పీహెచ్‌పీ: కొన్ని ప్రముఖ వెబ్‌సైట్లు ఎందుకు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి, ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ సైబర్ ముప్పు ఏంటి?

 పీహెచ్‌పీ (PHP) , ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లోపాలు
    • రచయిత, ఆస్మండ్ చియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

దశాబ్దానికి పైగా ఇంటర్నెట్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్న సాంకేతికతలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలు ఎవరికీ తెలియకుండా ఉండిపోయాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో ఈ లోపాలను గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా సైబర్ భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి.

2000వ దశకం నుంచి ప్రపంచవ్యాప్తంగా వెబ్‌సైట్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్న పీహెచ్‌పీ (PHP) అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఈ లోపాలు బయటపడ్డాయి.

బుధవారం ఈ లోపాలు బయటపడటంతో తలెత్తిన ముప్పును నియంత్రించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సైబర్ భద్రతా సంస్థలు అత్యవసర చర్యలు చేపడుతున్నాయి.

వెబ్‌సైట్ల నిర్వాహకులు వెంటనే కొత్త సెక్యూరిటీ ప్యాచ్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని, అది సాధ్యం కాకపోతే తమ వెబ్‌సైట్లను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించాయి.

ఈ లోపాలను గుర్తించిన పరిశోధకులు పనిచేస్తున్న సంస్థల్లో సైబర్ సెక్యూరిటీ సంస్థ విజ్ కూడా ఒకటి.

ఏఐ సాయంతో ఇప్పటివరకు గుర్తించిన భద్రతా లోపాల్లో ఇవే అత్యంత తీవ్రమైనవని ఆ సంస్థ పేర్కొంది.

ఈ లోపాలను గుర్తించేందుకు తమ సాంకేతికతను ఉపయోగించినట్లు ఓపెన్‌ ఏఐ తెలిపింది. ఇటీవలి కాలంలో బయటపడిన అత్యంత ప్రభావవంతమైన సైబర్ భద్రతా సమస్యల్లో ఇది ఒకటని అభివర్ణించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అసలు భద్రతా లోపం ఏమిటి?

పీహెచ్‌పీ గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు.

పీహెచ్‌పీ పూర్తి పేరు 'PHP: Hypertext Preprocessor'. ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు, వికీపీడియా, బ్లాగులు సహా అనేక వెబ్‌సైట్ల నిర్వహణకు ఉపయోగించే కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వర్డ్‌ప్రెస్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కీలక పాత్ర పోషిస్తోంది.

ఉదాహరణకు, వికీపీడియా వంటి వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు మనకు అవసరమైన సమాచారాన్ని సేకరించి, వెబ్‌పేజీలో చదవగలిగేలా చూపించడంలో పీహెచ్‌పీ కోడ్ పనిచేస్తుందని గొరిల్లా సైబర్ సెక్యూరిటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాల్ స్పెయిన్ వివరించారు.

''పీహెచ్‌పీలో బయటపడిన భద్రతా లోపం కారణంగా హ్యాకర్లు ఎలాంటి ధ్రువీకరణ అవసరం లేకుండానే ప్రభావిత వెబ్ సర్వర్లను తమ నియంత్రణలోకి తీసుకునే అవకాశం ఉంది. సున్నితమైన సమాచారాన్ని కూడా దొంగిలించవచ్చు. దీంతో పీహెచ్‌పీ ఆధారంగా నిర్మించిన వెబ్‌సైట్లు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది''

ఏఐ సాయంతో ఇలాంటి సైబర్ దాడులను మరింత సులభంగా, వేగంగా చేసే అవకాశం ఉందని పాల్ స్పెయిన్ హెచ్చరించారు. ఈ లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్లాది వెబ్‌సైట్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.

హ్యాకర్లు లేదా ఇతర దేశాలు ఈ లోపాన్ని దుర్వినియోగం చేసి వెబ్‌సైట్ల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని అడిలైడ్ యూనివర్సిటీ సైబర్ సెక్యూరిటీ పరిశోధకురాలు జిల్ స్లే హెచ్చరించారు.

