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
అసీమానంద్ వాంగ్మూలం
అసీమానంద్ వాంగ్మూలాన్ని కూడా విశ్వసించలేమని కోర్టు పేర్కొంది.
ఆయన వాంగ్మూలాలు స్వచ్ఛందంగా ఇచ్చినవి కావని అజ్మేర్, హైదరాబాద్ ట్రయల్ కోర్టులు నిర్ధరించాయని కోర్టు తెలిపింది. అలాగే, మాలేగావ్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీట్లో సాక్షిగా కూడా ఆయన పేరును ప్రస్తావించలేదని పేర్కొంది.
"ఈ కేసులో అప్పీలుదారుల్లో (అప్పీల్ చేసిన నిందితులు) ఏ ఒక్కరైనా బాంబు పేలుళ్లలో పాల్గొన్నట్లు ప్రత్యక్షంగా చూశామని ఎన్ఐఏ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు" అని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తులో వైరుధ్యాలు
అలాగే. ఎన్ఐఏ, ఇంకా ఏటీఎస్ సమర్పించిన చార్జిషీట్లలోని అనేక వైరుధ్యాలను కూడా కోర్టు ప్రస్తావించింది.
"ప్రజల్లో భయం పుట్టించే ఉద్దేశంతో ఉగ్రవాద చర్యలకు పాల్పడేందుకు అప్పీల్‌దారులు, ఇతర నిందితులు కుట్రపన్నారంటూ ఎన్ఐఏ పూర్తిగా ఒక కొత్త కథనాన్ని తీసుకొచ్చింది" అని న్యాయస్ధానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
"ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే.. అప్పీల్‌దారుల వాంగ్మూలాలు, వాటిని అనుసరించి సంఘటనా స్థలం నుంచి సేకరించిన వస్తువుల ఆధారంగానే ఎన్ఐఏ తన అభియోగాలను రూపొందించింది" అని కోర్టు వ్యాఖ్యానించింది.
మాలేగావ్‌లో బస్సు దిగిన ప్రదేశాలు, బాంబులు పెట్టిన ప్రదేశాలను నిందితులు చూపించారని ఎన్ఐఏ పేర్కొంది. బాంబులను ఎలా తయారు (అసెంబుల్) చేయాలో శిక్షణనిచ్చిన శిబిరాలను కూడా చూపించినట్లు తెలిపింది.
బాంబు అమర్చింది ఒక ముస్లిం వ్యక్తి అని ఏటీఎస్ పేర్కొన్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. అయితే, బాంబు పేలిన రోజున ఆ వ్యక్తి పేలుడు స్థలానికి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్ఐఏ పేర్కొంది.
బాంబు పేలుళ్ల కోసం సైకిళ్లను కొనుగోలు చేసింది ఒక ముస్లిం వ్యక్తి అని ఏటీఎస్ పేర్కొంటే, నిందితుల్లో ఒకరైన హిందూ వ్యక్తే ఆ పనిచేశారని ఎన్ఐఏ తెలిపింది. న్యాయస్థానం చెప్పిన దాని ప్రకారం, ఎన్ఐఏ సమర్పించిన ఈ ఆధారాలు "వదంతుల ఆధారిత సాక్ష్యాలు."
అలాగే, ఏటీఎస్ దాఖలు చేసిన ఫోరెన్సిక్ నివేదికల వంటి అనేక ఇతర సాక్ష్యాలను ఎన్ఐఏ "పూర్తిగా విస్మరించింది" అని కూడా న్యాయస్థానం పేర్కొంది.
దీనితోపాటు "ఈ కేసు సందిగ్ధ స్థితికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఏటీఎస్, ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీట్లలోని పరస్పర విరుద్ధ కథనాలు ఏ దారి ఎంచుకోవాలో తెలియని స్థితికి తీసుకొచ్చాయి" అని కోర్టు వ్యాఖ్యానించింది.
బాంబే హైకోర్టు తీర్పుతో కేసు నుంచి విముక్తి పొందిన నలుగురు నిందితులు 2019 నుంచి బెయిల్‌పై బయటే ఉన్నారు.
2016లో, ఈ కేసు నుంచి విముక్తి పొందిన 9 మంది ముస్లింలకు వ్యతిరేకంగా ఏటీఎస్ దాఖలు చేసిన అప్పీల్ మాత్రమే విచారణకు రావాల్సి ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
గత కొన్నేళ్లలో, అనేక బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితులు న్యాయస్థానాల ద్వారా కేసుల నుంచి విముక్తి పొందారు. మాలేగావ్లోనే 2008లో జరిగిన బాంబు పేలుడు కేసులోని ఏడుగురు నిందితులు కూడా 2025 జులైలో నిర్దోషులుగా విడుదలయ్యారు. వారిలో బీజేపీ మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్ కూడా ఉన్నారు.
2006లో ముంబై లోకల్ ట్రైన్స్‌లో బాంబు పేలుళ్ల కేసు (7/11 పేలుళ్ల కేసు)లో నిందితులైన 12 మందిని బాంబే హైకోర్టు 2025 జులైలోనే నిర్దోషులుగా విడుదల చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























