గుడ్‌నైట్
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.ఫ్రాన్స్: సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్‌లపై సైబర్ దాడులు, ఉష్ణోగ్రతలు పెంచి లక్షల యూరోలా నష్టం కలించిన దుండగులు
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.ఫ్రాన్స్: సూపర్ మార్కెట్లలోని ఫ్రిజ్‌లపై సైబర్ దాడులు, ఉష్ణోగ్రతలు పెంచి లక్షల యూరోలా నష్టం కలించిన దుండగులు

ఫొటో సోర్స్, I& PR AP
విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. రాష్ట్రపతి ఇంద్రకీలాద్రికి చేరుకున్న సందర్భంగా ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు.
విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించి రాష్ట్రపతికి వేద మంత్రోచ్ఛారణల నడుమ వేద ఆశీర్వచనం అందజేశారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కనకదుర్గ అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. అలాగే అమ్మవారి చిత్రపటాన్ని అందించి గౌరవపూర్వకంగా సత్కరించారు.

సిక్కిం గవర్నర్‌గా దుష్యంత్ గౌతమ్‌ను నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా గేట్ దగ్గర నిరసన తెలుపుతున్న అంకితా భండారీ తల్లిదండ్రులను కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ పరామర్శించారు.
లైంగిక వేధింపుల బాధితుల తరఫున పోరాడే సామాజిక కార్యకర్త యోగితా భయానా కూడా వారితో ఉన్నారు.
"మేమింకా ఇండియా గేట్ దగ్గరే ఉన్నాం. సీబీఐ దర్యాప్తు పూర్తయ్యే వరకు దుష్యంత్ కుమార్ గౌతమ్ నియామకాన్ని తక్షణమే నిలిపివేయాలని అంకితా భండారీ కుటుంబం డిమాండ్ చేస్తోంది" అని యోగితా భయానా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
దుష్యంత్ కుమార్‌ను జైలులో పెట్టాలని అంకితా భండారీ తండ్రి వీరేంద్ర సింగ్ భండారీ డిమాండ్ చేశారు.
దుష్యంత్ గౌతమ్ సిక్కిం కొత్త గవర్నర్‌గా నియమిస్తున్నట్టు ఈ నెల 12నరాష్ట్రపతి భవన్ పత్రికాప్రకటన జారీచేసింది.
పౌరీ గఢ్వాల్ జిల్లాలోని గంగా-భోగ్పూర్ ప్రాంతంలో ఉన్న వనంతర టూరిస్ట్ రిసార్ట్‌లో అంకితా భండారీ రిసెప్షనిస్ట్‌గా పనిచేసేవారు. 2022లో ఆమెపై లైంగిక దాడి చేసి, ఆమెను హత్య చేసినట్టు ఆరోపణలొచ్చాయి.
ఈ కేసులో తన పేరు వెలుగులోకి వచ్చిన తర్వాత అప్పటి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాఖండ్ రాష్ట్ర ఇన్చార్జ్ దుష్యంత్ కుమార్ గౌతమ్ తనపై ఆరోపణలను ఖండిస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్ఐఆర్ దాఖలయింది.
హరిద్వార్‌లోని జ్వాలాపూర్ మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోర్, నటి ఊర్మిళ సనావర్ కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో కలిసి తనపై పక్కా ప్రణాళికతో నేరపూరిత కుట్ర పన్నారని దెహ్రాడూన్‌లోని దలన్వాలా పోలీస్ స్టేషన్లో నమోదైన ఫిర్యాదులో దుష్యంత్ గౌతమ్ ఆరోపించారు.
అంకితా భండారీ హత్య కేసు దర్యాప్తు, చార్జిషీట్, కోర్టు విచారణ ప్రక్రియలన్నింటిలో తన పేరు ఎక్కడా ప్రస్తావనకు రాలేదని కూడా దుష్యంత్ గౌతమ్ చెప్పారు.
ఫిర్యాదులో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన ఆరోపణలు చేశారు.

ఫొటో సోర్స్, JANASENA
టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. పార్టీ కండువా కప్పి వంగవీటి రాధను పవన్ కల్యాణ్ సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన వంగవీటి రాధాకృష్ణను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.
అనంతరం వంగవీటి రాధ తన అనుచరులను పవన్ కల్యాణ్‌కు పరిచయం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టిగా ముందుకు వెళ్దామని పవన్ వారితో అన్నారు.