 పీహెచ్‌పీ (PHP) , ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లోపాలు
ఫొటో క్యాప్షన్, యూనివర్సిటీ ఆఫ్ జెనీవా వంటి ప్రముఖ వెబ్‌సైట్లు బుధవారం ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి.

ఏయే వెబ్‌సైట్లు ప్రభావితమయ్యాయి?

ఈ భద్రతా హెచ్చరికతో ప్రపంచవ్యాప్తంగా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, ప్రభుత్వ పోర్టళ్లు, ఆన్‌లైన్ ఫోరమ్‌లు సహా అనేక సేవలకు అంతరాయం ఏర్పడింది.

వికీపీడియాను నిర్వహించే వికీమీడియా సంస్థ ముందుజాగ్రత్త చర్యగా తనకు చెందిన పలు సిస్టమ్‌లను నిలిపివేసింది.

ఫిన్లాండ్ ప్రభుత్వం, ఎడిన్‌బరో కౌన్సిల్, బీబీసీకి చెందిన కొన్ని వెబ్‌సైట్లు, వెబ్‌పేజీలను తాత్కాలికంగా నిలిపివేశారు.

నెదర్లాండ్స్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా తన వెబ్‌సైట్‌ను నిలిపివేసింది.

స్కాట్లాండ్‌లోని పలు ప్రభుత్వ సంస్థలు, స్థానిక కౌన్సిళ్లు, ఆరోగ్య బోర్డులు కూడా తమ వెబ్‌సైట్లను తాత్కాలికంగా మూసివేశాయి.

ఈ భద్రతా లోపాలకు సంబంధించిన సాంకేతిక వివరాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నందున రాబోయే వారాల్లో వీటిని ఉపయోగించి సైబర్ దాడులకు మరిన్ని ప్రయత్నాలు జరగొచ్చని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్‌ఎస్‌డబ్ల్యూ), సిడ్నీకి చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు సలీల్ కన్హేరే తెలిపారు.

 పీహెచ్‌పీ (PHP) , ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో లోపాలు
ఫొటో క్యాప్షన్, తమ వెబ్‌సైట్లు పీహెచ్‌పీ ఆధారంగా నడుస్తున్నాయా అనేది ప్రజలు తనిఖీ చేయాలని జపాన్ ప్రధాని సనాయె తకాఇచి కోరారు.

భద్రతా లోపాలు బయటపడిన తర్వాత ఏం జరిగింది?

పీహెచ్‌పీ సాఫ్ట్‌వేర్‌లో ఏళ్లుగా ఉన్న ఈ భద్రతా లోపాలను సరిచేసేందుకు డెవలపర్లు బుధవారం సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేశారు. పీహెచ్‌పీ ఉపయోగిస్తున్న వారందరూ వెంటనే తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, సైబర్ భద్రతా సంస్థలు కూడా ఇదే హెచ్చరికను జారీ చేశాయి. వెబ్‌సైట్ల నిర్వాహకులు తమ ప్లాట్‌ఫామ్‌లను సురక్షితంగా ఉంచేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరాయి.

పీహెచ్‌పీ ఉపయోగిస్తున్న సంస్థలు వెంటనే సెక్యూరిటీ ప్యాచ్‌ను ఇన్‌స్టాల్ చేయలేకపోతే తమ సిస్టమ్‌లను తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ) సూచించింది.

''ఈ ముప్పు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలన్నీ వెంటనే సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది'' అని ఎన్‌ఎస్‌ఏ తెలిపింది.

బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్, యూరోపియన్ యూనియన్, సింగపూర్, ఆస్ట్రేలియాలోని సైబర్ భద్రతా సంస్థలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి.

ప్రజలకు అందుబాటులో ఉన్న తమ వెబ్‌సైట్లు పీహెచ్‌పీ ఆధారంగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేసుకోవాలని జపాన్ ప్రధాని సనాయే తకాయిచి కోరారు.

''వెంటనే ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం'' అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు.

