82 ఏళ్ల కిందట గల్లంతైన జర్మన్ జలాంతర్గామి ఇప్పుడు కనిపించింది

ఫొటో సోర్స్, Gasperados
- రచయిత, జానీ రూథర్‌ఫర్డ్, బ్రిట్టా జెల్ట్మ్యాన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ రాయల్ నేవీ దాడిలో దెబ్బతిని, గల్లంతైన జర్మనీ జలాంతర్గామిని 82 ఏళ్ల తర్వాత గుర్తించారు.
ఆగస్టులో డెవాన్లోని సాల్కోంబ్ తీరానికి దాదాపు 32 కిలోమీటర్ల దూరంలో, సుమారు 230 అడుగుల లోతులో పోర్ట్‌ల్యాండ్ డీప్ సీ డైవింగ్ బృందం ఈ జలాంతర్గామిని కనుగొంది.
ప్లిమత్కు చెందిన గ్యాస్పెరాడోస్ డైవింగ్ బృందం దానిని 'యూ-672' జలాంతర్గామిగా గుర్తించింది.
1944 జులైలో బ్రిటిష్ యుద్ధనౌక హెచ్ఎంఎస్ బాల్ఫోర్ ఈ జలాంతర్గామిపై దాడి చేసింది. దీంతో అందులోని 52 మంది సిబ్బంది జలాంతర్గామిని ఉద్దేశపూర్వకంగా ముంచేశారు. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది అందరూ ప్రాణాలతో బయటపడ్డారు.
జలాంతర్గామి మునిగిపోయిన ప్రదేశానికి సంబంధించిన నేవీ రికార్డుల్లో అక్షాంశ, రేఖాంశ వివరాలు తప్పుగా నమోదయ్యాయి. దీంతో ఇన్నేళ్లుగా దాని ఆచూకీ తెలియలేదు.

ఈ జలాంతర్గామిని గుర్తించడంలో సహాయపడగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉందని గ్యాస్పెరాడోస్ బృందం తెలిపింది.
"మేం జలాంతర్గామి చుట్టూ తిరుగుతూ పరిశీలించడం ప్రారంభించాక, దానిపై ఉన్న ఒక్కో భాగం కనిపించింది. స్నార్కెల్, కమాండింగ్ టవర్ వంటి భాగాలను చూశాను. వాటిని చూసిన తర్వాత జలాంతర్గామి వీడియోను చిత్రీకరించగలమని నాకు అర్థమైంది. చాలా సంతోషం వేసింది" అని బృందానికి చెందిన డైవర్ డొమినిక్ రాబిన్సన్ చెప్పారు.
దాడి జరిగిన తర్వాత జలాంతర్గామిలోకి నీరు చేరడం ప్రారంభమైంది. దీంతో జలాంతర్గామి కమాండర్ సాధ్యమైనంత ఎక్కువసేపు వేచి చూశారు. చివరకు సిబ్బంది ప్రాణాలతో బయటపడేందుకు ట్యాంకుల్లోని నీటిని బయటకు పంపించి, జలాంతర్గామిని సముద్ర ఉపరితలంపైకి తీసుకురావాలని నిర్ణయించారు.
జలాంతర్గామి వివరాల నమోదులో పొరపాటు
"వారు జలాంతర్గామిని సముద్ర ఉపరితలంపైకి తీసుకురాగలిగారు. ఆ తర్వాత ప్రాణాలను కాపాడుకునేందుకు లైఫ్ రాఫ్ట్లలోకి ఎక్కారు" అని రాబిన్సన్ తెలిపారు.
"వారు సముద్రంలో అలలపై తేలుతూ ఉన్నారు. మరుసటి రోజే బ్రిటిష్ విమానాలు, నౌకలు వారిని గుర్తించాయి. ఆ తర్వాత వారిని యుద్ధ ఖైదీల శిబిరానికి తరలించారు" అని వివరించారు.
రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి జర్మనీ చరిత్రపై పరిశోధనలు చేసే డాక్టర్ ఆక్సెల్ నీస్ట్లే, ముఖ్యంగా జర్మనీ జలాంతర్గాములపై అధ్యయనం చేస్తున్నారు. జలాంతర్గామి శిథిలాలు వాస్తవానికి సరైన ప్రదేశంలోనే ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే, పత్రాల్లో వివరాలను నమోదు చేసే సమయంలో జరిగిన పొరపాటు కారణంగా, వాస్తవ ప్రదేశానికి దాదాపు 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రికార్డుల్లో నమోదైందని చెప్పారు.
యుద్ధం ముగిసిన తర్వాత ప్రాణాలతో బయటపడిన సిబ్బంది జర్మనీకి తిరిగి వెళ్లారు. వారిలో జలాంతర్గామి కెప్టెన్ కూడా ఉన్నారు. ఆ కెప్టెన్ కుటుంబ సభ్యులతో తాను మాట్లాడినట్లు రాబిన్సన్ తెలిపారు. ఆయన చాలా ఏళ్లు సంతోషంగా జీవించారని కుటుంబ సభ్యులు చెప్పినట్లు వివరించారు.
"జలాంతర్గామి ఆచూకీ తెలిసిందని విని ఉంటే ఆయన గర్వపడేవారని, చాలా సంతోషించేవారని కుటుంబ సభ్యులు చెప్పారు" అని రాబిన్సన్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























