‘వీర‌భ‌ద్రుడు’ రివ్యూ: ‘దేవుడే దిగి వస్తే న్యాయం జ‌రుగుతుందా’?

    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

న్యాయ శాస్త్రంలో ఓ నానుడి ఉంది. 'న్యాయం ఆలస్యం అవుతుందేమో కానీ, త‌ప్ప‌కుండా జ‌రుగుతుంది' అని.

అయితే ఆ ఆల‌స్యం ఎంత సేప‌నేది ఎవ్వ‌రూ టైమ్ లైన్ గీసి చెప్ప‌లేక‌పోయారు. అందుకే కోర్టుల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిర‌గాల్సివ‌స్తోంది.

ఏళ్ల‌కు ఏళ్లు గడిచిపోయినా, కోర్టులో కేసులు న‌డుస్తూనే ఉంటాయి. వాటికెప్పుడు మోక్షం దొరుకుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. దేవుడు దిగి వ‌చ్చినా న్యాయం జ‌ర‌గ‌దేమో? అనేంత నిరాశ‌, నిస్పృహ‌ల్లో సామాన్యుడు కూరుకుపోయాడు.

మ‌రి నిజంగా దేవుడు దిగివ‌స్తే... న‌ల్ల‌కోటు వేసుకొని కోర్టులో వాదిస్తే, అప్పుడైనా న్యాయం జ‌రుగుతుందా?

ఈ పాయింట్‌ని ఆస‌రాగా చేసుకొని రూపొందించిన సినిమా 'వీర‌భ‌ద్రుడు'.

కోర్టులో దేవుడు

సూర్య క‌థానాయ‌కుడిగా నటించిన ఈ చిత్రం విడుద‌ల‌కు ముందు కాస్త ఇబ్బందుల‌కు లోనైంది.

ఆర్థిక ప‌ర‌మైన లావాదేవీల దృష్ట్యా.. ఒక్క రోజు ఆల‌స్యంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

మ‌రి ఈ సినిమా ఎలా వుంది? వీర‌భద్రుడు చేసిన న్యాయం ఏమిటి? వివ‌రాల్లోకి వెళ్తే...

నాంప‌ల్లి కోర్టు చుట్టూ తిరిగే క‌థ ఇది. అక్క‌డ బేబీ కృష్ణ (బాలాజీ) అడ్వ‌కేట్‌గా ప‌ని చేస్తుంటాడు. తిమ్మిని బ‌మ్మిగా మార్చ‌డంలో నేర్ప‌రి. ఆ కోర్ట్ అంతా త‌న అధీనంలో ఉంటుంది. ఎప్పుడు ఎలాంటి తీర్పు కావాలో తానే డిసైడ్ చేస్తాడు.

మీను అనే అమ్మాయి ఆప‌రేష‌న్ కోసం త‌న తండ్రితో పాటు హైద‌రాబాద్ వ‌స్తుంది. రైల్వే స్టేష‌న్‌లో దిగ‌గానే బ్యాగు దొంగ‌త‌నానికి గుర‌వుతుంది. ఆ బ్యాగులో ల‌క్ష‌ల విలువ చేసే బంగారం ఉంటుంది. అది అమ్మితే గానీ.. ఆప‌రేష‌న్ పూర్త‌వ‌దు.

ఆ కేసు పోలీస్ స్టేష‌న్ నుంచి కోర్టు మెట్లు ఎక్కుతుంది. బంగారం క‌ళ్ల ముందే ఉన్నా.. కోర్టులో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌లు, ఆల‌స్యం వ‌ల్ల బంగారం బాధితుల చేతికి అంద‌దు.

ఇలాంటి ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌ల్లో సూర్య (సూర్య‌) అనే లాయ‌ర్ ఆ కోర్టులోకి ఎంట్రీ ఇస్తాడు. ఈ కేసు వాదించ‌డానికి రెడీ అవుతాడు.

ఇంత‌కీ సూర్య ఎవ‌రు? త‌న‌కీ ఈ కేసుకీ సంబంధం ఏమిటి? అనే విష‌యాలు తెలియాలంటే 'వీర‌భ‌ద్రుడు' సినిమా చూడాలి.