ఫొటో సోర్స్, ANI
బిహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్ దగ్గర మంగళవారం రాత్రి(అక్టోబర్ 13) గంగా నదిలో పడవ బోల్తా పడటంతో 13 మంది చిన్నారులు మరణించారు.
"సమాచారం అందిన వెంటనే అధికార యంత్రాంగం తక్షణ సహాయక చర్యలు చేపట్టింది. 13మంది మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో తొమ్మిదిమంది బాలికలు, నలుగురు బాలురు ఉన్నారు. వాళ్లంతా 15 ఏళ్లలోపు వారే" అని జిల్లా కలెక్టర్ వర్షాసింగ్ చెప్పారు.
"ఆరుగురిని రక్షించి ఎన్ఎంసీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు పెద్దవాళ్లు, నలుగురు పిల్లలు ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారు" అని ఆమె తెలిపారు.
సూర్యాస్తమయం తర్వాత పడవలను నడపకూడదని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని అన్నారు.
ప్రమాదానికి గురైన పడవ ప్రైవేటుగా రిజిస్టర్ అయిందని, ఆ పడవ ఎవరి పేరుమీద రిజిస్టర్ అయిందో ఆ వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
ఫ్రాంక్ఫర్ట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో జైపూర్‌కు మళ్లించారు.
విమానాన్ని జైపూర్‌లో అత్యవసరంగా దించారని, అధికారులు విమానాశ్రయానికి చేరుకుంటున్నారని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.
మరోపక్క ఎయిర్ ఇండియా విమానం ఏఐ2030 జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిందని, హైజాక్ బెదిరింపుల నేపథ్యంలో భద్రతా తనిఖీలు చేస్తున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. హైజాక్ బెదిరింపులపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

ఫొటో సోర్స్, @RahulGandhi
జంతర్ మంతర్‌లో జాతీయ జెండా ఎగరేయడం నేరం కాదు, కానీ ఆ పనిచేసిన కొందరిని జైల్లో పెట్టడం పిరికితనమే అన్నారు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ.
సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి, జ్యుడిషియల్ కస్టడీకి పంపడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు.
“జంతర్ మంతర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి శాంతియుతంగా నిరసన తెలపడం నేరం కాదు. యువకులను జైల్లో వేయడం పిరికితనం” అని రాహుల్ గాంధీ విమర్శించారు.
"విద్యార్థులు, యువతరం, జర్నలిస్టులు, ‘ఇండియా’ బ్లాక్ పార్టీల బ్యానర్లు వేర్వేరు కావచ్చు. కానీ లక్ష్యం మాత్రం ఒక్కటే. ఒకే విషయం గురించి నిరసనలు జరుగుతున్నాయి. పౌరులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కులను కోరుతున్నారు. జంతర్ మంతర్ దేశ ప్రజలది. దాన్ని తిరిగి సాధించుకుంటాం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.
ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కూడా సోషల్ మీడియాలో విమర్శించారు.
"త్రివర్ణ పతాకాన్ని ఎగరేసి, భారత్ మాతాకి జై అని నినాదాలు చేసిన సీజేపీ నేతలు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను మీరు జైలుకు పంపించారు. యువతతో పెట్టుకోవద్దు మోదీజీ, త్వరలోనే మీ నియంతృత్వానికి ముగింపు పలుకుతారు" అని సంజయ్ సింగ్ రాసుకొచ్చారు.
మంగళవారం జంతర్ మంతర్‌లోకి అక్రమంగా చొరబడ్డారని సీజేపీ నాయకులపై దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఫొటో సోర్స్, @abhijeet_dipke
జంతర్ మంతర్‌లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనే ఆరోపణలపై సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను మందిర్ మార్గ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
అంతకు ముందు సీజేపీ నేతల అరెస్టుపై కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన న్యాయ వ్యవహారాల చీఫ్ రత్న సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
"న్యాయవాదులను కలిసేందుకు కూడా వారిని అనుమతించలేదు. తెల్లవారుజామున 3 గంటలకు ఒక ప్రైవేట్ వాహనంలో వారిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారి మనోధైర్యం ఏమాత్రం తగ్గలేదు." అని పేర్కొన్నారు.
"అనుమతి లేకుండా ప్రవేశించడం, బాండ్ షరతులు ఉల్లంఘించడం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు సీజేపీ నేతలపై మోపారు" అని రత్న సింగ్ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
బిహార్‌లోని వైశాలి జిల్లా రాఘోపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని గంగా నదిలో మంగళవారం రాత్రి పడవ బోల్తా పడింది.
ఈ ఘటనలో 13 మంది పిల్లలు మరణించారు.
పడవలో ఒకే గ్రామానికి చెందిన కొంతమంది ఒక విందు కోసం మరో గ్రామానికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది.
భగ్తాన్ తోలా (రాంపూర్ శ్యామ్‌చంద్ పంచాయతీ)లోని మాతా మహారాణి స్థాన్ సమీపంలో సింగేశ్వర్ రాయ్ అనే వ్యక్తి ఇంట్లో జరిగే విందు కోసం సుమారు 20 మంది ఒక చిన్న పడవలో బయల్దేరారని స్థానికులు చెప్పారు.
“ఏడుగురిని రక్షించి నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. పడవలో ఉన్న పిల్లలందరూ 15 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సు గలవారే” అని వైశాలి జిల్లా మేజిస్ట్రేట్ వర్షా సింగ్ తెలిపారు.
అయితే, ఘటనా స్థలానికి అధికారులు చేరుకోవడానికి, చర్యలు తీసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
"ఈ ప్రమాదం మంగళవారం రాత్రి 8:30 గంటలకు జరిగింది. 15 నుంచి 20 మంది పిల్లలు ఒక చిన్న ప్రైవేట్ పడవలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందింది. ఆ పిల్లలు పక్క గ్రామంలోని విందుకు వెళ్తున్నారు. రాత్రంతా రక్షణ చర్యలు కొనసాగాయి. 13 మంది మృతదేహాలను వెలికితీశారు." అని వర్షా సింగ్ అన్నారు.
సురక్షితంగా బయట పడ్డ వారిలో కొందరికి మెరుగైన చికిత్స అందించేందుకు పట్నా తరలించారు.

