‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.
నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.





