బరువును తగ్గించే మందులు తీసుకునే వారికి 'మద్యం ఇక చాలు' అని ఎందుకు అనిపిస్తోంది?

మద్యం

ఫొటో సోర్స్, Peter Cade/Getty Images

ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

లీసా రీస్ ఏప్రిల్‌లో తొలిసారిగా బరువు తగ్గించే మందు తీసుకున్నప్పుడు, కొన్ని కిలోల బరువు తగ్గుతానని ఆమె అనుకున్నారు.

అయితే, ఆ మందు వల్ల తనకు కలిగిన ఒక దుష్ప్రభావం ''అద్భుత ప్రయోజనం"గా మారుతుందని ఆమె ఊహించలేదు.

ఆమె ఇప్పుడు తక్కువ ఆహారం తీసుకోవడంతో పాటు, మద్యం కూడా తక్కువగా తాగుతున్నారు.

గతంలో బయటకు వెళ్లినప్పుడు లీసా రెండు బాటిళ్ల వైన్ తాగేవారు.

కానీ ఇప్పుడు రెండు గ్లాసులు తాగిన తర్వాతే, "ఇక ఒక్క చుక్క కూడా తాగలేను" అని లీసా అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్

బరువు తగ్గించే మందులకు, మద్యం సేవనానికి మధ్య ఉన్న సంబంధంపై పరిశోధనలు క్రమంగా పెరుగుతున్నాయి.

వెగోవీ, మౌంజారో, ఓజెంపిక్ వంటి బ్రాండ్ల పేర్లతో లభించే ఈ మందుల్లో సెమాగ్లుటైడ్ లేదా టిర్జెపటైడ్ ఉంటాయి. ఇవి శరీరంలో సహజంగా ఉండే జీఎల్‌పీ అనే హార్మోన్‌లా పనిచేస్తాయి.

దాంతో ఆకలి తగ్గుతుంది, ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

మద్యపానం, ఊబకాయం, ఔషధాలు

ఫొటో సోర్స్, Albane McGuinness

ఫొటో క్యాప్షన్, ఇప్పుడు గతంలా తాగలేకపోతున్నానని లీసా చెబుతున్నారు

మద్యపానంపై ప్రభావం

ఈ మందులు మెదడులోని ప్రతిస్పందన వ్యవస్థపై ప్రభావం చూపడం వల్ల, మద్యం, నికోటిన్ వంటి పదార్థాలను తీసుకోవాలనే కోరికను కూడా తగ్గించే అవకాశం ఉందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాకు చెందిన డాక్టర్ క్రిస్టియన్ హెండెర్‌షాట్ చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా పరిశోధనలు ప్రారంభ దశలోనే జరుగుతున్నాయి.

మద్యపాన వ్యసనం ఉన్న కొంతమంది వ్యక్తులతో ఆయన 2025లో ఒక చిన్నస్థాయి అధ్యయనం నిర్వహించారు. ఓజెంపిక్ తీసుకుంటున్న సమయంలో వారు మద్యం తాగాలనే కోరికను తక్కువగా అనుభవించినట్లు ఆ అధ్యయనంలో గుర్తించారు.

కొలరాడో యూనివర్సిటీ అన్‌షుట్జ్‌కు చెందిన పరిశోధకులు ప్రచురించిన ఒక అధ్యయనం కూడా, మాత్రల రూపంలో తీసుకునే జీఎల్‌పీ-1 మందులు తక్కువ నుంచి మధ్యస్థ స్థాయిలో మద్యపాన వ్యసనం ఉన్నవారిలో ఎక్కువగా మద్యం తాగే రోజులను తగ్గించాయని సూచించింది.

ఈ మందులు తీసుకుంటున్న కొంతమంది బీబీసీ న్యూస్‌తో మాట్లాడారు. మద్యం తమపై ఒక్కొక్కరిపై ఒక్కో విధంగా ప్రభావం చూపిందని చెప్పారు. కొందరు మద్యం తాగాలనే కోరిక పూర్తిగా తగ్గిపోయిందని, మరికొందరు మద్యం తాగితే వికారం లేదా అసౌకర్యంగా కడుపు నిండిన భావన కలుగుతోందని చెప్పారు. ఇంకొందరు గతంలోకంటే త్వరగా మత్తెక్కుతోందని తెలిపారు. అయితే, మరికొందరు మాత్రం మద్యంతో తమకున్న సంబంధంలో ఎలాంటి మార్పును గమనించలేదని చెప్పారు.

