జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే ఒంట్లో వేడి తగ్గుతుందా? కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డాక్టర్లు ఏమంటున్నారు?

    • రచయిత, పారా పద్దయ్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

"జేబులో ఓ ఉల్లిపాయ పెట్టుకోండి. మీకు ఏమీ కాదు. నేను నా కారులో ఏసీ వాడను. ఏసీ ఉన్న వాతావరణంలో కూర్చోను. మే, జూన్‌‌లలో 51 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలున్నా ఇలాగే ఉంటాను. ఎవరైనా అడిగితే ఇది చంబల్ చర్మం అని చెబుతాను" అని కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో ఆయన 3 రోజులు పర్యటించారు.

తన లోక్‌సభ నియోజవర్గమైన గుణలో ఉన్న పిచ్చోర్‌ పట్టణంలో ఏప్రిల్ 26న తహసీల్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఏప్రిల్ 26న పిచ్చోర్‌లో 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది.

ఆ రోజున ఆ ప్రాంతంలో తీవ్రమైన వేడి, వడగాల్పులు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

వేసవి ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి ఏమీ కాకుండా ఉండేందుకు ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం ఉత్తమం అని, ఇవన్నీ పాత రోజుల్లో ఉపాయాలని జ్యోతిరాదిత్య సింథియా చెప్పారు.

"నేను కుర్రాడిలా కనిపిస్తూ ఉండవచ్చు. కానీ నా మనసు పెద్దవాళ్లలా ఆలోచిస్తుంది. ఇప్పుడు అందరూ డబ్బాలు పట్టుకుని వెళుతున్నారు. కానీ, సమాచార శాఖ మంత్రి ఉల్లిగడ్డ తీసుకెళుతున్నారు. ఇవన్నీ పాత విషయాలు. ఆయుర్వేదం అభివృద్ధి చెందుతోంది. మనం వీటిని మర్చిపోకూడదు" అని ఆ సభలో చెప్పారు.

జ్యోతిరాదిత్య సింధియా ఉల్లిపాయను జేబులో నుంచి బయటకు తీసి చూపిస్తున్న సమయంలో సభికుల్లో ఉన్న ఓ వ్యక్తి తన జేబులో నుంచి ఉల్లిపాయ తీసి జ్యోతిరాదిత్యకు చూపించారు.

దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.

అందులో "ఆధునిక యుగంలో అందరూ డబ్బాలు పట్టుకుని తిరుగుతున్నారు. సమాచార మంత్రి మాత్రం..." అని రాశారు.

ఈ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

జ్యోతిరాదిత్య సింధియా మంత్రివర్గ సమావేశాల్లో పాల్గొన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, అందులో ఏసీలు ఉన్నట్లుగా కనిపిస్తున్న ఫోటోలను పోస్ట్ చేసి "ఆయన ఉల్లిపాయలతో వేడిని ఎదుర్కొంటున్నారు" అని రాస్తున్నారు.

"నేను మీకు 5 నుంచి 10 కేజీల ఉల్లిపాయలు పంపిస్తాను. మీ దగ్గరనున్న ఏసీ మా ఇంటికి పంపించండి" అని కుందన్ సింగ్ అనే యూజర్ రాశారు.

"మా ఇంట్లో 2 కేజీల ఉల్లిగడ్డలున్నాయి. 45 డిగ్రీల వేడిలోనూ నాకు జమ్ముకశ్మీర్‌లో ఉన్నట్లు ఉంది" అని శైలేంద్ర సింగ్ అనే యూజర్ పోస్ట్ చేశారు.

డాక్టర్లు ఏమంటున్నారు?

ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా నమోదవుతున్నట్లు ఐఎండీ తెలిపింది.

