రెంటచింతల, ఖమ్మం, పిడుగురాళ్ల సహా అనేక చోట్ల నిప్పుల వర్షంలా వాతావరణం.. దిల్లీలో ఆరెంజ్ అలర్ట్, 14 ఏళ్ల రికార్డు బ్రేక్

దిల్లీలో తీవ్రమైన వేడి, ఎండలతో ప్రజలు బాధపడుతున్నారు

ఫొటో సోర్స్, Ishant Chauhan/Hindustan Times via Getty Images

ఫొటో క్యాప్షన్, దిల్లీలో తీవ్రమైన వేడి, ఎండలతో ప్రజలు బాధపడుతున్నారు
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

దిల్లీకి భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే వారం రోజుల పాటు దిల్లీతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

బుధవారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని బాందాలో అత్యధికంగా 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డు అయింది.

మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో గరిష్టంగా 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అదే రోజున దిల్లీలోని రిడ్జ్ ఏరియాలో 45.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఖజురహోలో మే 20న నమోదైన ఈ ఉష్ణోగ్రత, సాధారణం కంటే దాదాపు 4.5 డిగ్రీలు ఎక్కువ.

ఇక, దిల్లీలో గడిచిన 14 ఏళ్లలోనే అత్యంత వేడి రాత్రిగా 'బుధవారం నాటి రాత్రి' ఉష్ణోగ్రతలు రికార్డు సృష్టించాయి.

హరియాణాలోని రోహ్‌తక్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.2 డిగ్రీలు, అంబాలాలో సాధారణం కంటే దాదాపు 7 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో బుధవారం రెంట చింతల (ఆంధ్రప్రదేశ్), ఖమ్మం(తెలంగాణ)ల్లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి ప్రభావం ఎక్కువగా తూర్పు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాల్లో కనిపిస్తోంది.

రాబోయే ఒక వారం పాటు దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాలలో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆకాశంలో మేఘాలు లేకపోవడమే కారణం

ఆకాశంలో మేఘాలు లేకపోవడం వల్ల గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని లఖ్‌నవూ వాతావరణ కేంద్రం సైంటిస్ట్ మొహమ్మద్ దానిష్‌ను ఉటంకిస్తూ వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

'అన్ని జిల్లాల్లోనూ ఎండలు ముదురుతున్నాయి. ఇక్కడ బుందేల్‌ఖండ్, ప్రయాగ్‌రాజ్, ఆగ్రాల్లో లఖ్‌నవూ కంటే ఎక్కువ వేడి నమోదైంది. బాందాలో 46-48°C ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతాల్లో ఒకటిగా బాందా నిలిచింది' అని ఏఎన్‌ఐతో మాట్లాడుతూ మొహమ్మద్ దానిష్ చెప్పారు.

దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వేడితో ప్రజలు సతమతం అవుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలోని చాలా ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, వేడితో ప్రజలు సతమతం అవుతున్నారు

హీట్ స్ట్రోక్ (వడదెబ్బ) నుంచి ఇలా కాపాడుకోవాలి:

భారత వాతావరణ విభాగం ప్రకారం, దేశంలోని అనేక నగరాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి.

బుధవారం నాడు అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని నగరాలు, ఉత్తరాఖండ్, హరియాణా-చండీగఢ్, దిల్లీ, పంజాబ్, జమ్మూ-కశ్మీర్, లద్ధాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యాయి.

ఇలాంటి వేడి వాతావరణంలో హీట్ స్ట్రోక్‌కు గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలు పాటించాల్సిన సలహాలను దిల్లీ ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నీరజ్ నిశ్చల్ సూచించారు.

డీహైడ్రేషన్ ముప్పు: ఎండలు పెరిగే కొద్దీ శరీరం నుంచి చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడుతుంది. మన శరీర బరువులో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. శరీరంలో నీరు తగ్గినప్పుడు ఇతర అవయవాలపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే నీరు అవసరమైనప్పుడల్లా దాహం రూపంలో శరీరం మనకు తెలియజేస్తుంది.

ఎలక్ట్రోలైట్స్ భర్తీ చేయాలి: చెమటతో పాటు శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ (ముఖ్యంగా సోడియం) తగ్గిపోతుంటాయి. కాబట్టి శరీరానికి నీరు మాత్రమే కాకుండా ఎలక్ట్రోలైట్స్ కూడా అందించాలి.

వీరికి ఎక్కువ ప్రమాదం: పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి హీట్ స్ట్రోక్ తగిలే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి వీరి పట్ల మరింత జాగ్రత్త వహించాలి. ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే వైద్య సహాయం అందించాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)