కర్ణాటకలోని పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్, జంధ్యం ధరించొచ్చంటూ అనుమతులిచ్చిన ప్రభుత్వం

భారతదేశం, కర్ణాటక, విద్య, సంప్రదాయం, ముస్లిం, కాంగ్రెస్, బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్ విషయం వివాదాస్పదమైంది (ఫైల్ ఫోటో)
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

కర్ణాటకలోని గత భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం 2022లో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు హిజాబ్, జంధ్యం, పగడీ, శివమాల, రుద్రాక్షలను ధరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిర్ణీత యూనిఫాంతో పాటు "పరిమిత సామాజిక లేదా విశ్వాసాలకు సంబంధించిన చిహ్నాలను" ధరించడానికి అనుమతి ఉంటుంది. ఈ కొత్త నిబంధన రాబోయే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి రానుంది.

'అయితే, ఇలాం సంప్రదాయ, ఆచార సంబంధిత చిహ్నాలు యూనిఫాం ప్రాథమిక భావనను లేదా ఉద్దేశాన్ని ప్రభావితం చేయకూడదు, మార్చకూడదు లేదా బలహీనపరచకూడదు' అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

అంతేకాకుండా, దీనివల్ల "క్రమశిక్షణ, భద్రత, విద్యార్థి గుర్తింపు"కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. పరీక్షలకు హాజరయ్యే సమయంలో నిబంధనలు మాత్రం మునుపటిలాగే కొనసాగుతాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కర్ణాటక ప్రాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప విలేకరులతో మాట్లాడుతూ.. ''అనేక సంఘటనలు జరిగాయి. ఏప్రిల్ 24న ఒక విద్యార్థిని జంధ్యం తీసేయాలని కోరారు. ఇటువంటి విషయాలు మన పిల్లల విద్యకు అడ్డంకి కాకూడదు. ఈ నిర్ణయాన్ని మనం ఎప్పుడో తీసుకోవాల్సి ఉందని నేను భావిస్తున్నాను'' అని అన్నారు.

ఉడిపి ప్రభుత్వ మహిళా ప్రీ-యూనివర్శిటీ కళాశాల వేదికగా మొదలైన హిజాబ్ వివాదం, 2022 ఫిబ్రవరిలో కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ నిరసనలకు కారణమైంది.

ద్విసభ్య ధర్మాసనంలో న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో, ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులోనే విచారణ దశలో ఉంది.

భారతదేశం, కర్ణాటక, విద్య, సంప్రదాయం, ముస్లిం, కాంగ్రెస్, బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిజాబ్‌పై నిషేధం విధించిన తర్వాత, ప్రజల మత స్వేచ్ఛపై చర్చ పెరిగింది (ఫైల్ ఫోటో)

ప్రభుత్వ వైఖరిలో మార్పు ఎందుకు?

మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీఈటీ (సెట్) పరీక్షకు జంధ్యం ధరించి వచ్చిన విద్యార్థులను బెంగళూరులోని ఒక కళాశాల అనుమతించని సమయంలో కాంగ్రెస్ ఈ అడుగు వేసింది.

అంతేకాకుండా, 2026 ఏప్రిల్‌లో జరిగిన దావణగెరె అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థి సమర్థ్ శమనూర్ మల్లికార్జున్‌కు మద్దతు ఇవ్వకపోవడం, పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఈ ఆదేశాలు రావడం గమనార్హం.

దావణగెరెలో 60 శాతానికి పైగా ఓటర్లు ముస్లిం వర్గానికి చెందిన వారు కావడంతో, ఆ స్థానంలో ముస్లిం అభ్యర్థినే బరిలోకి దించాలని ఆ సామాజికవర్గం డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్ అధిష్టానం సమర్థ్ శమనూర్ వైపు మొగ్గు చూపించింది.

గతంలో ఈ నియోజకవర్గంలో సమర్థ్ తాత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శమనూర్ శివశంకరప్ప ప్రాతినిధ్యం వహించారు. సమర్థ్ తండ్రి ఎస్.ఎస్.మల్లికార్జున్ కూడా సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన తల్లి ప్రభా మల్లికార్జున్ లోక్‌సభ సభ్యురాలు.

ఈ వివాదం తర్వాత, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో మైనారిటీ సెల్ అధిపతి, ఎమ్మెల్సీ అబ్దుల్ జబ్బార్‌ను పార్టీ బహిష్కరించింది.

అదే సమయంలో ముఖ్యమంత్రి తన రాజకీయ సలహాదారు, ఎమ్మెల్సీ నసీర్ అహ్మద్‌ను కూడా పదవి నుంచి తొలగించారు.

