సింహాల గర్జన ఇచ్చే సంకేతాలు ఏంటి, వాటి గర్జన ఎంత దూరం వినిపిస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గోపాల్ కటేషియా
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
సింహాల ప్రస్తావన రాగానే, వాటి గర్జనకు సంబంధించిన ఆలోచనలు కూడా అనివార్యంగా మన మదిలో మెదులుతాయి.
ఇంతకీ సింహాలు ఎందుకు గర్జిస్తాయి? వాటి గర్జన ఎంత దూరం వినిపిస్తుంది? ఆ గర్జనలో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎంతసేపు గర్జిస్తాయి?
ఇవన్నీ తెలుసుకోవడానికి గుజరాత్ అటవీ శాఖాధికారుల బృందం, పక్షుల శబ్దాలను రికార్డ్ చేయడంలో ప్రసిద్ధి చెందిన విరల్ జోషి అనే పరిశోధకుడి బృందం 2024లో ఒక అధ్యయనం చేశాయి.
దీనికి సంబంధించిన ఒక పరిశోధనా పత్రం గత నెలలో ప్రచురితమైంది. అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
సింహాలు ఏ సమయంలో గర్జిస్తాయి?
సింహాల గర్జనలను అధ్యయనం చేయడానికి సాసన్ వన్యప్రాణి విభాగానికి చెందిన అప్పటి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, గిర్ జాతీయ పార్క్, వన్యప్రాణి అభయారణ్యం సూపరింటెండెంట్ డాక్టర్ మోహన్ రామ్ నాయకత్వంలోని పరిశోధకుల బృందం సిద్ధమైంది.
ఇందుకోసం గుజరాత్‌లోని గిర్ అడవుల పశ్చిమ తీరంలోని దేడకడి, దేవలియా, ఆంకోల్వాడి రేంజ్‌లలో అటానమస్ రికార్డింగ్ యూనిట్లనుఏర్పాటు చేశారు. ఈ విధంగా 15 ప్రాంతాలలో మొత్తం 1,259 గంటల ఆడియో రికార్డింగ్ చేశారు.
ఈ రికార్డింగ్‌లను విశ్లేషించినప్పుడు, సాయంత్రం నుంచి సింహాల గర్జనలు ప్రారంభమవడం, రాత్రి సమయంలో తరచుగా వినిపించడం పరిశోధకులు గమనించారు.
ఉదయం 3గంటల నుంచి 5 గంటల సమయంలో ఈ గర్జనలు అత్యధికంగా రికార్డయ్యాయని పరిశోధకులు తెలిపారు.

ఫొటో సోర్స్, Bipin Tankaria/BBC
గర్జన ఎంత దూరం వినిపిస్తుంది?
సింహాల గర్జన ఎంత దూరం వినిపిస్తుందనే ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి పరిశోధకులు రెండు ప్రయోగాలు చేశారు. దేవలియా సఫారీ పార్కులో బంధించి ఉంచిన సింహాలకు దాదాపు 100 మీటర్ల దూరంలో రెండు రికార్డింగ్ యూనిట్లను అమర్చారు. ఆ తర్వాత మరో రికార్డింగ్ యూనిట్‌ను 2.7 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు.
అదేవిధంగా సాసన్ సమీపంలోని అడవిలో సింహాలు తరచూ నీళ్లు తాగడానికి వచ్చే, ప్రాంతంలో కూడా ఒక యూనిట్‌ను అమర్చారు. అలాగే నీటి వనరు నుంచి 1కిలోమీటర్, 2కిలోమీటర్లు, 3కిలోమీటర్ల దూరంలో చెట్లకు ఒక్కో రికార్డింగ్ యూనిట్ చొప్పున బిగించారు.
అడవిలో సింహ గర్జన రెండు కిలోమీటర్ల దూరంలో ఉంచిన రికార్డింగ్ యూనిట్ వరకు చేరుకుంటుందని పరిశోధకులు నిర్ధరణకు వచ్చారు. అంటే సింహాల గర్జన 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది.