వెగోవీ తీసుకోవడం ప్రారంభించక ముందు, లీసా స్నేహితులతో కలిసి వారానికి 6 నుంచి 8 బాటిళ్ల వైన్ తాగేవారు. అయితే, ఇంత మద్యం తాగడం ఎక్కువేమో, దాని వల్ల తన ఆరోగ్యానికి హాని కలగవచ్చేమో అని ఆమె కొన్నిసార్లు ఆందోళన చెందేవారు.

క్రమం తప్పకుండా వారానికి 14 యూనిట్లకు మించి మద్యం తాగకూడదని బ్రిటన్‌కు చెందిన ఆరోగ్య సేవా సంస్థ ఎన్‌హెచ్‌ఎస్ మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇది సుమారు ఆరు మీడియం గ్లాసుల వైన్ లేదా ఆరు పింట్ల బీర్‌కు సమానం. దీర్ఘకాలం ఎక్కువగా మద్యం తాగడం వల్ల కాలేయం దెబ్బతినడం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

మందు తీసుకోవడం ప్రారంభించినప్పటి నుంచి తన మద్యం సేవనం సగానికి పైగా తగ్గిందని లీసా చెప్పారు. ఇటీవల జరిగిన సంగీత ఉత్సవంలో ఆమె తొమ్మిది గంటల వ్యవధిలో మూడు గ్లాసుల వైన్ మాత్రమే తాగారు. గతంలో అయితే రెండు బాటిళ్ల వైన్‌తో పాటు, వోడ్కా కలిపిన మరో రెండు పానీయాలు కూడా తీసుకునేదాన్నని ఆమె చెప్పారు.

‘‘మద్యం తాగడం లేదని పార్టీలకు పిలవడం మానేశారు’’

లీసా జీవితంలో మద్యం ఎప్పటినుంచో ఒక ముఖ్యమైన భాగం. 2010 చివర్లో కొన్ని వారాల పాటు ఆమె మద్యం తాగడం మానేసినప్పుడు, సామాజిక కార్యక్రమాలకు తన స్నేహితులు తనను పిలవడం మానేశారని ఆమె గుర్తించారు. దాంతో ఆమె మళ్లీ మద్యం తాగడం ప్రారంభించారు. వైన్ తాగాలని తనకు ఇప్పటికీ ఆసక్తిగా ఉంటుందని లీసా చెబుతున్నారు. కానీ రెండు గ్లాసులు తాగిన తర్వాత ఇక ఏమాత్రం తాగలేకపోతున్నానని ఆమె అంటున్నారు.

"నేను ఇప్పటికీ తాగుతున్నాను కాబట్టి, ఆ కార్యక్రమాల్లో నేనూ భాగంగానే ఉన్నాననే భావన కలుగుతోంది. కానీ చాలా తక్కువగా తాగుతున్నా" అని లీసా చెప్పారు.

కోల్చెస్టర్‌కు చెందిన 45 ఏళ్ల వారెన్ థామస్‌కు కూడా ఎన్నో సంవత్సరాలుగా కుటుంబ సభ్యులతో అప్పుడప్పుడు బీర్ తాగడం, అలాగే ప్రతి నెలా స్నేహితులతో ఒకటి లేదా రెండు సార్లు ఎక్కువగా మద్యం తాగే సందర్భాలు ఉండేవి.

అయితే వారెన్ కూడా మాంజారో తీసుకోవాలనుకున్నప్పుడు ఆ విషయాన్ని తన స్నేహితులకు చెప్పారు. వారు అప్పటికే బరువు తగ్గే మందులు వాడుతున్నారు. అయితే మౌంజారో తీసుకోవడం వారెన్ తీసుకునే మద్యం పరిమాణంపై ప్రభావం చూపొచ్చని వారు హెచ్చరించారు.

జూన్ మధ్యలో మొదటిసారి మౌంజారో డోస్ తీసుకున్న 24 గంటల్లోనే దాని ప్రభావాన్ని గమనించానని వారెన్ చెప్పారు. "నాకు అసలు మద్యం తాగాలనిపించడం లేదు. దానిపై నాకు ఎలాంటి ఆసక్తి లేకుండా పోయింది" అని ఆయన చెప్పారు.

గత నెలలో తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లినప్పుడు రెండు బీర్లు తాగిన తర్వాత తనకు "తల తేలికగా, కొంచెం మత్తుగా" అనిపించిందని ఆయన చెప్పారు.