ఫొటో సోర్స్, Getty Images
పోప్ లియో XIVకు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు నిర్థరణ కావడంతో శస్త్రచికిత్స చేశారని, ఆపరేషన్ విజయవంతమైందని వాటికన్ ప్రకటించింది.
రోమ్‌లోని జెమెల్లీ ఆసుపత్రిలో 71 ఏళ్ల పోప్‌కు మంగళవారం 90 నిమిషాల పాటు ఈ శస్త్రచికిత్స జరిగింది.
"ఆపరేషన్ విజయవంతమైంది, ఎటువంటి సమస్యలు లేవు," అని వాటికన్ తెలిపింది. "ఆపరేషన్ తర్వాత పోప్ లేచి బయటకు వచ్చి, కాసేపు వైద్యుల పర్యవేక్షణలో ఉండి తిరిగి తన గదికి వెళ్లారు," అని వెల్లడించింది.
సాధారణ పరీక్షలు చేసినప్పుడు క్యాన్సర్ గడ్డను గుర్తించినట్టు వాటికన్ పేర్కొంది.
పోప్ సుమారు వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంటారు.

ఫొటో సోర్స్, ANI
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక మహిళా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
మమతా బెనర్జీ ఒక పూజను ప్రారంభించడానికి వెళ్తుండగా, కాళీఘాట్‌లోని ఆమె నివాసం సమీపంలో తనిష్ఠా సాహా (38) అనే మహిళ దాడి చేసినట్టు టీఎంసీకి చెందిన డోలా సేన్ ఆరోపించారు.
టీఎంసీ కార్యకర్తలు ఆ మహిళను పోలీసులకు అప్పగించి, కాళీఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మమతా బెనర్జీని దూషించి, కత్తితో దాడి చేయడానికి సాహా ప్రయత్నించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ మహిళ మద్యం మత్తులో ఉన్నట్టు కూడా ఆరోపించారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ నేతలు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు కూడా అంగీకరించారు. కానీ మహిళ వద్ద ఎలాంటి ఆయుధం లభించలేదని తెలిపారు. ఘటనా స్థలంలో పౌర స్వచ్ఛంద కార్యకర్తలు, టీఎంసీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగినట్లు వెల్లడించారు.
అయితే మమతా బెనర్జీకి ఉన్న జెడ్-ప్లస్ భద్రతను ఉల్లంఘించారని ఆ పార్టీ ఆరోపించింది.
దాడికి యత్నించిన మహిళ పేరును తనిష్ఠ సాహాగా టీఎంసీ పేర్కొంటే, ఆమె పేరును అనూష సాహాగా పోలీసులు తెలిపారు.
"ఘటనా స్థలంలో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని తెలుస్తోంది. ఆమె ఎందుకు ఎలా చేసిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం" అని కోల్‌కతా పోలీస్ కమిషనర్ అజయ్ నందా వెల్లడించారు.
నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.