సింహ గర్జన ఎంత దూరం వినిపిస్తుందనేది స్పష్టంగా తెలుసుకోవడం రికార్డింగ్ యూనిట్ మైక్రోఫోన్ పనితనంపై ఆధారపడి ఉంటుందని డాక్టర్ మోహన్ రామ్ బీబీసీతో చెప్పారు.
"సింహం గర్జన ఎంత దూరం చేరుకుంటుందనేది సమయం, స్థలంపై ఆధారపడి ఉంటుంది. రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో సింహం ఏదైనా కొండపై నుంచి గర్జిస్తే, రెండు కిలోమీటర్ల దూరం వరకు వినిపించే అవకాశం ఉంది" అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ రిటైర్డ్ అధికారి దుష్యంత్ వసావడా బీబీసీ గుజరాతీతో చెప్పారు.
"కానీ, పగటిపూట మానవ కార్యకలాపాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇతర శబ్దాలు సింహం గర్జన కంటే తీవ్రంగా ఉండవచ్చు. అందువల్ల పగటి వేళ సింహం గర్జన 2 కిలోమీటర్ల దూరం వరకు వినిపించకపోవచ్చు. పైగా, సింహం ఏదైనా మైదాన ప్రాంతం నుంచి గర్జిస్తే, ఆ ధ్వని తరంగాలను అడవిలోని చెట్లు, ఇతర వృక్షసంపద అడ్డుకుంటాయి. ఫలితంగా ధ్వని ఎక్కువ దూరం ప్రయాణించకపోవచ్చు" అన్నారు.

ఫొటో సోర్స్, Bipin Tankaria/BBC
సింహాలు ఎందుకు గర్జిస్తాయి?
సింహం గుంపుగా జీవించే ఒక సామాజిక జంతువు. మగ సింహం తన సొంత సరిహద్దును నిర్దేశించుకుని, ఇతర పెద్ద మగ సింహాలు ఆ ప్రాంతంలోకి రాకుండా నిరోధించడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. అలాగే ఆ సరిహద్దులో ఉండే ఆడ సింహాలతో జతకట్టి తన వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది.
ఇలాంటి సరిహద్దును అదుపులో ఉంచుకునే సింహాన్ని 'ఆధిపత్య మగ సింహం' (డామినెంట్ మేల్) అని పిలుస్తారు. ఈ సింహాల మధ్య సరిహద్దుల కోసం పోరాటాలు జరుగుతుంటాయి. ఈ పోరాటంలో వృద్ధాప్యం వైపు అడుగులు వేస్తున్న ఆధిపత్య మగ సింహం ఓడిపోతే, అది తన మిగిలిన జీవితాన్ని దాదాపు ఒంటరిగానే గడపవలసి వస్తుంది. ఈ ప్రక్రియ మొత్తంలో గర్జనలు, హుంకారాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
గతంలో జరిగిన పరిశోధనలను ఉటంకిస్తూ, డాక్టర్ మోహన్ రామ్, ఆయన బృందం తమ పరిశోధనా పత్రంలో "సింహాల ప్రవర్తనకు సంబంధించిన ఎన్నో పనులు కేవలం వాటి గర్జనల ద్వారానే ముగిస్తాయి. అందులో తమ సరిహద్దు ఆధిపత్యాన్ని ప్రకటించడం, సామాజిక సమైక్యత, కూటమిని రక్షించుకోవడం, చొరబాటుదారులను దూరంగా ఉండమని హెచ్చరించడం వంటివి ఉంటాయి. శబ్దం ఆధారంగా సింహాలు తమకు తెలిసినవాటిని, తెలియని కొత్త సింహాలను గుర్తించగలవు. చాలాసార్లు కుటుంబంలోని ఒక సభ్యుని గర్జనకు ఇతర సభ్యులు సమష్టిగా సమాధానం ఇస్తాయి. కూటమిగా ఉండే రెండు మగ సింహాలు పరస్పర సమన్వయంతో గర్జిస్తూ, అటుఇటు తిరిగే ఇతర ప్రత్యర్థి మగ సింహాలను దూరంగా ఉంచుతాయి" అని రాశారు.