జేబులో ఉల్లిపాయ పెట్టుకోవడం వల్ల వేసవి తాపం నుంచి తప్పించుకోలేరని, పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

"జేబులో ఉల్లిగడ్డకి ఎండకీ ఏం సంబంధం లేదు. ఎండ శరీరాన్ని అన్ని వైపుల నుంచి తాకుతుంది. ఎండ తీవ్రత పెరిగే కొద్దీ శరీరంలో నీరు ఆవిరైపోతుంది. దాన్ని భర్తీ చేసేందుకు నీరు తాగుతూ ఉండాలి. నీరు తాగకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడటంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు" అని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రమణయ్య ‘బీబీసీ’తో చెప్పారు.

యునానీ, హోమియోపతీ వైద్యులు కూడా ‘జేబులో ఉల్లిపాయ ఉంటే ఎండ ప్రభావం శరీరంపై ఉండదు’ అనే వాదన సరికాదన్నారు.

"గ్రామీణ ప్రాంతాలలో ఇలాంటి నమ్మకాలు చాలా ఉన్నాయి. జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే ఎండలో ఏమీ కాదనడానికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారం లేదు. వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా, వేసవి వేడి వల్ల సమస్యలకు దూరంగా ఉండాలన్నా డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించాలి" అని హోమియోపతి డాక్టర్ షగుఫ్తా బీబీసీతో చెప్పారు.

"ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. అయితే అది కూరల్లో మాత్రమే పనికొస్తుంది. ఎండలకు కాదు. వేసవిలో ఎండ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ముఖ్యంగా శరీరం డీ హైడ్రేట్ కాకుండా నీళ్లు ఎక్కువగా తాగాలి" అని ఆమె అన్నారు.

యునానీ వైద్యురాలు తస్నీమ్ ‘బీబీసీ’తో మాట్లాడుతూ... చలి సంబంధిత, తేమ సంబంధిత కారణాలతో వచ్చే దగ్గు, జలుబు వంటి వాటికి చికిత్స చేయడానికి యునానీ విధానంలో ఉల్లిపాయ ప్రాధాన్యం ఉంది. కఫంతో కూడిన దగ్గుకు ఔషధంగా వాడుతారు. అంతేకానీ ఉల్లిపాయను జేబులో పెట్టుకోవడం వల్ల వేడి తగ్గుతుందనడం అపోహ’ అన్నారు.

హీట్ వేవ్ అంటే ఏమిటి?

ఏదైనా ఒక ప్రాంతంలో, స్థానిక వాతావరణ శాఖ అంచనా వేసిన ఉష్ణోగ్రతల కంటే ఉష్ణోగ్రత పెరిగి నిర్దిష్టంగా కొన్ని రోజుల పాటు కొనసాగితే, దానిని హీట్ వేవ్‌గా పరిగణిస్తారు.

భారత వాతావరణ శాఖ ప్రకారం.. హీట్ వేవ్‌ అంటే సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉండాలి. ఇలాంటి పరిస్థితి సాధారణంగా ఐదు రోజులు ఉంటుంది.

హీట్ వేవ్ మనుషులతో పాటు అనేక ప్రాణులను ప్రభావితం చేస్తుంది. హీట్ వేవ్ కారణంగా డీహైడ్రేషన్, అలసట, బలహీనత, కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతులు, కడుపు నొప్పి వంటివాటికి గురయ్యే ప్రమాదం ఉంటుంది.

విపరీతమైన ఉష్ణోగ్రతల కారణంగా గుండెజబ్బులున్న వారు స్ట్రోక్ లేదా గుండెపోటుకు గురయ్యే ప్రమాదముంది.

వడదెబ్బ తగిలితే వెంటనే ఏం చెయ్యాలి?

పగటి ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నప్పుడు వడదెబ్బ తగిలితే తక్షణమే చేరువలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం అత్యంత ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు..

వడదెబ్బ తగిలినవారికి చల్లని నీటితో తుడవాలని, నీడలో, గాలి తగిలే ప్రదేశంలో ఉంచాలని సూచిస్తున్నారు.

వడదెబ్బ తగిలినవారిని వెంటనే వైద్యుడి వద్దకు తీసుకెళ్లాలని డాక్టర్ రమణయ్య చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)