సమర్థ్ 5,708 ఓట్ల తేడాతో విజయం సాధించినప్పటికీ, ఎస్‌డీపీఐకి 18,975 ఓట్లు వచ్చాయి. ఈ ఉప ఎన్నిక ముస్లిం సమాజంలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ముస్లిం సంఘాల మహాకూటమి శనివారం బెంగళూరులో భారీ సమ్మేళనాన్ని నిర్వహించనున్న తరుణంలో ప్రభుత్వం ఈ తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

భారతదేశం, కర్ణాటక, విద్య, సంప్రదాయం, ముస్లిం, కాంగ్రెస్, బీజేపీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హిజాబ్ వివాదం కర్ణాటకలో ఎన్నికల అంశంగా కూడా మారింది

ఉడుపి కేంద్ర బిందువు...

హిజాబ్ వివాదం 2021 డిసెంబర్ చివరలో ఉడుపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ గర్ల్స్ కాలేజీలో ప్రారంభమైంది.

అప్పట్లో కొత్త యూనిఫాం నిబంధనలను ఉల్లంఘించి హిజాబ్ ధరించారనే కారణంతో ఆరుగురు ముస్లిం విద్యార్థినులను క్లాసులోకి అనుమతించలేదు.

హిజాబ్ ధరించినందుకు ఇద్దరు విద్యార్థినులను క్లాసు వదిలి వెళ్లాలని చెప్పారు. 12 మంది విద్యార్థినులు దీనిపై నిరసన వ్యక్తం చేసినప్పటికీ, చివరికి నలుగురు విద్యార్థినులు కొత్త నిబంధనలకు కట్టుబడి నడుచుకోవడానికి అంగీకరించారు.

చిక్కమగళూరు జిల్లాలోని కొప్పల్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తింది. కానీ, అక్కడ ఇది నిరసన రూపం దాల్చింది. విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు చేరుకున్నారు.

అయితే, కళాశాల యాజమాన్యం ముస్లిం మత పెద్దలు, తల్లిదండ్రులు, ఇతర స్థానిక నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించింది.

అక్కడ హిజాబ్, కాషాయ కండువాలు రెండింటిపై నిషేధం విధించారు.

అయితే, అమ్మాయిలు యూనిఫాం రంగుకు సరిపోయే దుపట్టా లేదా స్కార్ఫ్‌తో తల కప్పుకోవడానికి అనుమతించారు.

కానీ, ఈ వివాదం క్రమంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా వ్యాపించింది.

మాండ్య జిల్లాలో హిజాబ్ ధరించిన ముస్కాన్ ఖాన్ అనే విద్యార్థిని విషయంలో నినాదాలు, నిరసనలు జరిగాయి. ఆమె మతపరమైన నినాదాలు చేసిన తర్వాత, అనేక ప్రాంతాల్లో నిరసనలు మొదలయ్యాయి. దీనివల్ల కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాల్సి వచ్చింది.

అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హిజాబ్‌పై నిషేధం విధించింది.

దీనిని సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ప్రభుత్వ ఆదేశాలను సమర్థించింది. అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ ఇది ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ విమర్శ

హిజాబ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ నేత ఆర్.అశోక్ స్పందిస్తూ, ''దావణగెరె ఉప ఎన్నికల ఫలితాలు, తన మైనారిటీ ఓటుబ్యాంకులో పెరుగుతున్న అసంతృప్తిని చూసి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం భయాందోళనకు గురైంది'' అని అన్నారు.

''ఓటు బ్యాంకు రాజకీయాలను కాపాడుకోవడానికి, పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే సిద్ధరామయ్య ప్రభుత్వం మరోసారి హిజాబ్ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. పాలనలో విఫలమైనప్పుడు పోలరైజేషన్ రాజకీయాలను ఆశ్రయించడం కాంగ్రెస్ పాత వ్యూహం'' అని అశోక్ విమర్శించారు.

''సిద్ధరామయ్య చెబుతున్న సోకాల్డ్ లౌకికవాదం అసలు రంగు ఇప్పుడు అందరికీ తెలిసింది. ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛ పేరుతో హిజాబ్‌కు పచ్చజెండా ఊపుతారు. కానీ, కాషాయ కండువాలపై మాత్రం వెంటనే నిషేధం విధిస్తారు'' అని ఆయన ఆరోపించారు.

''ఒక మతం తాలూకా గుర్తింపును హక్కుగా పరిగణించి, మరొక మతం గుర్తింపును నిబంధనల ఉల్లంఘనగా భావించే ఈ వివక్షాపూరిత విధానం దేనిని రుజువు చేస్తోందంటే.. కాంగ్రెస్‌కు సెక్యులరిజం అనేది కేవలం హిందువులను లక్ష్యం చేసుకోవడానికి, మైనారిటీల బుజ్జగింపునకు ఒక సాధనం మాత్రమే'' అని అశోక్ విమర్శించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)