స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

స్థానిక సంస్థల ఎన్నికలు
ఫొటో క్యాప్షన్, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, విశాఖపట్నం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చాయంటే మనం ఓటు వేసే పదవులు చాలా ఉంటాయి. సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పోరేటర్, మేయర్ ఇలా.

వీరంతా గ్రామం, మండలం, జిల్లా, నగర స్థాయుల్లో ప్రజాప్రతినిధులు.

కానీ, వీరిలో ఎవరు ఏ ప్రాంతానికి, ఏ స్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తారు? ఎవరిని మనం ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం? సర్పంచ్‌ నుంచి మేయర్‌ వరకు.. ఎవరి పని ఏంటి?

ఈ స్టోరీలో వీటిని సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్‌ సైన్స్‌ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్‌ జి. ప్రియాంక వివరించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గ్రామ పంచాయతీ

గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక పరిపాలనకు గ్రామ పంచాయతీ ప్రాథమిక యూనిట్‌. గ్రామ పంచాయతీ పరిధిని వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక వార్డు మెంబర్‌ను ఆ వార్డు ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు.

వార్డు మెంబర్‌ అంటే తన వార్డుకు సంబంధించిన సమస్యలను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లే ప్రజాప్రతినిధి.

రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు, మురుగునీటి కాలువలు, చెత్త నిర్వహణ వంటి సమస్యలను పంచాయతీ సమావేశాల్లో ప్రస్తావించడం, అభివృద్ధి పనుల్లో తమ వార్డు అవసరాలకు ప్రాధాన్యం కల్పించేందుకు ప్రయత్నించడం ఆయన/ఆమె బాధ్యతల్లో భాగం.

సర్పంచ్‌

సర్పంచ్‌ మొత్తం గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజలకు నాయకత్వం వహిస్తారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓటర్లు సర్పంచ్‌ను నేరుగా ఎన్నుకుంటారు.

గ్రామసభల నిర్వహణ, గ్రామ అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పథకాల అమలు, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి స్థానిక సేవల పర్యవేక్షణలో సర్పంచ్‌ కీలక పాత్ర పోషిస్తారు.

గ్రామసభల్లో ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రస్తావించి, అభివృద్ధి పనులపై అభిప్రాయాలు చెప్పవచ్చు.

సర్పంచ్‌ తర్వాత ఉపసర్పంచ్‌ ఉంటారు. అయితే, ఉపసర్పంచ్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఎన్నికైన వార్డు సభ్యులు తమలో ఒకరిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకుంటారు.

డాక్టర్‌ జి. ప్రియాంక
ఫొటో క్యాప్షన్, ఆంధ్ర విశ్వవిద్యాలయం పొలిటికల్‌ సైన్స్‌ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఫ్యాకల్టీ డాక్టర్‌ జి. ప్రియాంక
మండల పరిషత్ కార్యాలయం
ఫొటో క్యాప్షన్, మండల ప్రజా పరిషత్ కార్యాలయం, పెందుర్తి

మండల పరిషత్‌: ఎంపీటీసీ, ఎంపీపీ మధ్య తేడా ఏంటి?

ఒక గ్రామ పంచాయతీ పరిధి ఒక గ్రామానికి సంబంధించినదైతే, మండల పరిషత్‌ పరిధి మొత్తం మండలానికి సంబంధించినది. మండలాన్ని ఎంపీటీసీ నియోజకవర్గాలుగా విభజిస్తారు.

ఎంపీటీసీ అంటే మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడు. ప్రతి ఎంపీటీసీ నియోజకవర్గంలోని ఓటర్లు తమ ప్రతినిధిని నేరుగా ఎన్నుకుంటారు.

మండల స్థాయిలో గ్రామాల అభివృద్ధి అవసరాలను ప్రస్తావించడం, రహదారులు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి అంశాలపై సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం ఎంపీటీసీ బాధ్యతల్లో భాగం.

మండల పరిషత్‌ సమావేశాల్లో పాల్గొని అభివృద్ధి ప్రణాళికలు, పథకాల అమలుపై చర్చిస్తారు.

ఎంపీపీ

ఎంపీపీ అంటే మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు. ఎంపీటీసీ ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తే, ఎంపీపీ మండల పరిషత్‌కు నాయకత్వం వహిస్తారు.

ఎంపీపీని మండలంలోని ప్రజలందరూ నేరుగా ఎన్నుకోరు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమలో ఒకరిని ఎంపీపీగా పరోక్షంగా ఎన్నుకుంటారు.

మండల పరిషత్‌ సమావేశాలకు అధ్యక్షత వహించడం, అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో నాయకత్వం వహించడం, మండల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల సమన్వయంలో భాగస్వామ్యం కావడం ఎంపీపీ బాధ్యతల్లో ముఖ్యమైనవి.

