పనిమనిషి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కలితా మాఝీ తన గెలుపు గురించి ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, BBC/Tariq Khan
- రచయిత, రాక్సీ గాగ్డేకర్ ఛారా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 6 నిమిషాలు
కలితా మాఝీ పశ్చిమ బెంగాల్‌లోని ఔస్‌గ్రామ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమె ఇంతకుముందు పలువురి ఇళ్లల్లో పనిమనిషిగా ఉన్నారు.
కలితా మాఝీ టీఎంసీకి చెందిన శ్యామా ప్రసన్న లోహర్‌ను 12,535 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 207 స్థానాలను గెలుచుకోగా, మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) 80 స్థానాలను కైవసం చేసుకుంది.
కోల్‌కతాకు సుమారు మూడు గంటల ప్రయాణ దూరంలో ఉన్న బర్ధమాన్‌లోని గుస్కురా మాఛ్‌పుర్ పారాలో ఒక ఇరుకైన సందులో నివసించే కలితా మాఝీ కొన్ని రోజుల కిందటివరకు ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నారు.
మేం కలితా మాఝీ ఇంటికి చేరుకోగానే ఆమె చేసిన మొదటి పని మాకు తన ఇంటిని చూపించడం. ఆ చిన్న ఇంట్లోని ఓ గదిలో ఆమె భర్త విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆ ఇంట్లోనే తన ఇద్దరు బావలు, తల్లితోనూ కలిసి నివసిస్తున్నామని ఆమె తెలిపారు.


ఫొటో సోర్స్, BBC/Tariq Khan
మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?
తన కుటుంబాన్ని పోషించడానికి కష్టపడే కలితా మాఝీ రాజకీయాల్లోకి ప్రవేశించి విజయం సాధించడం నిజంగా ఆశ్చర్యకరం. ముఖ్యంగా రాజకీయాలు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉన్న ఈ రోజుల్లో.
"నేను 2014లో పార్టీ బూత్ ఏజెంట్‌గా ఉన్నా. ఆ తర్వాత 2019లో నాకు గుస్కురా పట్టణ పార్టీ కార్యదర్శిగా పనిచేశాను. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాకు టికెట్ ఇచ్చింది" అని ఆమె చెప్పారు.
ఆ ఎన్నికలో కలితా మాఝీ టీఎంసీకి అభ్యర్థి అభేదానంద థండర్ చేతిలో 11,815 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ ఓటమి తర్వాత కూడా ఆమె రాజకీయ ప్రస్థానం కొనసాగింది.
ఆ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 293 స్థానాల్లో పోటీ చేసి 77 స్థానాల్లో విజయం సాధించింది.
"2022లో నేను బర్ధ్‌మాన్ జిల్లాకు పార్టీ కార్యదర్శిగా నియమితులయ్యాను. 2024లో సాధారణ పార్టీ కార్యకర్తగా పనిచేశాను. 2025లో నన్ను బోల్పూర్ జిల్లాకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. 2026లో అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నాకు మళ్ళీ టికెట్ ఇచ్చింది" అని ఆమె చెప్పారు.
తనపై నమ్మకం ఉంచినందుకు ఆమె బీజేపీకి ధన్యవాదాలు తెలిపారు.
అయితే మీరు ఎప్పుడైనా ఎన్నికలలో పోటీచేసేందుకు ఆసక్తి చూపడం కానీ, టిక్కెట్ అడగడం చేశారా? అని ప్రశ్నిస్తే..
"లేదు, లేదు. నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. ఎమ్మెల్యే అవ్వగలనని ఎప్పుడూ అనుకోలేదు. మా తల్లిదండ్రులు ధనవంతులు కాదు. మా అత్తమామల ఆర్థిక పరిస్థితి కూడా అలాంటిదే'' అని ఆమె చెప్పారు.
''నేను కుటుంబాన్ని పోషించుకోవడానికి పనిమనిషిగా చేశా. నేను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు. బీజేపీ లాంటి పార్టీ మాత్రమే ఇలాంటివి సాధ్యం చేయగలదు. మా లాంటి వారికి అవకాశాలు కల్పించగలదు''
"టికెట్ పొందడం గురించి కూడా నేను కనీసం ఆలోచించలేదు. 2021లో పార్టీ నాకు టికెట్ ఇచ్చినప్పుడు నేను అక్షరాలా ఏడుస్తూ 'పార్టీ నాకు ఏంత చేసింది?' అనుకున్నాను. వీటన్నింటినీ నిర్వహించే సామర్థ్యం నాకు ఉందో లేదో తెలియలేదు" అని ఆమె గుర్తుచేసుకున్నారు.
తనకు సోదరులలాంటివారైన చంద్రచూడ్ పాత్రా, ప్రదీప్ తివారీ వంటివారు 2021 ఎన్నికల్లో తనకు చాలా సహాయం చేశారని, కలిసి పనిచేశారని కలితా మాఝీ చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Tariq Khan
కుటుంబం నుంచి ప్రోత్సాహమందిందా?
తన మామగారు తాను ఎమ్మెల్యే అవ్వడాన్ని చూడలేకపోయినప్పటికీ తన రాజకీయ జీవితంలో ఆయన తనకు ఎంతో సహాయం, మద్దతు ఇచ్చారని కలితా మాఝీ చెప్పారు.
కలిత మామగారు రెండేళ్ల క్రితం చనిపోయారు.
"2021లో పార్టీ నాకు టికెట్ ఇవ్వాలని ఆలోచిస్తోందని మా మామయ్యకు తెలిసినప్పుడు ఆయన నా దగ్గరికి వచ్చి, 'నువ్వు జీవితాంతం పనిమనిషిగానే ఉంటావా? నువ్వు మా కోసం ఇంత చేస్తున్నావు, కానీ సమాజం కోసం ఏమీ చేయవా?' అని అడిగారు" అని కలిత గుర్తుచేసుకున్నారు.