ఫొటో సోర్స్, Photo by DeAgostini/Getty Images
తెల్లవారుజామునే ఎందుకు ఎక్కువగా గర్జిస్తాయి?
సింహాలు ఎక్కువగా రాత్రిపూట తిరిగే జంతువులు. పగటి సమయంలో చాలావరకు ఏదైనా సురక్షితమైన ప్రదేశంలో విశ్రాంతి తీసుకుంటూ, నిష్క్రియగా ఉంటాయి.
సూర్యాస్తమయం, సూర్యోదయం మధ్య సమయంలోనే సింహాలు అత్యంత చురుగ్గా ఉంటాయని పరిశోధకులు తెలిపారు.
"సింహాలు తెల్లవారుజామున తమ సరిహద్దును రక్షించుకునే పనిని ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అందుకోసం అటూఇటూ తిరుగుతూ, గర్జిస్తూ ఉంటాయి. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సంభాషిస్తాయి. పైగా, ఈ సమయంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల సింహాలు మరింత చురుగ్గా ఉంటాయి" అని డాక్టర్ మోహన్ రామ్ బీబీసీతో చెప్పారు.
మూడు దశాబ్దాలుగా గిర్ అడవులలో నేచర్ క్యాంప్‌లను నిర్వహిస్తున్న జునాగఢ్‌లోని కేశోద్‌కు చెందిన 'స్కై ఫారెస్ట్ యూత్ క్లబ్' అధ్యక్షుడు రేవతుభా రాయ్‌జాదా మాట్లాడుతూ, సింహాలు పగటిపూట చాలా అరుదుగా గర్జిస్తాయని చెప్పారు.
"తెల్లారకముందే మగ సింహాలు గర్జిస్తూ, ఒక నిర్దిష్ట ప్రాంతంపై తమకు ఆధిపత్యం ఉందని ప్రత్యర్థులకు తెలియజేస్తాయి. అలాగే తమ ప్రాంతానికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తాయి. తెల్లవారేలోపు తాము ఎక్కడ ఉన్నామో కుటుంబానికి తెలియజేయడానికి కూడా గర్జిస్తాయి. ఆ విధంగా అవి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి" అన్నారు.

ఫొటో సోర్స్, DeAgostini/Getty Images
సింహాల గర్జనల పరిశోధన ప్రాముఖ్యత ఏమిటి?
ఈ పరిశోధన సింహాల సంరక్షణలో ఉపయోగపడుతుందని డాక్టర్ మోహన్ రామ్ అన్నారు.
"ఈ పరిశోధనలో భాగంగా గిర్ సింహాల గర్జనలను గుర్తించగల ఒక కంప్యూటర్ మోడల్‌ను తయారు చేశాం. దీని ఆధారంగా సింహాలను దూరం నుంచే పర్యవేక్షించడం సాధ్యమవుతుంది. సింహాల రక్షణ, సంరక్షణ, నిర్వహణలో ఇది ఎంతో తోడ్పడుతుంది. సింహం గర్జన ఆధారంగానే అది ఉన్న ప్రాంతం గురించి నమ్మకమైన సమాచారం లభిస్తే... అటవీ శాఖ సిబ్బంది వాటి వెనుక తిరుగుతూ నిఘా పెట్టాల్సిన అవసరం ఉండదు" అన్నారు.
"సింహాల గర్జన విని అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ సమాచారంతో సింహాలు-మనుషుల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదాలను ముందుగానే ఊహించవచ్చు. ఇలాంటి ఘర్షణలను తగ్గించడంలో కూడా ఈ మోడల్ సహాయపడుతుంది" అని విరల్ జోషి బీబీసీతో చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