ఎన్నికలు

జిల్లా పరిషత్‌: జెడ్పీటీసీ నుంచి చైర్‌పర్సన్‌ వరకు

గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, మండల స్థాయిలో మండల పరిషత్‌ ఉన్నట్లే…జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్‌ ఉంటుంది. జిల్లా పరిషత్‌ పరిధిలోని ప్రాదేశిక నియోజకవర్గాలను జెడ్పీటీసీ నియోజకవర్గాలు అంటారు.

ప్రతి జెడ్పీటీసీ నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిని ఆ ప్రాంత ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. ఈ సభ్యుడిని జెడ్పీటీసీ సభ్యుడు అంటారు.

జెడ్పీటీసీ సభ్యులు తమ నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధి అవసరాలను జిల్లా పరిషత్‌ సమావేశాల్లో ప్రస్తావిస్తారు.

గ్రామీణ రహదారులు, విద్య, ఆరోగ్యం, తాగునీరు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలపై చర్చిస్తారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తారు.

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ను ఎవరు ఎన్నుకుంటారు?

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అంటే మొత్తం జిల్లా పరిషత్‌కు నాయకత్వం వహించే వ్యక్తి. అయితే జిల్లా ప్రజలందరూ చైర్‌పర్సన్‌కు నేరుగా ఓటు వేయరు.

ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు తమలో ఒకరిని చైర్‌పర్సన్‌గా పరోక్షంగా ఎన్నుకుంటారు. వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక కూడా ఇదే తరహాలో జరుగుతుంది.

అంటే జెడ్పీటీసీ సభ్యుడు ఒక ప్రాదేశిక నియోజకవర్గానికి ప్రతినిధి కాగా, చైర్‌పర్సన్‌ జిల్లా పరిషత్‌ సమావేశాలకు నాయకత్వం వహిస్తూ జిల్లా స్థాయి గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల సమన్వయంలో కీలక పాత్ర పోషిస్తారు.

జిల్లా పరిషత్ అంటే మొత్తం జిల్లా అభివృద్ధికి సంబంధించిన పరిపాలనా సంస్థ. ప్రజలు జెడ్పీటీసీలను ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆ జెడ్పీటీసీలే జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ను పరోక్షంగా ఎన్నుకుంటారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఎన్నుకునే విధానం ఎప్పుడు మారింది?

1986లో ఎన్టీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం...జిల్లాలోని ఓటర్లందరూ కలిసి జిల్లా పరిషత్ చైర్మన్‌ను నేరుగా ఎన్నుకునేవారు. కానీ, 1994 ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంతో ఈ విధానం మారింది.

1995లో జరిగిన స్థానిక ఎన్నికల నుంచి పరోక్ష ఎన్నిక విధానం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం...ప్రజలు నేరుగా జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఓటు వేయరు. బదులుగా, తమ మండల పరిధిలోని జెడ్పీటీసీ సభ్యుడిని నేరుగా ఓటు వేసి ఎన్నుకుంటారు.

సాధారణంగా ప్రతి గ్రామీణ మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం ఉంటుంది. అలా జిల్లా వ్యాప్తంగా ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులంతా కలిసి, వారిలో ఒకరిని జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్‌పర్సన్‌గా పరోక్షంగా ఎన్నుకుంటారు.

ఇదే పద్ధతిలో, గ్రామీణ ప్రజలు తమ వార్డుల పరిధిలో ఎంపీటీసీ సభ్యులను నేరుగా ఎన్నుకుంటారు. ఆ ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులంతా కలిసి తమలో ఒకరిని 'మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ)'గా పరోక్షంగా ఎన్నుకుంటారు.

విశాఖపట్నం నగర పాలక సంస్థ
ఫొటో క్యాప్షన్, మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ

కార్పొరేటర్‌, మేయర్‌

పట్టణ ప్రాంతాల్లో జనాభా, పరిపాలనా అవసరాలను బట్టి నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు ఉంటాయి. పెద్ద నగరాల పరిపాలనను సాధారణంగా మున్సిపల్‌ కార్పొరేషన్లు నిర్వహిస్తాయి.

కార్పొరేషన్‌ను వార్డులుగా విభజిస్తారు. వార్డులోని ప్రజలు తమ వార్డు నుంచి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆయనే కార్పొరేటర్‌.

అలా ప్రతి వార్డు నుంచి ఒక కార్పొరేటర్‌ను ఆ వార్డు ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. మున్సిపాలిటీల్లో ఇలాంటి ప్రజాప్రతినిధులను కౌన్సిలర్లు లేదా వార్డు సభ్యులు అంటారు.

