‘ఏఐ’తో ఏపీ మంత్రి సంతకం ఫోర్జరీ, ఈ మోసం ఎలా బయటపడింది?

    • రచయిత, తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించారు తండ్రీకొడుకులు.

వాటిని నిజమైనవిగా నమ్మించి మోసం చేసే ప్రయత్నంలో దొరికిపోయారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో ఏఐ సాయంతో వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ సంతకంతో ఫేక్‌ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ తయారు చేశారు.

ఈ ఆర్డర్‌తో ఒక కుటుంబాన్ని మోసం చేసే ప్రయత్నంలో దొరికిపోవడంతో వారిపై కేసు నమోదైంది.

ఈ కేసు గురించి శ్రీసత్యసాయి జిల్లా కదిరి రూరల్ సీఐ నాగేంద్ర బీబీసీకి వివరించారు.

అసలేం జరిగింది.?

‘శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం చీకటిమానుపల్లికి చెందిన జయచంద్ర భార్య రమణమ్మ కడప రిమ్స్‌లో స్టాఫ్ ‌నర్సుగా పనిచేస్తున్నారు.

తన పిల్లలను ఇంటిదగ్గర వదిలి కడపలో ఉద్యోగం చేస్తూ హాస్టల్‌లో ఉంటున్నారు.

ఆమె కుటుంబానికి దూరంగా కడపలో ఉండటంతో ఇబ్బందిగా మారింది.

ఆమెను ఎలాగైనా కడప జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు బదిలీ చేయించాలనుకున్నారు ఆమె భర్త.

తన భార్యను బదిలీ చేయించాలనుకుంటున్న విషయాన్ని ఆయన శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలోని కౌలేపల్లికి చెందిన తన బంధువు పలక గంగాద్రికి చెప్పారు.

దాంతో గంగాద్రి, తన కొడుకు వేణుతో కలిసి ఒక పథకం వేశాడు.

జయచంద్ర, అతడి భార్యకు మంత్రి ఇచ్చిన ట్రాన్స్ ఫర్ లెటర్ అంటూ పత్రాలు పంపించారు.

ఆ లెటర్‌తో అధికారుల దగ్గరకు వెళ్లిన జయచంద్రకు చివరికి అసలు నిజం తెలిసింది’ అని సీఐ నాగేంద్ర చెప్పారు.

సందేహం వచ్చి ఫిర్యాదు చేస్తే..

రమణమ్మ భర్త జయచంద్రతో బీబీసీ మాట్లాడింది.

ఆరోగ్యశాఖ మంత్రి పీఏ తనకు తెలుసని ఆయనతో మాట్లాడి బదిలీ చేయిస్తానని గంగాద్రి తన నుంచి లక్ష రూపాయలు తీసుకున్నాడని ఆయన ఆరోపించారు.

'నా బార్య రిమ్స్‌లో ఏఎన్ఎంగా పనిచేస్తూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. నేను స్థానిక ఎంపిడీఓ కార్యాలయంలో ఔట్ స్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. ఆమె వారానికి ఒకసారి ఇంటికి వచ్చి వెళుతుంది. మాకు ఇద్దరు మగపిల్లలు. ఒకరికి ఎనిమిదేళ్లు. ఇంకొకరికి నాలుగేళ్లు. పిల్లలు తల్లి ఉన్నప్పుడు వారానికి ఒకరోజు మాత్రమే బాగా అన్నం తింటారు. మిగిలిన రోజులు తల్లి కోసం బెంగ పెట్టుకుంటారు. నాకు 80 ఏళ్ల తల్లి ఉంది. ఆమె పిల్లలను చూసుకోలేదు. నేనే వారి బాధ్యతలు చూసుకోవాలి'' అని జయచంద్ర కన్నీటి పర్వంతమయ్యారు.

''కడప నుంచి వచ్చి వెళ్లడం, పిల్లల బాగోగులు చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందని నేను గంగాద్రితో చెప్పాను. గంగాద్రి తనకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలుసని చెప్పారు. ఆయనతో కలిసి దిగిన పోటోలు కూడా చూపించాడు. తన తండ్రికి మంత్రి సత్యకుమార్ యాదవ్ పీఏ శేషాద్రి తెలుసని గంగాద్రి కొడుకు వేణు కూడా చెప్పాడు. మంత్రి పీఏతో మాట్లాడి మీ భార్యను బదిలీ చేయిస్తామని చెప్పి ఇద్దరూ రూ.లక్ష వసూలు చేశారు. గంగాద్రి కుమారుడు వేణు నా భార్య వివరాలు తీసుకున్నాడు. ఒరిజనల్‌ ఆర్డర్ అని చెప్పి, నకిలీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్‌ను నా వాట్సాప్‌కు పంపారు'' అని చెప్పారు.

అయితే ఆర్డర్ కాపీ చూడగానే తమకు ఎందుకో సందేహం వచ్చిందని, కొద్ది రోజుల తర్వాత అధికారులకు దానిని చూపిస్తే తండ్రీకొడుకులు చేసిన మోసం బయటపడిందని జయచంద్ర చెప్పారు.

''ఆ ఆర్డర్ కాపీ చూడగానే, నాకు ఎందుకో అనుమానం వచ్చి కొద్ది రోజులు ఆగాను. తర్వాత అధికారులకు చూపిస్తే అది నకిలీదని చెప్పారు. అంతేకాదు మంత్రి పీఏగా శేషాద్రి అనే వ్యక్తి ఉన్నాడా లేదా కూడా మేం ఆరా తీశాం. మంత్రి సత్యకుమార్‌ దగ్గర శేషాద్రి పేరుతో పీఏగా ఎవరూ లేరని తెలిసింది. దాంతో గంగాద్రి, వేణు మమ్మల్ని మోసం చేశారని వారిని నిలదీస్తే అసలు విషయం ఒప్పుకున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే రోజులు గడిచినా ఇవ్వలేదు. దీంతో ఈ నెల 26న తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశాం'' అన్నారు.

