లైవ్, అమెరికాలో కాల్పులు, పలువురికి గాయాలు

సియాటెల్‌లోని ప్రముఖ ప్రాంతం స్పేస్ నీడిల్ దగ్గర ఉన్న సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని సియాటెల్ పోలీసులు తెలిపారు.

సారాంశం

  • పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇవాళ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం-2024ను సవరించే బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరనున్నారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు అనుమతి లభిస్తే సభ పరిశీలించి ఆమోదించాలని ప్రతిపాదించనున్నారు.
  • విద్యాసంస్కరణల కంటే ముందు మీడియా సంస్కరణలు రావాల్సిన అవసరముందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య డాక్టర్ గీతాంజలి అన్నారు. "నిత్యం వండివార్చిన కథనాలతో దేశం వివేకవంతం కాలేదు. అది ఒకే మూసధోరణి వైపు లాక్కెళ్తుంది" అని ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఆమె అభిప్రాయపడ్డారు.
  • ఫ్రాన్స్‌లోని బోర్డో నగరానికి దగ్గరలో కార్చిచ్చు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేలాదిమంది శ్రమిస్తున్నారు. నగరాన్ని ఖాళీ చేయించే అవకాశం అంతగా లేదని అధికారులు చెప్పారు. గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

  1. అమెరికాలో కాల్పులు, పలువురికి గాయాలు

    అమెరికాలో కాల్పులు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, సియాటెల్‌లో కాల్పులు

    అమెరికాలోని సియాటెల్‌లో కాల్పులు జరిగాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

    నగరంలో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్‌లో ఈ కాల్పులు జరిగాయి.

    "సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. దయచేసి ఆ ప్రాంతానికి దూరంగా ఉండండి" అని సియాటెల్ పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.

    సియాటెల్ సెంటర్‌లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఆహార స్టాల్స్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఉంటాయి. దీనికి లక్షలాది మంది హాజరవుతారు.

  2. దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందకరమైనది ఏదీ లేదు: మీరాబాయి చనూ

    కామన్‌వెల్త్ గేమ్స్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, మీరాబాయి చనూ

    గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చనూ స్వర్ణపతకం గెలుచుకుంది. దేశం కోసం స్వర్ణం సాధించడం కంటే ఆనందకరమైనది మరొకటి లేదని వరుసగా మూడోసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న అనంతరం మీరాబాయి చనూ చెప్పింది.

    "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది నా మూడో స్వర్ణ పతకం. మొత్తంగా ఇది నా నాలుగో పతకం. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకోవడంతో నా ప్రయాణం మొదలైంది" అని మీరాబాయి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    జుట్టులోని త్రివర్ణ పతాక రంగుల్లో క్లిప్పు పెట్టుకోవడానికి గల కారణాన్ని మీరాబాయి చెప్పింది.

    "ఈ త్రివర్ణ క్లిప్పులను నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. మన జాతీయ పతాకానికి ప్రాతినిధ్యం వహించేలా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఏదైనా తయారు చేయాలని అకస్మాత్తుగా అనిపించింది. అందుకే ఈ సీతాకోకచిలుక ఆకారపు క్లిప్పులను పోటీల ముందురోజు నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. త్రివర్ణ పతాకాన్ని నాతో పాటు తీసుకువెళ్లడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ నేను చాలా భావోద్వేగానికి లోనై చాలా ఏడ్చాను. అయితే భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ ఈ క్షణం నాకు అంతే ఆనందాన్ని కూడా ఇచ్చింది" అని మీరాబాయి తెలిపింది.

  3. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.

    ఇప్పటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    మరిన్న ‘బీబీసీ తెలుగు’ కథనాలు మీకోసం..