కార్పొరేటర్‌ తన వార్డులోని రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు, చెత్త నిర్వహణ, పార్కులు వంటి సమస్యలను కార్పొరేషన్‌ దృష్టికి తీసుకెళ్తారు.

పౌరుల ఫిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, వార్డు అభివృద్ధి అవసరాలపై చర్చించడం, కార్పొరేషన్‌ సమావేశాల్లో పాల్గొనడం వారి బాధ్యతల్లో భాగం.

మేయర్‌

మేయర్‌ అంటే మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నాయకత్వం వహించే ప్రజాప్రతినిధి. నగర స్థాయి అభివృద్ధి ప్రణాళికలు, కార్పొరేషన్‌ సమావేశాలు, పౌర సేవలకు సంబంధించిన అంశాల్లో మేయర్‌ కీలక పాత్ర పోషిస్తారు.

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో మేయర్‌ను ఎన్నికైన కార్పొరేటర్లు పరోక్షంగా ఎన్నుకునేవారు. అయితే, 2026లో సవరించిన చట్టాల ప్రకారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ను నగర ఓటర్లు నేరుగా ఎన్నుకునే విధానం అమల్లోకి వచ్చింది.

అంటే, ఓటర్లు తమ వార్డు కార్పొరేటర్‌కు ఒక ఓటు, నగర మేయర్‌కు మరో ఓటు వేస్తారు. అయితే, డిప్యూటీ మేయర్‌ను మాత్రం పరోక్షంగా ఎన్నుకుంటారు.

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ సంబంధిత చట్ట సవరణల ప్రకారం చైర్‌పర్సన్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం ఉంది. వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక మాత్రం పరోక్షంగా జరుగుతుంది.

కార్పోరేషనన్లకు మేయర్‌‌తో పాటు పరిపాలనా అధికారి కమిషనర్ ఉంటారు. అయితే వీరిద్దరి పాత్రలు వేర్వేరు.

మేయర్‌ ప్రజల తరఫున కార్పొరేషన్‌కు నాయకత్వం వహిస్తారు. కమిషనర్‌ ప్రభుత్వ నియామక అధికారి. కార్పొరేషన్‌ పరిపాలన, అభివృద్ధి పనుల అమలు, సిబ్బంది నిర్వహణ వంటి బాధ్యతలు కమిషనర్ చూస్తారు.

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు
ఫొటో క్యాప్షన్,

వార్డు మెంబర్‌: ఒక గ్రామ వార్డుకు ప్రతినిధి - ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.

సర్పంచ్‌: మొత్తం గ్రామ పంచాయతీకి నాయకత్వం - ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.

ఎంపీటీసీ: మండలంలోని ఒక ప్రాదేశిక నియోజకవర్గానికి ప్రతినిధి - ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.

ఎంపీపీ: మండల పరిషత్‌ అధ్యక్షుడు - ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు.

జెడ్పీటీసీ: జిల్లా పరిషత్‌లోని ఒక ప్రాదేశిక నియోజకవర్గానికి ప్రతినిధి - ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌: జిల్లా పరిషత్‌కు నాయకత్వం - ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులు ఎన్నుకుంటారు.

కార్పొరేటర్‌: మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ఒక వార్డుకు ప్రతినిధి - ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.

మేయర్‌: మొత్తం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు నాయకత్వం - ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత సవరించిన విధానం ప్రకారం ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.

విభజన ఎలా జరుగుతుంది...

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ వార్డుల విభజనను గ్రామ జనాభా, ఓటర్ల సంఖ్య, నివాస ప్రాంతాలు, భౌగోళిక సరిహద్దుల ఆధారంగా సంబంధిత నిబంధనల ప్రకారం అధికారులు చేపడతారు.

మండల పరిషత్‌ పరిధిలో ఎంపీటీసీ నియోజకవర్గాలను విభజించేటప్పుడు ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 150 ప్రకారం సాధ్యమైనంతవరకు ఒక్కో నియోజకవర్గంలో 3,000 నుంచి 4,000 జనాభా ఉండేలా చూస్తారు.

జిల్లా పరిషత్‌ పరిధిలో సాధారణంగా ప్రతి మండలానికి ఒక జెడ్పీటీసీ నియోజకవర్గం ఉంటుంది. మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సంబంధిత చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నిర్ణయించి జనాభా, ఓటర్ల సంఖ్య, భౌగోళిక సరిహద్దులు, నివాస ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని విభజిస్తారు.

రాజ్యాంగం ఏం చెబుతోందంటే...

గ్రామంలో సర్పంచ్‌ను, పట్టణంలో కార్పొరేటర్‌ను ఎవరు ఎన్నుకోవాలి? ఈ ఎన్నికలు ఎలా జరగాలి? వీటికి భారత రాజ్యాంగమే కొన్ని నియమాలు చెబుతోంది.