పీహెచ్‌పీ భద్రతా లోపం గురించి బహిరంగంగా వెల్లడించడానికి కొన్ని రోజుల ముందే తమపై పలుమార్లు సైబర్ దాడులకు ప్రయత్నాలు జరిగాయని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలిపింది.

అయితే, ఈ లోపం గురించి దాడులకు ప్రయత్నించిన వారికి ముందుగానే ఎలా తెలిసిందనేది స్పష్టత రాలేదు.

భద్రతా లోపాలను ఏఐ ఎలా గుర్తిస్తోంది?

కాలిఫ్, విజ్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థలకు చెందిన పరిశోధకులు ఈ లోపాలను గుర్తించారు.

కోడ్‌ను విశ్లేషించి అందులోని లోపాలను మనుషులు లేదా పాత సాంకేతిక వ్యవస్థల కంటే చాలా వేగంగా గుర్తించగల అధునాతన ఏఐ సాధనాలను పరిశోధకులు ఉపయోగించారు.

''సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు చాలా సంక్లిష్టంగా ఉంటాయి. అందుకే కొన్ని భద్రతా లోపాలు ఏళ్ల తరబడి గుర్తించకుండా ఉండిపోవచ్చు'' అని కన్హేరే చెప్పారు.

''ఈ లోపాలు కొత్తగా ఏర్పడినవి కావు. వాటిని గుర్తించే మన సామర్థ్యమే ఇప్పుడు మారింది'' అన్నారాయన.

ఈ లోపాల గుర్తింపునకు సంబంధించిన వివరాలు ఈ వారంలో ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. దీంతో పీహెచ్‌పీ డెవలపర్లు భద్రతా లోపం గురించి, దాని తీవ్రత గురించి హడావుడిగా ప్రకటన చేయాల్సి వచ్చింది.

''ఏఐ సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా లోపాలను ఎలా గుర్తించవచ్చో ఈ ఘటన తెలియజేస్తోంది. అదే సమయంలో సైబర్ దాడులకు అవసరమైన సాధనాలను, లోపాలను దుర్వినియోగం చేసే పద్ధతులను హ్యాకర్లు వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఏఐ ఉపయోగపడొచ్చు'' అని ఓపెన్‌ఏఐ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది.

పీహెచ్‌పీ ప్లాట్‌ఫామ్ సురక్షితంగా ఉందో లేదో తనిఖీ చేసేందుకు ఒక ప్రోగ్రామ్‌ను విడుదల చేసినట్లు చాట్‌జీపీటీని అభివృద్ధి చేసిన ఓపెన్‌ఏఐ తెలిపింది.

''గతంలో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేటప్పుడు భద్రత కంటే అది సక్రమంగా పనిచేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రస్తుతం బయటపడుతున్న అనేక లోపాలకు ఇదే కారణం'' అని క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ సైబర్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన ర్యాన్ కో తెలిపారు.

సైబర్ ముప్పు నుంచి రక్షించుకోవాలంటే ఏం చేయాలి?

వెబ్‌సైట్ల నిర్వాహకులు పీహెచ్‌పీ తాజా వెర్షన్‌ను ఉపయోగించి తమ వెబ్‌సైట్లను సురక్షితంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

చాలా టెక్నికల్ బృందాలకు పీహెచ్‌పీ సెక్యూరిటీ ప్యాచ్‌ను ఇన్‌స్టాల్ చేయడం చిన్నపాటి, సాధారణ ప్రక్రియేనని పాల్ స్పెయిన్ తెలిపారు.

రాబోయే వారాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అమెరికా జాతీయ భద్రతా సంస్థ సూచించింది. సాఫ్ట్‌వేర్ సంస్థల నుంచి వచ్చే అప్‌డేట్‌లను నిశితంగా గమనించాలని కోరింది.

సైబర్ భద్రతకు సంబంధించిన ప్రధాన బాధ్యత వెబ్‌సైట్ల నిర్వాహకులపైనే ఉన్నప్పటికీ, సాధారణ వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కన్హేరే సూచించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)