‘‘రణ్‌వీర్ సింగ్‌‌తో కలిసి పనిచేయకండి’’ అంటూ ఆ ఫిల్మ్ యూనియన్ తన సభ్యులకు ఎందుకు ఆదేశాలు జారీచేసింది? అసలేం జరిగింది?

రణ్‌వీర్ సింగ్‌, బాయ్‌కాట్

ఫొటో సోర్స్, AFP via Getty Images

    • రచయిత, నికితా యాదవ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

డాన్-3 చిత్రం నుంచి బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ అర్థాంతరంగా తప్పుకోవడంతో ఆయనతో కలిసి పనిచేయవద్దంటూ ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తన సభ్యులకు చెప్పింది.

రణ్‌వీర్ సింగ్ సినిమా నుంచి తప్పుకునే సమయానికే ప్రీ ప్రొడక్షన్ పనుల నిమిత్తం నిర్మాతలు 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వేలాదిమంది సినీ,టీవీ కార్మికులకు ప్రాతినిథ్యం వహించే ది ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యుఐసీఇ) తెలిపింది.

దీనిపై వివరణ ఇవ్వాలని రణ్‌వీర్‌ని పలుమార్లు కోరినప్పటికీ ఆయన స్పందించలేదని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తెలిపింది.

ఈ వివాదంపై రణ్‌వీర్ ఇప్పటివరకు స్పందించలేదు. కానీ తమ ముందు విచారణకు హాజరుకావాలని బలవంతపెట్టే అధికారం ఎఫ్‌డబ్ల్యూఐసీఈకు ఉందా? అని ఆయన టీమ్ ప్రశ్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంపై స్పందన కోసం రణ్‌వీర్‌సింగ్ టీమ్‌ని బీబీసీ సంప్రదించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘రూల్స్ సూపర్‌స్టార్లకూ వర్తిస్తాయి’

సంఘ ప్రతినిధులతో సమావేశానికి ఆయన అంగీకరించే వరకు రణ్‌వీర్‌పై "సహాయ నిరాకరణ ఆదేశాలు" అమలు చేయాలని నిర్ణయించినట్టు ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్ తివారి తెలిపారు.

‘‘రూల్స్ కంటే సూపర్‌స్టార్లు కూడా గొప్పవారు కాదనే సందేశాన్ని పరిశ్రమకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’’ తివారి చెప్పారు.

ఈ చర్య అధికారిక నిషేధానికి దారితీయకపోయినా, రణ్‌వీర్ స్టార్‌డమ్, బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యాక్షన్ సిరీస్‌లలో డాన్ ఫ్రాంచైజీ ఒకటి కావడంతో ఈ విషయం విస్తృత చర్చకు దారితీసింది.

డాన్ సినిమా మొదటిసారి 1978లో అమితాబ్ హీరోగా రూపోందింది.

తర్వాత దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మళ్లీ డాన్ సినిమాను రూపొందించగా, షారుక్ ఖాన్ హీరోగా నటించారు.

2023లో ప్రకటించిన డాన్ 3 సినిమాలో, డాన్ పాత్రను రణ్‌వీర్ సింగ్ పోషించాల్సి ఉంది.

ఈ వివాదం కారణంగా రణవీర్ సింగ్‌పై మరోసారి చర్చ మొదలైంది. ఆయన పద్మావత్, గల్లీ బాయ్ వంటి హిట్ సినిమాలతో పాటు, చలాకీ అయిన వ్యక్తిత్వంతోనూ ప్రసిద్ధి చెందారు.

తాజాగా ఆయన నటించిన ధురంధర్ అనే రెండు భాగాల స్పై థ్రిల్లర్ చిత్రం, ఇటీవలి కాలంలో భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

షారూఖ్ ఖాన్

ఫొటో సోర్స్, @VijaySethuOffl

ఫొటో క్యాప్షన్, ఫర్హాన్ అక్తర్ నిర్మించిన డాన్ చిత్రంలో షారూఖ్ నటించారు

వివాదం ఎప్పుడు మొదలైంది

రణ్‌వీర్ సింగ్‌పై ఎఫ్‌డబ్ల్యూఐసీఈకు ఫర్హాన్ అక్తర్ ఫిర్యాదు చేశాక ఈ వివాదం మొదలైందని యూనియన్ అధికార ప్రతినిధి అశోక్ పండిట్ తెలిపారు.

