You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఖతార్ గ్యాస్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. మృతుల్లో 12 మంది భారతీయులు
ఖతార్‌లోని రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో మృతి చెందిన 13 మందిలో 12 మంది భారతీయులని అధికారులు సోమవారం తెలిపారు.
"రాస్ లాఫాన్‌లో ఆదివారం రాత్రి జరిగిన పేలుడు ఘటనలో దురదృష్టవశాత్తూ 12 మంది భారతీయులు మరణించినట్లు ఖతార్ అధికారులు ధృవీకరించారు"అని దోహాలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో తెలిపింది.
గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, వారికి తగిన వైద్యం అందుతున్నట్లు ఖతార్ అధికారులు తెలిపినట్టు రాయబార కార్యాలయం పేర్కొంది.
ఖతార్‌లో 8 లక్షలకు పైగా భారతీయ కార్మికులు నివసిస్తున్నారు. వీరు ప్రతీ ఏటా 1.3 నుంచి 1.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్లు) భారత్‌కు పంపిస్తున్నారు.
"ఈ ఘటన వల్ల ప్రభావితమైన భారతీయులు, వారి కుటుంబాలకు అన్ని విధాలుగా సాయమందించేందుకు ఖతార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల తరలింపు చర్యలు కూడా ముమ్మరం చేస్తున్నాం" అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
అంతకుముందు సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ బిన్ షరీదా అల్ కాబీ ఈ ఘటనలో భారత్, పాకిస్తాన్‌కు చెందిన 13 మంది మరణించినట్లు ధృవీకరించారు.
ఆదివారం రాత్రి రాస్ లాఫాన్‌లోని ప్రధాన ఎల్‌ఎన్‌జీ(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ప్లాంట్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం జరిగినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పేలుడు వల్ల చెలరేగిన మంటలతో నగరంలో ఆకాశం ఎర్రని రంగులోకి మారిపోయింది.
ఈ పేలుడు దేశ ఎగుమతులపై ఎలాంటి ప్రభావం చూపదని ఖతార్ ఇంధన శాఖా మంత్రి సాద్ షరీదా అల్ కాబీ చెప్పారు. "ఇది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. విధ్వంసక చర్య లేదా కుట్రపూరిత ఘటన కాదు" అని ఆయన పేర్కొన్నారు.
రాస్ లాఫాన్ పోర్టు, ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ నౌకాశ్రయం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఎగుమతి కేంద్రం కూడా అక్కడే ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ఈ ప్రాంతాన్ని ఇరాన్ క్షిపణి దాడులు లక్ష్యంగా చేసుకున్నాయి.
ఆదివారం జరిగిన పేలుడు ప్రభావంతో పరిసర ప్రాంతాల్లో కిటికీలు కంపించాయి. రాస్ లాఫాన్‌కు 70 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న సెంట్రల్ దోహా ప్రాంతంలో కూడా ప్రకంపనలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
గ్యాస్ ప్లాంట్‌లో జరిగిన ఈ పేలుడుకు కారణాలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సాద్ షరీదా అల్ కాబీ తెలిపారు. ఈ ఘటన వల్ల ఎలాంటి పర్యావరణ ముప్పు లేదని ఆయన అన్నారు.
విదేశాంగ మంత్రి జైశంకర్ ఏమన్నారు?
ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"ఖతార్‌లోని రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన పేలుడులో భారతీయ పౌరులు, ఇతరులు మరణించడం చాలా బాధాకరం" అని జైశంకర్ ఎక్స్‌లో రాశారు.
"ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మన రాయబార కార్యాలయం ఖతార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషాద ఘటన వల్ల ప్రభావితమైన భారతీయుల కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందించేందుకు ప్రయత్నిస్తోంది. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.
ఖతార్‌లో జరిగిన ఈ ప్రమాదంపై తుర్కీయే విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా సంతాపం వ్యక్తం చేసింది.
"ఈ క్లిష్ట సమయంలో దోహాలోని భారత రాయబార కార్యాలయం, ఖతార్‌లోని భారతీయ సమాజానికి, ఖతార్ ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజలకు సానుభూతి తెలుపుతున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని, గల్లంతైన వారు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం" అని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
సాంకేతిక లోపం కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, వివిధ దేశాలకు చెందిన 66 మంది గాయపడినట్లు ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో తెలిపింది.
భద్రతా సంస్థలు, అత్యవసర బృందాలు స్పందించి రాస్ లాఫాన్ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాయని, ఘటనా స్థలంలో అవసరమైన సేవలు అందించాయని పేర్కొంది.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించగా, ఘటనా స్థలంలో గాలింపు, రక్షణ చర్యలు పూర్తయ్యాయి.
ప్రమాదానికి దారితీసిన సాంకేతిక కారణాలు, ఘటనకు సంబంధించి అన్న కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
ప్రమాదానంతరం ఎలాంటి గ్యాస్ లీకేజీని గుర్తించలేదని, ప్రజల భద్రతకు, చుట్టు పక్కల వాతావరణానికి ఎలాంటి ముప్పు లేదని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)