1992లో చేసిన 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగపరమైన గుర్తింపు లభించింది. 73వ సవరణ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించినది. 74వ సవరణ నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినది.

గ్రామీణ స్థానిక సంస్థల గురించి రాజ్యాంగంలోని 9వ భాగం (Part IX) చెబుతుంది. పట్టణ స్థానిక సంస్థల గురించి 9A భాగం (Part IXA) చెబుతుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K ప్రకారం పంచాయతీల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. అలాగే ఆర్టికల్ 243ZA ప్రకారం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది.

  • 73వ రాజ్యాంగ సవరణ - గ్రామీణ స్థానిక సంస్థలు.
  • 74వ రాజ్యాంగ సవరణ - పట్టణ స్థానిక సంస్థలు.
  • ఆర్టికల్ 243K - పంచాయతీ ఎన్నికలు.
  • ఆర్టికల్ 243ZA - పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.

గ్రామం నుంచి మన నగరం వరకు స్థానిక ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా స్థానిక అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కలుగుతుంది.

స్థానిక సంస్థల రూపం గతంలో ఎలా ఉండేది?

1980ల ముందు గ్రామీణ స్థానిక పాలనలో గ్రామ పంచాయతీలు, పంచాయతీ సమితులు, జిల్లా పరిషత్తులు కీలకంగా ఉండేవి. అప్పట్లో 'తాలూకాలు' రెవెన్యూ పరిపాలన విభాగాలుగా ఉండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం ఒక జిల్లాను తాలూకాలుగా విభజించేవారు. ఒక తాలూకా పరిధిలో అనేక గ్రామాలు ఉండేవి.

1985-86 మధ్య కాలంలో అప్పటి ఎన్.టి. రామారావు ప్రభుత్వం తాలూకాల స్థానంలో మరింత చిన్న పరిపాలనా విభాగాలుగా 'మండలాలను' ఏర్పాటు చేసింది. 1986లో తెచ్చిన చట్టం ద్వారా పంచాయతీ సమితుల స్థానంలో 'మండల ప్రజా పరిషత్తులు (ఎంపీపీలు)' వచ్చాయి. ఉదాహరణకు 1987 జనవరిలో విజయనగరం జిల్లాలో ఉన్న 14 పంచాయతీ సమితుల స్థానంలో 34 మండల ప్రజా పరిషత్తులు ఏర్పడ్డాయి.

ఆ తర్వాత, 1992లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ, దానిని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం-1994 ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల వ్యవస్థకు ఒక బలమైన, కొత్త రాజ్యాంగబద్ధ రూపం వచ్చింది.

స్థానిక సంస్థలను ఎందుకు ఏర్పాటు చేశారు?

ప్రజలకు పాలనను మరింత దగ్గర చేయాలనే (అధికార వికేంద్రీకరణ) ఉద్దేశంతో స్థానిక సంస్థల వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి చిన్న సమస్యకూ జిల్లా కేంద్రానికో లేదా రాష్ట్ర రాజధానికో వెళ్లాల్సిన అవసరం లేకుండా....గ్రామం, మండలం, జిల్లా స్థాయిల్లోనే ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే అవకాశం దీని ద్వారా లభించింది. స్థానిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను గుర్తించడం, నిధుల వినియోగంపై స్థానిక ప్రజాప్రతినిధులే బాధ్యత వహించడం ఈ వ్యవస్థలో కీలకమైన అంశాలు.

అయితే, స్థానిక సంస్థలకు కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోదు. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు నిర్ణయాలు తీసుకునే అధికారం, ఆ పనులు చేయడానికి అవసరమైన నిధులు, విధులు, సిబ్బంది కూడా ఉండాలి. 1992 నాటి 73వ రాజ్యాంగ సవరణ ఈ దిశగా కీలక మార్పులు తెచ్చింది.

దీని ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధమైన గుర్తింపు లభించింది. ప్రతి ఐదేళ్లకు ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహించడం తప్పనిసరి అయింది. ఎన్నికలను స్వతంత్రంగా నిర్వహించడానికి 'రాష్ట్ర ఎన్నికల సంఘం' నిధుల పంపిణీ కోసం 'రాష్ట్ర ఆర్థిక సంఘం' ఏర్పాటయ్యాయి.

అయితే, రాజ్యాంగబద్ధంగా అధికారాలు బదిలీ అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో వీటికి ఎంతవరకు నిధులు, అధికారాలు అందుతున్నాయనేది ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు, ఇచ్చే సహకారంపైనే ఆధారపడి ఉంటోంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)