ప్రీ ప్రొడక్షన్, విదేశీ షెడ్యూల్స్ కోసం భారీగా ఖర్చు చేశాక, షూటింగ్ మొదలుకావడానికి సుమారు మూడు వారాల ముందు రణ్‌వీర్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని పండిట్ ఆరోపించారు.

దీంతో తన వైఖరిపై వివరణ ఇచ్చేందుకు రణ్‌వీర్ యూనియన్‌ను కలిసే వరకు ఆయనతో కలిసి పనిచేయకుండా బహిష్కరించాలని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తమ సభ్యులకు సూచించింది.

సినీ పరిశ్రమ పట్ల, డాన్ ఫ్రాంచైజీ పట్ల అత్యంత గౌరవం ఉందని, అలాగే ఈ వివాదంపై ఉద్దేశపూర్వకంగా మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నారంటూ రణ్‌వీర్ తరఫున ఒక ప్రతినిధి ప్రకటన విడుదల చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అయితే ఈ ప్రకటన నిజంగా ఆయన తరఫునే విడదలైందా అనే స్పష్టతకోసం బీబీసీ ఆయన టీమ్‌ని సంప్రదించినప్పటికీ ఇప్పటివరకూ స్పందన రాలేదు.

రణ్‌వీర్ సింగ్

ఫొటో సోర్స్, Jio Studios

గతంలో ఏం జరిగింది?

పెద్ద స్టార్లపై ఇలాంటి చర్యలు తీసుకోవడం అరుదైనప్పటికీ ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నుంచి "సహాయనిరాకరణ ఆదేశాలు" ఎదుర్కొన్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ ఒక్కరే కాదు.

గతంలో భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు, పాకిస్తాన్ నటులతో కలిసి పనిచేయవద్దని బాలీవుడ్ నటులను ఈ యూనియన్ కోరింది.

అయినా 2025లో నటుడు, గాయకుడు దిల్జీత్ దోసాంజ్ పాకిస్తాన్ యాక్టర్ హనియా అమీర్‌తో కలిసి ఓ ప్రసిద్ధ పంజాబీ కామెడీ షోలో కనిపించినందుకు యూనియన్ ఇలాంటి ఆదేశాలనే జారీచేసింది.

రణ్‌వీర్ వివాదంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఆయన్ను అన్యాయంగా టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు, ఇలా సినిమా నుంచి మధ్యలోనే తప్పుకున్నది రణ్‌వీర్ ఒక్కరే కాదని గుర్తు చేస్తున్నారు.

అయితే నిర్మాతలకు మద్దతిస్తున్నవారు మాత్రం పెద్ద స్థాయి సినిమా ప్రొడక్షన్‌లలో భారీ పెట్టుబడులు ఉంటాయని, చివరి నిమిషంలో ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం పెద్ద నష్టానికి దారితీస్తుందని వాదిస్తున్నారు. అందుకే ఆయన "అన్‌ప్రొఫెషనల్ బిహేవియర్‌కి మూల్యం చెల్లిస్తున్నారని" వారంటున్నారు.

వివాదాలకు కేంద్రబిందువుగా ఉండటం రణ్‌వీర్‌కు ఇదే మొదటిసారి కాదు.

కన్నడ హిట్ మూవీ కాంతారాలోని ఒక సన్నివేశాన్ని 2025లో సినిమా వేడుకలో అనుకరించడంతో రణ్‌వీర్‌ విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సన్నివేశం సాంస్కృతిక ప్రాధాన్యతను గౌరవించలేదని విమర్శకులు ఆరోపించారు. దీనిపై ఆయన తరువాత క్షమాపణ చెప్పారు.

ఆయన కెరీర్ ప్రారంభ దశలో 2015లో ఒక కామెడీ రోస్ట్ షో కారణంగా కూడా వివాదంలో చిక్కుకున్నారు. ఆ ఘటనపై పోలీస్ ఫిర్యాదులు నమోదై, అశ్లీలత, భావప్రకటన స్వేచ్ఛపై పెద్ద చర్చకు దారితీసింది.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)