"ఇప్పుడు నాకు మద్యం తట్టుకునే సామర్థ్యం సున్నా" అని ఆయన చెప్పారు.

వైద్యులు, ఫార్మసిస్టులు మందులను ఇచ్చేటప్పుడు ఉపయోగించే మార్గదర్శక పుస్తకమైన బ్రిటిష్ నేషనల్ ఫార్ములరీలో, బరువు తగ్గించే మందులు వాడుతున్నవారు మద్యం తాగడం పూర్తిగా మానేయాలా వద్దా అనే దానిపై ఎలాంటి అధికారిక సూచన లేదని కింగ్స్ కాలేజ్ లండన్‌లో వైద్యశాస్త్ర ప్రొఫెసర్, జనరల్ ప్రాక్టీషనర్ ప్రొఫెసర్ రస్సెల్ హియర్న్ చెప్పారు.

అయితే, ఆయన తన రోగులకు జాగ్రత్తగా సూచనలు ఇస్తారు. "మద్యంలో చాలా కేలరీలు ఉంటాయి. మీ లక్ష్యం బరువు తగ్గడం అయితే, జీఎల్‌పీ-1 మందు తీసుకుంటున్న సమయంలో ఆహారంలో మార్పులు చేసుకోవడంతో పాటు మద్యం తగ్గించడం కూడా బరువు తగ్గడానికి కచ్చితంగా సహాయపడుతుంది" అని ఆయన చెప్పారు.

మద్యం, వికారం

ఫొటో సోర్స్, Faye Goodwin

ఫొటో క్యాప్షన్, మద్యం సేవించినప్పుడు వికారం కలుగుతోందని ఫేయ్ గుడ్‌విన్ చెబుతున్నారు.

‘మద్యం మానేస్తే సామాజిక జీవితం దెబ్బతింటోంది’

లీసా, వారెన్‌లాంటి వారికి తక్కువ మద్యం తాగడం ఒక సంతోషకరమైన అదనపు ప్రయోజనంగా మారింది. అయితే, ఇటీవలే చదువు పూర్తి చేసిన 20 ఏళ్ల ఫేయ్ గుడ్‌విన్ మాత్రం దీనివల్ల తన సామాజిక జీవితం దెబ్బతింటోందని భావిస్తున్నారు.

ఫేయ్ మద్యం తాగినప్పుడు తనకు చాలా త్వరగా వికారం కలుగుతుందని, కొన్నిసార్లు వాంతులు అవుతాయని లేదా తీవ్రమైన యాసిడ్ రిఫ్లక్స్ వస్తుందని చెబుతున్నారు.

బీబీసీ యువర్ వాయిస్‌ను సంప్రదించిన ఫేయ్, తన 18వ ఏట నుంచి మౌంజారో తీసుకుంటున్నారు. బరువు తగ్గించే మందుల ప్రభావం లేకుండా మద్యం తాగితే ఎలా ఉంటుందో తనకు పెద్దగా తెలియదని ఆమె చెబుతున్నారు. అయితే, ఒకసారి నెల రోజుల పాటు ఈ ఇంజెక్షన్లు తీసుకోవడం ఆపినప్పుడు, ఎలాంటి వికారం లేకుండా మద్యం తాగగలిగానని ఆమె చెప్పారు.

ఈ వయసులో మద్యపానం తన సామాజిక జీవితంలో ముఖ్యమైన భాగమని ఆమె చెబుతున్నారు.

కొన్నిసార్లు తాను ఇంజెక్షన్ వేసుకునే రోజే స్నేహితులతో రాత్రి బయటకు వెళ్లాల్సి వస్తే, ఒక రోజు ఆలస్యంగా ఇంజెక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత ఒకటి లేదా రెండు రోజుల్లోనే మద్యం విషయంలో మందు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె భావిస్తున్నారు.

ఆ రోజు అప్పటికే మందు తీసుకుని ఉంటే, కొన్నిసార్లు స్నేహితుల ఆహ్వానాలను కూడా ఆమె తిరస్కరిస్తారు.