''రాజకీయాల్లోకి రావడం వల్ల పార్టీకి సమయం కేటాయించాల్సి వస్తుంది. దీనివల్ల కుటుంబానికి సమయం కేటాయించడం కష్టమవుతుంది'' అని నేను మా మామయ్యతో చెప్పాను.
''ఇంటికి సంబంధించిన ఆలోచనలకు దూరంగా ఉండమని మామయ్య కోరారు. నాకు మామయ్య, అత్తయ్య, ఇద్దరు బావలు, ఐదుగురు ఆడపడుచుల మద్దతు లభించింది'' అని అప్పటి పరిస్థితులను ఆమె వివరించారు.
కలితకు 2006లో వివాహం జరిగింది. ఆ తర్వాత ఆమె రెండు సంవత్సరాల పాటు ఇంటిని, పిల్లలను చూసుకున్నారు. తర్వాత కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి ఇళ్లల్లో పనిచేయడం మొదలుపెట్టారు.
"నా కొడుకుకి మూడేళ్ళో నాలుగేళ్ళో ఉన్నప్పుడు నేను పనిమనిషిగా పనిచేయడం మొదలుపెట్టాను. మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండేది. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చాం" అని కలిత చెప్పారు. 2008 నుంచి ఎమ్మెల్యే కావడానికి కొన్ని రోజుల ముందు వరకు కలిత ఆ పనిని కొనసాగించారు.
"అసెంబ్లీ టికెట్ వచ్చిన తర్వాత కూడా నేను ఏడు రోజులు పనిమనిషిగా పనిచేశాను. నామినేషన్ దాఖలు చేసి, ఎన్నికల సంఘం మార్గదర్శకాల పరిధిలోకి వచ్చిన తర్వాత నేను ఆ పనిని మానేశాను, ఎందుకంటే ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం అభ్యర్థులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవచ్చు"
''పనికి వెళ్తే ప్రచారం చేయగలిగేదాన్ని కాదు. నేను పనిచేసిన ఇళ్లలోని వారు నాకు పూర్తిగా సహకరించారు. 'పార్టీ నీకు ఒక పెద్ద బాధ్యత అప్పగించింది. ఇంటి పనుల గురించి నువ్వు ఆలోచించకు. మేం చూసుకుంటాము. పార్టీ నీకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది' అని వాళ్లు నాతో చెప్పారు'' అని కలిత గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, BBC/Tariq Khan
ప్రజల స్పందన ఎలా ఉంది?
తాను పనిచేసిన ఇళ్లలోని వారు ఎప్పుడూ తనను తమ కూతురిగా, సోదరిగా భావించేవారని కలితా మాఝీ చెబుతున్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల హింస ఉంటుందని వార్తలొస్తాయి. ఈ ఎన్నికలు శాంతియుతంగా జరిగినప్పటికీ ఫలితాలు వెలువడిన తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది.
రాష్ట్రంలోని రాజకీయ హింస చరిత్ర చూసి ఎప్పుడైనా భయపడ్డారా? అంటే లేదని సమాధానమిచ్చారు కలిత.
"నేను ఈ విషయాలకు ఎప్పుడూ భయపడలేదు. 2021లో ఎన్నికల తర్వాత మా ప్రాంతంలో హింస చెలరేగింది. ఆ సంవత్సరం మే 2న ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. మే 4న పెద్ద సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. అయినా కూడా నేను అస్సలు భయపడలేదు" అని కలిత చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Tariq Khan
రాజకీయాలు, కుటుంబం, పని
తాను ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు నిద్రలేచి, ఇంటి పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఉదయం 6:30 నుంచి 7 గంటల మధ్య పనికి బయలుదేరేదాన్నని కలిత చెప్పారు.
తన పని ముగించుకున్న తర్వాత పార్టీ కోసం పనిచేసేవారు.
"సాయంత్రం ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని, టీ తాగిన తర్వాత, నేను మళ్ళీ పార్టీ కోసం పని చేస్తాను. ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయి. కొన్ని పనులు నెమ్మదిగా, ఒక్కొక్కటిగా మాత్రమే చేయగలం. అని కలిత వివరించారు.
జంగల్‌మహల్‌లోని తన ప్రాంతంలో ఇప్పటికీ అనేక ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని కలిత చెప్పారు.
"కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలేవీ ఈ ప్రాంతానికి చేరలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడటం నా బాధ్యత. స్థానిక ఆరోగ్య కేంద్రంలో పూర్తికాలం పనిచేసే డాక్టర్ ఎవరూ లేరు. ఒకవేళ రోగి ఆరోగ్య కేంద్రానికి వెళ్లినప్పుడు కరెంట్ పోతే, జనరేటర్ కూడా లేదు. పరిస్థితి మనం ఊహించలేనంత దారుణంగా ఉంది. డాక్టర్లు టార్చ్‌లైట్లు, మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స చేస్తున్నారు" అని ఆమె వివరించారు.
''మేం నగరాలు, గ్రామాల్లోని చాలా మంది మహిళలతో మాట్లాడాం. వారు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు''
"మహిళలకు భద్రత కల్పించడం మన బాధ్యత. సామాన్య ప్రజల ఆశీస్సులతోనే నాకు ఈ పెద్ద పదవి లభించింది. వారి వల్లే నేను ఎమ్మెల్యే అయ్యాను. నేను ప్రజల ఆదేశాలను పాటిస్తాను" అని కలితా మాఝీ వివరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