న్యాయ వ్య‌వ‌స్థ‌పై సెటైర్‌

న్యాయ వ్య‌వ‌స్థ‌లో జ‌రిగే అవ‌క‌త‌వ‌క‌ల గురించి ఇది వ‌ర‌కు చాలా సినిమాలొచ్చాయి. ఇది మ‌రో కోణం అనుకోవొచ్చు.

కోర్టు వ్య‌వ‌హారాలు ఎలా సెటిల్ అవుతాయో కొన్ని స‌న్నివేశాల్లో చూపించే ప్ర‌య‌త్నం చేశారు.

సామాన్యుడికి న్యాయం ఎందుకు అందుబాటులో లేకుండా పోతుందో క‌ళ్ల‌కు క‌ట్టే ప్ర‌యత్నం చేశారు.

ఈ క‌థ‌లో ర‌క‌ర‌కాల పాత్ర‌లు ఉంటాయి. అవ‌న్నీ జ్యుడీషియ‌ల్ వ్య‌వ‌స్థ‌పై ద‌ర్శ‌కుడు వేసిన సెటైర్ అనుకోవొచ్చు.

క్షేత్ర‌పాల‌కుడిగా ప్ర‌జ‌లు పూజించే వీర‌భ‌ద్రుడు సూర్య రూపంలో ఎందుకు రావాల్సివ‌చ్చింద‌న్న విష‌యం ఆస‌క్తిని పెంచేదే.

ఇలాంటి క‌థ‌లు సీరియ‌స్ డ్రామా వైపు న‌డిపిస్తుంటారు ద‌ర్శ‌కులు. కానీ బాలాజీ మాత్రం దీనికో డివోష‌న‌ల్ ట‌చ్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. దేవుడు దిగి వ‌స్తే.. న్యాయం ఎలా ఉంటుందో చెప్పే ప్ర‌య‌త్నం ఈ సినిమాలో క‌నిపించింది.

సినిమా మొద‌లైన 40 నిమిషాల వ‌ర‌కూ సూర్య ఎంట్రీ ఇవ్వ‌డు. అప్ప‌టి వ‌ర‌కూ ప్రేక్ష‌కులు, ముఖ్యంగా సూర్య అభిమానులు కాస్త ఓపిక ప‌ట్టాల్సిందే.

ఓ ద‌శ‌లో ఇది సూర్య సినిమానా, లేదంటే ద‌ర్శ‌కుడు బాలాజీ సినిమానా అనే అనుమానం వేస్తుంది. ఎందుకంటే తొలి స‌గంలో ఎక్కువ‌గా ఆ పాత్రే ఎక్కువ ఎలివేట్ అయ్యింది.

సూర్య లేట్ ఎంట్రీ ప్రేక్షకుల్లో కాస్త అస‌హ‌నాన్ని క‌లిగిస్తుంది. అయితే స‌రైన స‌మ‌యంలో ఆ పాత్ర ని ప్ర‌వేశ పెట్టాడు ద‌ర్శ‌కుడు.

దేవుడే దిగి వ‌చ్చి కోర్టు రూమ్‌లో వాదిస్తే న్యాయం ఈజీగా దొర‌కాలి. కానీ ఇక్క‌డ దొర‌క‌దు. దేవుడి ప‌వ‌ర్స్‌ని ప‌రిమితం చేసి, త‌ద్వారా క‌థ‌లో కాన్‌ఫ్లిక్ట్ క‌లిగించాడు ద‌ర్శ‌కుడు. అది కొంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అయ్యింది.

ఇంట్ర‌వెల్ బ్యాంగ్‌లో సూర్య అభిమానుల‌కు పూన‌కాలే. వాళ్ల‌కు న‌చ్చే ఎలిమెంట్స్ చాలా క‌నిపిస్తాయి.

సింగంని గుర్తు చేసిన సూర్య‌

సూర్య పాత సినిమాల‌కు సంబంధించిన రిఫ‌రెన్సులు ఈ సినిమాలో చాలా ఉన్నాయి.