మద్యం తాగినప్పుడు, సాధారణంగా తనతో ఉన్న ఇతరుల కంటే చాలా తక్కువగానే తాగుతానని ఫేయ్ చెబుతున్నారు. దీనివల్ల స్నేహాలు ఏర్పరచుకోవడం, వాటిని కొనసాగించడం తనకు కష్టంగా మారిందని ఆమె భావిస్తున్నారు. ముఖ్యంగా కేంబ్రిడ్జ్‌లోని విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు చాలా సామాజిక కార్యక్రమాలు మద్యం చుట్టూనే జరిగేవి కాబట్టి తనకు ఇబ్బందిగా ఉండేదని చెప్పారు.

"అందరూ మద్యం తాగుతూ ఆనందిస్తున్నప్పుడు, నేను మాత్రం అక్కడ తాగకుండా కూర్చోవాల్సి ఉంటుందని తెలిసి ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించడం కష్టంగా ఉండేది. కొన్నిసార్లు ఒక గ్లాసు వైన్ లేదా మరేదైనా తాగడానికి ప్రయత్నించినా, తీవ్రమైన వికారం వల్ల దాన్ని పూర్తిగా తాగలేకపోయేదాన్ని" అని ఆమె చెప్పారు.

డారెన్ క్వెల్చ్

ఫొటో సోర్స్, Dr Darren Quelch

ఫొటో క్యాప్షన్, ఊబకాయం లేదా మధుమేహం లేని వారు మద్యపాన వ్యసన చికిత్స కోసం ఈ మందులను ఉపయోగించడం సురక్షితమేనా అని అడుగుతున్నారని డాక్టర్ డారెన్ క్వెల్చ్ చెప్పారు.

మద్యపాన నియంత్రణకు ఈ మందులు ఇవ్వొచ్చా?

బరువు తగ్గించే మందులు తీసుకుంటున్నప్పుడు ప్రజలు మొత్తంగా తక్కువ మద్యం తాగుతున్నారని సాధారణ ప్రజలపై నిర్వహించిన పరిశీలనా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే, ఇప్పటివరకు జరిగిన క్లినికల్ ట్రయల్స్ ప్రధానంగా మద్యపాన వ్యసనం ఉన్నవారిపైనే దృష్టి పెట్టాయేకానీ అప్పుడప్పుడు మాత్రమే మద్యం తాగే వారిపై కాదు.

ఈ అంశానికి సంబంధించిన సమాచారం "చాలా వేగంగా పెరుగుతోంది" అని హెండెర్‌షాట్ చెప్పారు. అమెరికాలోని కొన్ని కేంద్రాలు ఇప్పటికే మద్యం వినియోగ రుగ్మత ఉన్నవారికి ఈ మందులను అనధికారికంగా సూచిస్తున్నాయని ఆయన తెలిపారు.

మద్యం వినియోగ రుగ్మత చికిత్స కోసం ఈ మందులను నియంత్రణ సంస్థలు ఆమోదించాలంటే, ఎక్కువ మంది పాల్గొనే, ఎక్కువ కాలం కొనసాగే పెద్ద స్థాయి అధ్యయనాలు అవసరమని బరువు తగ్గించే మాత్రలు, మద్యం మధ్య సంబంధంపై అధ్యయనం నిర్వహించిన డాక్టర్ జోసెఫ్ షాక్ట్ చెప్పారు.

ఊబకాయం లేదా మధుమేహం లేని వారు మద్యపాన వ్యసన చికిత్స కోసం ఈ మందులను ఉపయోగించడం సురక్షితమేనా, అలాగే వాటిని కొనుగోలు చేయడం వారికి అందుబాటులో ఉంటుందా అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లేవని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్‌కు చెందిన డాక్టర్ డారెన్ క్వెల్చ్ చెప్పారు. ఆయన ‘వ్యసనాలు’ అనే అంశంపై పరిశోధనలు చేస్తున్నారు.

బరువు తగ్గించే ఇంజెక్షన్లు ప్రారంభించిన తర్వాత స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి మద్యం తాగడంపై తనకు ఆసక్తి తగ్గిందని వారెన్ చెప్పారు. "నాకు నిజంగా వెళ్లాలనిపించడం లేదు…మద్యం తాగాలనే కోరికే పెద్దగా లేదు" అన్నారాయన.

తాగే విధానాన్ని ఎప్పుడూ సమస్యగా భావించకపోయినా, ఈ మార్పు తనకు మాత్రం సంతోషాన్నిచ్చిందని ఆయన చెప్పారు. "ప్రత్యేకంగా ప్రయత్నించకుండానే మద్యం పూర్తిగా మానేయడం చాలా కొత్తగా, హాయిగా అనిపిస్తోంది" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)