రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు: ధర్మేంద్ర ప్రధాన్

ఫొటో సోర్స్, Getty Images
ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించాలని చూస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆరోపించారు.
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి బయట ధర్నా చేయడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలిగిందని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
మంగళవారం రాత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఆయన.. ‘లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ... పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు అంతరాయం కలిగించడానికి, తమ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను వాడుకుంటున్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి నివాసం వెలుపల నిరసన తెలపాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలగించడమే కాకుండా భద్రత నిబంధనలనూ ఉల్లంఘించారు’ అని రాశారు.
‘పూర్తిస్థాయి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ, కాంగ్రెస్ ప్రజాస్వామ్య చర్చకు బదులుగా రాజకీయ ప్రదర్శననే ఎంచుకుంది. వారి లక్ష్యం విద్యార్థుల సమస్యలను పరిష్కరించడం కాదు, అడ్డంకులు సృష్టించడమే’ అని రాశారు.
‘నీట్ పరీక్షపై పార్లమెంట్‌లో చర్చించడానికి, యువత ఆందోళనలను పరిష్కరించడానికి మా ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉంది. భారతదేశ విద్యార్థులను ఒక రాజకీయ ప్రచారంలో భాగం చేయడం కంటే మెరుగైన రీతిలో చూడాలి. వారికి కావాల్సింది నమ్మకం.. అంతేకానీ గందరగోళం కాదు. వారికి కావాల్సింది పరిష్కారాలు.. నినాదాలు కాదు. వారికి కావాల్సింది జవాబుదారీతనం, అడ్డంకులు కాదు’ అన్నారు దేవేంద్ర ప్రధాన్.
విద్యార్థుల సమస్యలపై పనిచేయడానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పారు.