ముఖ్యంగా సింగం పాత్ర‌ని మ‌ళ్లీ తీసుకొచ్చారు. ఆ ఎలిమెంట్స్ ఫ్యాన్స్‌కు న‌చ్చుతాయి.

అయితే ద్వితీయార్థం పూర్తిగా గాడ్ ఎలిమెంట్స్‌తో సాగిపోయింది. సామాన్య ప్రేక్ష‌కుడి కోసం రాసుకొన్న ఈ క‌థ‌.... రాను రాను నేల విడిచి సాము చేయ‌డం మొద‌లెట్టింది. దాంతో ప్రేక్ష‌కుడు ఈ క‌థ‌తో ఎప్పుడో డిస్‌క‌నెక్ట్ అయిపోతాడు.

మ‌నిషిగా న్యాయం చేయ‌లేని దేవుడు.. చివ‌రికి న్యాయం చేయ‌డానికి దేవుడి అవ‌తార‌మే ఎత్తాల్సివ‌చ్చింది. అంటే.. న్యాయం మ‌నుషుల‌కు దొర‌క‌దు అనే విష‌యాన్ని ప‌రోక్షంగా చెప్పేసిన‌ట్టే.

చివ‌ర్లో పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. అది వృధా ప్ర‌య‌త్నంలా అనిపించింది.

సూర్య‌కు ఇలాంటి పాత్ర‌లు కొట్టిన పిండే. పైగా 'జై భీమ్‌'లో ఆయ‌న న్యాయం కోసం వాదించే లాయ‌ర్ పాత్రే పోషించారు. త‌న అభిమానుల‌కు ఏం కావాలో అవ‌న్నీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. పాత సినిమా పాట‌లు, డైలాగులు గుర్తు చేయ‌డం అభిమానుల‌కు న‌చ్చుతుంది.

ప్రీతి పాత్ర‌లో కనిపించిన త్రిష స్క్రీన్ స్పేస్ ఎక్కువే అయినా, ఎందుకో హీరోయిన్‌లా అనిపించ‌లేదు. ఓ క్యారెక్ట‌ర్ అంతే.

బాలాజీ విల‌న్ పాత్ర‌లో రాణించినా ఎందుకో సూర్య‌ని ఛాలెంజ్ చేసేంత ఇమేజ్ త‌న‌కు లేద‌నిపిస్తుంది.

ఫ‌హ‌ద్ ఫాజిల్, ఫృథ్వీరాజ్ లాంటి వాళ్లు చేసుంటే ఇంపాక్ట్ గట్టిగా ఉండేది. ఫ‌లితంలో కూడా తేడా వ‌చ్చేదే.

యాక్ష‌న్ సీన్స్‌ని బాగా కంపోజ్ చేశారు. ముఖ్యంగా ఇంట్ర‌వెల్ బ్యాంగ్ ఫైట్‌లో ఎలివేష‌న్లు బాగున్నాయి.

నేప‌థ్య సంగీతం చాలా చోట్ల డ‌ల్ గా వినిపించింది. ఆ హై స‌రిపోలేదు.

''కోర్టుకెళ్తే శిక్ష ప‌డుతుందంటారు. కానీ కోర్టు వ‌ర‌కూ రావ‌డ‌మే ఓ శిక్ష‌'' లాంటి డైలాగులు హృద‌యాన్ని తాకుతాయి.

ద‌ర్శ‌కుడు బాలాజీ మంచి లైన్ ప‌ట్టుకొన్నాడు. కానీ దానికి పూర్తి స్థాయి న్యాయం చేయ‌లేక‌పోయాడు.

దైవ‌త్వానికి సంబంధించిన అంశాలు ఎక్కువైపోవ‌డంతో క‌థ‌తో సామాన్య ప్రేక్ష‌కుడికి క‌నెన్ష‌న్ క‌ట్ అయిపోయింది. దాంతో ఈ ప్ర‌య‌త్నం ఓ అభూత క‌ల్ప‌న‌గా మారిపోయింది.

(నోట్: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)