భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ఐటీబీపీ డీజీ ఏమన్నారు? విపక్షాలు ఎందుకు విమర్శిస్తున్నాయి

ఫొటో సోర్స్, AFP via Getty Images
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశాయి.
"కొన్ని రోజులుగా అరుణాచల్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో భారత్, చైనా బలగాలు ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతోంది" అని ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ (డీజీ) శత్రుజీత్ కపూర్ అన్నారు.
ఈ ఏడాది జులైలో ఈశాన్య సరిహద్దులో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించడం ఇదే తొలిసారి.
అరుణాచల్‌ప్రదేశ్ ఎగువ సుబన్‌సిరి జిల్లాలోని అసాఫిలా, మాజా ప్రాంతాల్లో జులై చివరి నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
"ఈ తీవ్రమైన సమస్యపై ప్రధానమంత్రి, ఆయన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మౌనం వహిస్తోంది" అని కాంగ్రెస్ విమర్శించింది.
మోదీ ప్రభుత్వం చైనాకు తలొగ్గిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ఆరోపించారు.

ఈ విషయం చాలా తీవ్రమైనదని శివసేన యూబీటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది అన్నారు.
'దేశ హోం మంత్రి, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి దీనికి సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. శత్రుజీత్ కపూర్ ప్రకటనను షేర్ చేస్తూ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఐటీబీపీ డీజీ వ్యాఖ్యలపై ప్రజలు కూడా సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. సరిహద్దు పరిస్థితిపై తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

ఫొటో సోర్స్, @ITBP_official
ఐటీబీపీ డీజీ ఏం చెప్పారు?
ఐటీబీపీ సిబ్బంది ఏటా నిర్వహించే 'హిమ్‌వీర్ సమ్మాన్ సమారోహ్' అనే కార్యక్రమంలో ఐటీబీపీ డీజీ శత్రుజీత్ కపూర్ గురువారం(అక్టోబర్ 22) మాట్లాడారు. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న సెంట్రల్ ట్రైనింగ్ కాలేజ్ (సీటీసీ)లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో కొనసాగుతున్న ఘర్షణాత్మక పరిస్థితుల సమయంలో ఐటీబీపీ కమాండోలు చురుగ్గా వ్యవహరించారని శత్రుజీత్ కపూర్ చెప్పారు.
కమాండో బృందాలు అసాధారణమైన పనితీరును కనబర్చాయని ఆయన ప్రశంసించారు.
"కొత్తగా ఏర్పడిన మా శౌర్య కమాండో బృందాలు ఈ విషయంలో అద్భుతమైన పాత్ర పోషించాయి. పర్వత ప్రాంతాల్లో గెరిల్లా దళంగా పనిచేయడానికి ఐటీబీపీని ఏర్పాటు చేశారు. చైనాతో సరిహద్దు భద్రత బాధ్యతను 2004లో మాకు అప్పగించారు" అని ఆయన అన్నారు.
ఐటీబీపీ ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాలు 50 ఏళ్ల నాటివని, వాటిని ఆధునికీకరించడం అవసరమని ఆయన అన్నారు .
డ్రోన్లు, డ్రోన్లను నిరోధించే సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని ఐటీబీపీ చీఫ్ చెప్పారు. ఆయుధాలు, మౌలిక సదుపాయాలను ఆధునీకరించుకోవడంపై చైనా భారీగా పెట్టుబడులు పెట్టిందని, అందుకే సంప్రదాయ పద్ధతుల ద్వారా చైనాను ఎదుర్కోవడం బహుశా సాధ్యం కాకపోవచ్చని అన్నారు.
"ఇప్పుడు సంప్రదాయ పద్ధతులలో చైనాను ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఎందుకంటే చైనా తన భద్రతా దళాలను ఆధునికీకరించడంలో భారీగా పెట్టుబడులు పెట్టి మనకంటే చాలా ముందుకెళ్లింది. అయితే డ్రోన్‌ల సాయంతో చిన్న దేశాలు కూడా పెద్ద దేశాలతో పోరాడగలవు. దీనిని మనం రష్యా-యుక్రెయిన్, ఇరాన్-అమెరికా ఘర్షణల్లో చూశాం''అని ఆయన అన్నారు .
శత్రుజీత్ కపూర్ అక్టోబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు.