మంత్రి సంతకంతో లెటర్ ఎలా?

కదిరి మండలం, కౌలేపల్లి క్వార్టర్స్‌కు చెందిన తండ్రీకొడుకులు పలక గంగాద్రి, పలక వేణు... జయచంద్రకు బంధువులు అవుతారని కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, కదిరి రూరల్ సీఐ నాగేంద్ర బీబీసీకి చెప్పారు.

కడప రిమ్స్‌‌లో స్టాఫ్ నర్సుగా పని చేస్తూ నగరంలోనే పీజీలో ఉంటున్న భార్య రమణమ్మ పిల్లలల బాగోగులు చూసుకోడానికి సొంత గ్రామానికి వెళ్లడానికి ఇబ్బందులు పడుతోందని ఆమె భర్త జయచంద్ర వారిద్దరితో చెప్పడంతో తండ్రీకొడుకులు ఈ పథకం వేశారన్నారు.

''గంగాద్రి, అతని కొడుకు వేణు ఇద్దరు జయచంద్రను మోసం చేసి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో.. మంత్రి దగ్గర ఉండేవారు ఎవరూ పరిచయం లేకున్నా, ఆయన పీఏ శేషాద్రి తమకు తెలుసునని అతనితో చెప్పారు. రమణమ్మను కడప రిమ్స్ నుంచి మదనపల్లి జీజీహెచ్‌కు బదిలీ చేయిస్తామని నమ్మించి జయచంద్ర నుంచి రూ.లక్ష తీసుకున్నారు" అని కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి చెప్పారు.

తండ్రీకొడుకులు ఏఐ ఉపయోగించి మంత్రి పేరుతో ఒరిజినల్ అనిపించేలా ఫేక్ లెటర్ ఎలా సృష్టించారో ఆయన వివరించారు.

''జయచంద్ర నుంచి రమణమ్మ వివరాలను సేకరించిన వేణు చాట్ జీపీటీ ద్వారా నకిలీ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ సృష్టించారు. దానిని ఈ ఏడాది జనవరి 26న వాట్సాప్ ద్వారా జయచంద్రకు పంపించాడు. అది అసలు ఆర్డర్‌ కాపీ అని నమ్మించి మోసం చేశాడు'' అని అన్నారు.

కేసు నమోదు

బాధితుల ఫిర్యాదు మేరకు Sec 66 (D) IT Act. కింద కేసులు నమోదు చేసి పలక వేణు (23), పలక గంగాద్రి (45)ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.

అరెస్టు చేసిన తర్వాత ఈ కేసు వివరాలు చెప్పడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పోలీసులు నిందితులతో మాట్లాడించారు.

చాట్ జీపీటీ ద్వారా నకిలీ బదిలీ లెటర్ తయారు చేసినట్లు వేణు మీడియా సమావేశంలో అంగీకరించాడు.

అయితే నిందితులు రిమాండ్‌లో ఉండడంతో స్థానిక మీడియా సహకారం తీసుకుని నిందితుల కుటుంబ సభ్యులతో మాట్లాడ్డానికి బీబీసీ ప్రయత్నించింది.

అయితే వారు అందుబాటులోకి రాలేదు.

నిందితులపై ఫోర్జరీ, మోసం, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో దోషులుగా తేలితే వీరికి మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందని చిత్తూరుకు చెందిన లాయర్ ఏఎస్ సరస్వతి బీబీసీతో చెప్పారు.

ఇదే అంశంపై బీబీసీ ఏపీ మంత్రి సత్యకుమార్‌తో కూడా మాట్లాడింది.

''గతంలో కూడా నాకు సంబందం లేకుండా నా పేరుతో తిరుమలలో లెటర్ పెట్టారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా సంతకం ఫోర్జరీ చేసి ట్రాన్స్‌ఫర్ లెటర్ ఇచ్చారనే విషయం మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనిపై పూర్తి స్తాయిలో దర్యాప్తు చేయాలని ఎస్పీతో మాట్లాడుతాను. మేం ప్రజల్లోకి వెళ్లినప్పుడు అనేక మంది పోటోలు దిగుతుంటారు. వారు ఎవరనే వివరాలు మాకు తెలియవు' అని ఆయన చెప్పారు.

ఏఐ కంపెనీలు ఏమంటున్నాయి?

ఏఐ ఉపయోగించి ఇలా డాక్యుమెంట్లు సృష్టించడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల ఏఐ జెనరేటెడ్ చెక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మానవ ప్రమేయం లేకుండా కేవలం ఏఐ సాయంతో కొందరు లాయర్లు పిటిషన్లు రాయడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

తమ టూల్స్‌ని బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని ప్రధాన ఏఐ కంపెనీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మోసం, ఫేక్ పత్రాలు సృష్టించొద్దంటూ పలు నిబంధనలను ప్రచురించాయి.

ఇతరులను మోసం చేయడానికి తమ టూల్స్‌ వాడుకోవడాన్ని తాము అనుమతించబోమని ఓపెన్ ఏఐ తన యూసేజ్ పాలసీలో పేర్కొంది.

గూగుల్ జెమినై, మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఏఐలు కూడా దాదాపు ఇలాంటి నిబంధనలనే పేర్కొన్నాయి.

ఎంత అప్రమత్తంగా ఉన్నా, ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నా ఏఐని దుర్వినియోగం చేస్తున్న ఘటనలు అక్కడక్కడ బయట పడుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)