లైవ్, నిరసనకారులపై ఎఫ్ఐఆర్‌లు ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయి - సీజేపీ

నిరసనకారులుపై ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించుకునే హామీ నోటిఫికేషన్లను రేపటిలోపు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ-ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు విడుదల చేయాలని కాక్రోచ్ జనతాపార్టీ కోరింది. నిరసనకారులెవ్వరూ ఒంటరి వ్యక్తులు కాదని, అందరం కలిసి పోరాడదామని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ చెప్పారు.

సారాంశం

  • కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చారు. జులై 20న పార్లమెంట్ మార్చ్ సమయంలో నిరసనకారులపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్)పెల్లెట్ గన్స్ ఉపయోగించిందనే ఆరోపణలపై చర్చ జరపాలని డిమాండ్ చేశారు.
  • సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది.
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై 'E20' కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. "ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, శనివారం(ఆగస్టు 1) మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.
  • ఇరాన్‌తో 'చాలా స్నేహపూర్వక చర్చలు' జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు. "ఈ యుద్ధాన్ని ముగించేందుకు మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.

లైవ్ కవరేజీ

  1. ఫ్రాన్స్‌లో ఇంకా అదుపులోకి రాని కార్చిచ్చు

    ఫ్రాన్స్, కార్చిచ్చు, యూరప్

    ఫొటో సోర్స్, Kenzo TRIBOUILLARD / POOL / AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, బోర్డో నగరానికి 15కిలోమీటర్ల దూరానికి కార్చిచ్చు వ్యాపించింది.

    ఫ్రాన్స్‌లో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు నైరుతి నగరమైన బోర్డోకు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఎలాంటి పరిస్థితినయినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బోర్డో మేయర్ థామస్ కాజెనావ్ చెప్పారు.

    "మరింత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలొస్తే, అందుకు తగ్గట్టుగా భారీ సంఖ్యలో ప్రజలకు తాత్కాలిక వసతి కల్పించే ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని మేయర్ థామస్ కాజెనవే అన్నారు.

    కార్చిచ్చుతో ప్రభావితమైన గిరోండ్ ప్రాంతాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ పరిశీలించారు. దేశం ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని స్థాయిలో కార్చిచ్చు ప్రభావం ఉందని ఆయన చెప్పారు.

    రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇది అత్యంత ఘోరమైన కార్చిచ్చు అని మేక్రాన్ తెలిపారు.

    కార్చిచ్చు ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్‌లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి.

    గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

  2. యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ఎలా స్పందించింది?

    అమెరికా, ఇరాన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ట్రంప్

    ఇరాన్‌తో 'చాలా స్నేహపూర్వక చర్చలు' జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.

    వరుసగా మూడో రోజు కూడా ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోలేదు.

    "ఈ యుద్ధాన్ని ముగించేందుకు మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను" అని ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ అన్నారు.

    ఈ చర్చలు విఫలమైతే, కాల్పుల విరమణకు ముందు తీసుకున్న చర్యలనే అమెరికా మళ్లీ ప్రారంభిస్తుందని ఆయన హెచ్చరించారు.

    మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ ఖండించింది. అమెరికాతో ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరపడం లేదని తెలిపింది.

    మధ్యవర్తిత్వం వహిస్తున్న దేశాలు చర్చలకు మరో అవకాశం కోరడంతో శుక్రవారం(జూలై 24) ఇరాన్‌పై దాడులను నిలిపివేసినట్టు ట్రంప్ తెలిపారు.

    ఇరాన్ కూడా ప్రస్తుతానికి తన దాడులను నిలిపివేసింది.

    దాదాపు రెండు వారాల తర్వాత ఈ విరామం వచ్చింది.

  3. నిరసనకారులపై కేసులు ఉపసంహరణ హామీ నోటిఫికేషన్‌ను రేపటిలోపు విడుదల చేయాలి- సీజేపీ

    దిల్లీ, నిరసన, కేసులు, కాక్రోచ్ జనతా పార్టీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, దిల్లీలో యువత ఆందోళన(ఫైల్ ఫోటోె)

    నిరసనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని బిహార్, అసోం ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ అన్నారు.

    పార్టీ పత్రికా సమావేశం అనంతరం ప్రభుత్వ ప్రతినిధులు తనను, తన సహచరులను కలిశారని ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో సౌరవ్ దాస్ తెలిపారు.

    "ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం రెండుమూడు గంటల పాటు జరిగింది. నిరసనకారులపై దాఖలైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని హామీ ఇస్తూ బిహార్, అసోం ప్రభుత్వాలు జారీ చేసిన నోటిఫికేషన్ల కాపీలను వారు షేర్ చేశారు’’ అని సౌరవ్ దాస్ చెప్పారు.

    ‘‘నిరసనకారులపై భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోబోరని కూడా ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న, అరెస్టు చేసిన వారందరినీ కూడా విడుదల చేస్తామని చెప్పారు’’ అని సౌరవ్ దాస్ వివరించారు.

    ‘‘కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి ఇలాంటి హామీలతో కూడిన నోటిఫికేషన్లు రేపటిలోగా జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ముందుగా అంగీకరించిన భాషనే ఉపయోగిస్తారని ఆశిస్తున్నాం. ఏ నిరసనకారుడినీ ఒంటరిగా వదిలిపెట్టం. ఈ పోరాటంలో మనమంతా కలిసి ఉన్నాం’’ అని సౌరవ్ దాస్ అన్నారు.

  4. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.

    ఇప్పటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.