మైక్రో డ్రామా: షార్ట్ సిరీస్‌లలో అశ్లీలత, హింస, విలాసాల ప్రదర్శనపై చైనా ఆంక్షలు

చైనా మైక్రో డ్రామాలు, నియంత్రణ చర్యలు

ఫొటో సోర్స్, VCG via Getty Images

ఫొటో క్యాప్షన్, మైక్రో డ్రామాలు మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చిన్న చిన్న క్లిప్‌ల రూపంలో, సిరీస్‌లుగా వస్తాయి.
    • రచయిత, ఓస్మండ్ చియా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

స్థానికంగా రూపొందే మైక్రో డ్రామాల్లో ధనవ్యామోహం, హింస, అసభ్యకరమైన కంటెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని చైనా తన ప్రాంతీయ అధికారులను ఆదేశించింది.

సాఫ్ట్ పోర్నోగ్రఫీ, 'వివాహం, బంధాలపై వక్రీకరించిన అభిప్రాయాలు', 'సంపదను మితిమీరి ప్రదర్శించడం' వంటి వాటిపై క్యాంపెయిన్ దృష్టి పెట్టినట్లు చైనా నేషనల్ రేడియో అండ్ టెలివిజన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

సామాజిక నియమాలను సరైన దిశలో నడిపించేందుకు, వివాహాలను ప్రోత్సహించేందుకు, హానికరమైన భావజాలాలు ఆన్‌లైన్‌లో వ్యాపించకుండా నిరోధించేందుకు చైనా ప్రభుత్వం తీసుకుంటున్న విస్తృత చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం వెలువడింది.

మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా రూపొందే ఈ మైక్రో డ్రామా సిరీస్‌లకు ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రజాదరణ లభించింది. అయితే, వీటిలోని 'సంచలనాత్మక కంటెంట్‌'పై విమర్శలు కూడా వస్తున్నాయి.

ప్రేక్షకులను స్క్రీన్లకు కట్టిపడేసేందుకు.. రహస్య కోటీశ్వర భర్తలు, గుట్టుచప్పుడు కాకుండా సాగే ప్రేమకథల వంటి విభిన్న అంశాలతో, వేగంగా సాగే ఉత్కంఠభరిత కథనాలతో అనేక షోలను రూపొందిస్తున్నారు. అలాగే మితిమీరిన హింసను, అసభ్యకరమైన పాత్రలను ప్రదర్శించే షోలకు కూడా ఇక్కడ కొరత లేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మైక్రో డ్రామా రంగంలో అసభ్యత లేని, బాధ్యతాయుతమైన కంటెంట్‌ ఉండేలా చూడటానికి ఈ క్యాంపెయిన్ ఎంతో కీలకమని చైనా మీడియా అడ్మినిస్ట్రేషన్ ఈ వారం ఒక ప్రకటనలో పేర్కొంది.

"రాచరిక పోకడలు, హింసను ప్రేరేపించే కంటెంట్, అసభ్యకరమైన శీర్షికలు, కాపీరైట్ ఉల్లంఘనలను" కూడా ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా చేసుకోనుందని ఆ ప్రకటన పేర్కొంది.

తమ పరిధిలోని ప్రొడక్షన్ కంపెనీల పనితీరుపై ప్రాంతీయ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని, ఏవైనా లోపాలు బయటపడితే ఆయా సంస్థలు వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని మీడియా నియంత్రణ సంస్థ తెలిపింది. అలాగే, ఈ క్యాంపెయిన్ ద్వారా వచ్చే ఫలితాల ఆధారంగా తమ యంత్రాంగం స్వయంగా తనిఖీలు చేపడుతుందని, నిబంధనలను మరింత మెరుగుపరుస్తుందని స్పష్టం చేసింది.

బిలియన్ డాలర్ల పరిశ్రమ

మైక్రో డ్రామా చైనాలో బిలియన్ డాలర్ల పరిశ్రమగా ఎదిగింది. ఆసియాలోని ఇతర ప్రాంతాలు, ఆఫ్రికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇవి భారీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ఈ రంగంలోని వృద్ధిని అందుకోవడానికి దక్షిణ కొరియా, అమెరికా వంటి దేశాల ప్రొడ్యూసర్లు కూడా తమ సొంత మైక్రో డ్రామా స్టూడియోలను ఏర్పాటు చేయడానికి పెట్టుబడులు పెట్టారు.

గతేడాది ఈ రంగం సాధించిన వృద్ధిని దృష్టిలో ఉంచుకుని.. హై-ప్రొఫైల్, సున్నితమైన మైక్రో డ్రామా నిర్మాణాలకు తప్పనిసరిగా అధికారుల అనుమతి ఉండాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది.

చైనాకు చెందిన ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు వీచాట్, డౌయిన్ (చైనా వర్షన్ టిక్‌టాక్) కూడా లైంగిక అసభ్యతతో కూడిన కంటెంట్‌ను తొలగించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టాయి.

యువత పెడదోవ పట్టడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదా విలాసాల పట్ల వ్యామోహాన్ని (ధనవ్యామోహాన్ని) ప్రోత్సహించడం వంటి హానికరమైన భావజాలాలను ప్రచారం చేసే మైక్రో డ్రామాలను లక్ష్యంగా చేసుకుని నియంత్రించాయి.

ధనిక, పేద వ్యత్యాసాలను తగ్గించే లక్ష్యంతో..

అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నాయకత్వంలో, చైనాలోని సామాజిక దృక్పథాలను ప్రభావితం చేయడానికి బీజింగ్ పలు చర్యలు చేపట్టింది. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్ల మధ్య.. ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రోత్సహించడంతో పాటు, సంపదను ప్రదర్శించడాన్ని నిరుత్సాహపరచడం ఇందులో భాగం.

చైనాలో తీవ్ర రాజకీయ సమస్యగా మారిన పెరిగిపోతున్న ధనిక, పేద వ్యత్యాసాలను తగ్గించే లక్ష్యంతో కూడిన "అందరికీ సమాన ఆర్థికాభివృద్ధి" విధానాన్ని షీ జిన్‌పింగ్ ఎప్పటినుంచో సమర్థిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఆన్‌లైన్ కంటెంట్‌ను లక్ష్యంగా చేసుకుని చైనా సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరో రెండు నెలల స్పెషల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. సమాజంలో మితిమీరిన నిరాశావాదాన్ని వ్యాప్తి చేసే కంటెంట్‌పై చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

మరింత 'ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన వాతావరణాన్ని' సృష్టించే ప్రయత్నంలో భాగంగా.. 'ప్రపంచంపై విరక్తిని' పెంచేలా లేదా కష్టపడి పనిచేయడం 'వృథా' అని సూచించే కథనాలను ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా చేసుకుంది.

ఇటీవలి కాలంలో నిరుద్యోగం, ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ వంటి ఆర్థిక సవాళ్లను చైనా ఎదుర్కొంటోంది. ఇవన్నీ అక్కడి యువతలో ఆందోళనకు కారణమయ్యాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)