ఫొటో సోర్స్, PIB/Anadolu via Getty Images
మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ విమర్శలు
ఐటీబీపీ చీఫ్ వ్యాఖ్యల తర్వాత మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. "ఈ ఏడాది జులై నుంచే చైనా సైనికులతో ఘర్షణలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. కానీ మోదీ ప్రభుత్వం ఈ వార్తలను బయటకు రాకుండా అణచివేయడానికి ప్రయత్నిస్తోంది" అని కాంగ్రెస్ ఆరోపించింది .
''చైనాకు గట్టి హెచ్చరికలు చేయాల్సిన సమయంలో బ్రిక్స్ సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో మోదీ నవ్వుతూ, సరదాగా మాట్లాడుతున్నట్టు కనిపించారు.
ఒకవైపు చైనా మన సైనికులతో ఘర్షణ పడుతుంటే మరోవైపు మోదీ చైనా అధ్యక్షుడికి స్వాగతం పలుకుతున్నారు. ఇది మన సైనికుల గాయాలపై కారం చల్లినట్టే ఉంది. ప్రతిసారీ మోదీ మన సైనికులను ఒంటరిగా వదిలేశారు. దేశానికి ద్రోహం చేశారు. బాధ్యత నుంచి తప్పించుకున్నారు'' అని కాంగ్రెస్ 'ఎక్స్'లో చేసిన పోస్ట్‌లో విమర్శించింది.
"చైనా ముందు తలొంచిన ప్రధానమంత్రి రాయితీలు ఇస్తూనే ఉన్నారు. భారత సరిహద్దులోపల అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్స్ ఆర్మీ(పీఎల్ఏ)తో ఇటీవల జరిగిన ఘర్షణల సమయంలో ఐటీబీపీ సిబ్బంది బాగా పనిచేశారని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ ప్రశంసించారు. ఆయన అలా ప్రశంసించడం సమంజసమే. ఈ తీవ్రమైన సమస్యపై ప్రధాని, ఆయన ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మౌనంగా ఉంది" అని కాంగ్రెస్ విమర్శించింది.
''చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని మన ప్రాంతాల పేర్లను మారుస్తూనే ఉంది. 60,000 మెగావాట్ల సామర్థ్యంగల ఆనకట్టను నిర్మిస్తోంది. ఇది మన పర్యావరణానికి, నీటి భద్రతకు పెద్ద ముప్పు'' అని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ 'ఎక్స్'లో చేసిన పోస్ట్‌లో విమర్శలు చేశారు.
''సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ చైనా విషయంలో ఈ మెతక వైఖరి ఎందుకు? ఆర్థికంగా కూడా చైనాపై ఆధారపడడం ఎందుకు పెరుగుతోంది? ఇదేనా జాతీయవాదం? అని దేశం ప్రశ్నిస్తోంది'' అని జైరామ్ రమేశ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘పౌరుల నిరసనలను అడ్డుకోడానికి భద్రతాదళాలను మోహరించారు’
"మన సరిహద్దులను కాపాడాల్సిన భద్రతా దళాలను పౌరులు నిరసనలు చేయకుండా ఆపడానికి మోహరిస్తున్నారు" అని ఐటీబీపీ డీజీ ప్రకటనపై కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజీత్ దీప్కే అన్నారు.
''మోదీ తన సొంత పౌరులపై భద్రతా దళాలను ఉపయోగిస్తూ జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారు. శాంతియుత నిరసనలను అణచివేయడానికి దిల్లీని ఒక కోటలా మార్చడం కాదు. సరిహద్దుల భద్రతే మన ప్రాధాన్యంగా ఉండాలి'' అని 'ఎక్స్'లో దీప్కే పోస్ట్ చేశారు.
అరుణాచల్ ప్రదేశ్‌లోని తాక్సింగ్ సమీపంలో ఉన్న అసాఫిలా ప్రాంతంలో జులై నెలాఖరు నుంచి భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోందని 'ది హిందూ' పత్రిక ఓ కథనంలో తెలిపింది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఎత్తైన ప్రాంతాల్లో గుడారాలను ఏర్పాటు చేసింది. ఎగువ సుబన్‌సిరి జిల్లాలోని తాక్సింగ్ దగ్గర ఉన్న మాజా కంపెనీ ఆపరేటింగ్ బేస్‌కు ఈ గుడారాలు దగ్గరగా ఉన్నాయి.
సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం షీ జిన్‌పింగ్ భారత్ వచ్చారు. రెండు పక్షాలు ఉద్రిక్తతలను తగ్గించడం గురించి అప్పుడు చర్చించాయి.

ఫొటో సోర్స్, Radloff/Three Lions/Getty Images
అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా ఏమంటోంది?
అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా దక్షిణ టిబెట్‌గా పేర్కొంటోంది. సరిహద్దు వివాదంపై భారత్, చైనా మధ్య పలు సమావేశాలు జరిగినప్పటికీ ఈ సమస్య పరిష్కారం కాలేదు.
భారత్, చైనా మధ్య సుమారు 3,500 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ సరిహద్దు వివాదం కారణంగా 1962లో రెండు దేశాలు యుద్ధం చేశాయి. అయినప్పటికీ సరిహద్దు వెంబడి ఉన్న కొన్ని ప్రాంతాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి అప్పుడప్పుడు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌పై భారత్ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది. అంతర్జాతీయ పటాల్లో అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్‌లో భాగంగా చూపిస్తారు. చైనా మాత్రం టిబెట్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్‌పై కూడా తనకు హక్కు ఉందని వాదిస్తూ దానిని దక్షిణ టిబెట్ అని పిలుస్తుంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఉత్తర భాగమైన తవాంగ్‌పై తనకు హక్కు ఉందని మొదట్లో చైనా వాదించేది. ఇక్కడే భారత్‌లోని అతిపెద్ద బౌద్ధ మఠం ఉంది.
మెక్‌మెహన్ రేఖను భారత్, చైనా మధ్య అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తారు. అయితే చైనా ఈ రేఖను అంగీకరించడం లేదు. టిబెట్‌లోని అధిక భాగం భారత నియంత్రణలో ఉందని చైనా వాదిస్తోంది.
చైనా అభ్యంతరాలను భారత్ తిరస్కరిస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనని చైనా వాదిస్తుండగా, పశ్చిమాన ఉన్న అక్సాయ్ చిన్‌లో అధిక భాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకుందని భారత్ చెబుతోంది.
1950దశకం చివర్లో టిబెట్‌ను ఆక్రమించుకున్న తర్వాత అక్సాయ్ చిన్‌లోని సుమారు 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా తన నియంత్రణలోకి తీసుకుంది. చైనా ఇక్కడ జాతీయ రహదారి 219ని నిర్మించి, దానిని తన తూర్పు ప్రావిన్స్ అయిన జిన్‌జియాంగ్‌కు అనుసంధానించింది. ఈ భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించుకుందని భారత్ అంటోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























