బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్నామ్, మొదటి ప్రసంగంలో ఏమన్నారంటే..

ఫొటో సోర్స్, Reuters
ఆండీ బర్నామ్ బ్రిటన్ 59వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జరిగిన ప్రైవేట్ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను కింగ్ చార్లెస్ ఆహ్వానించారు.
ఆండీ బర్నామ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది.
ఆ ప్రకటనలో "పార్లమెంట్ సభ్యులు బర్నామ్‌తో కింగ్ సమావేశమయ్యారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనను కోరారు. కింగ్ ప్రతిపాదనను బర్నామ్ అంగీకరించారు. ప్రధాన మంత్రిగా, ట్రెజరీ ఫస్ట్ లార్డ్‌గా నియమితులవుతూ కింగ్ చేతులను ముద్దుపెట్టుకుని (కిస్డ్ హ్యాండ్స్) బాధ్యతలు స్వీకరించారు" అని తెలిపారు.
"మేరీ - ఫ్రాన్స్ వాన్ హీల్ కూడా కింగ్‌ను కలిశారు" అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


ఫొటో సోర్స్, PA
కొత్త సంకల్పాన్ని తీసుకోవాల్సిన సమయం
ప్రధానిగా తన నియామకం "ఆలోచించాల్సిన, కొత్త సంకల్పాన్ని తీసుకోవాల్సిన సమయం" అని బర్నామ్ చెప్పారు.
తమ తరానికి చెందిన రాజకీయ నాయకులు మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని, ముందున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలన్నారు.
"మనం మళ్లీ స్థిరత్వాన్ని సాధించగలమని బ్రిటన్ నిరూపించాల్సి ఉంది. ఇదే మన ముందున్న సవాల్" అని ప్రధాని బర్నామ్ అన్నారు. దేశ ప్రజలు రాజకీయాలపై విసిగిపోయారని తనకు తెలుసన్నారు.
"మీ మనోభావాలు నాకు అర్థమయ్యాయి. మేం ఇంతవరకు ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. ఇప్పుడు మరింత మెరుగ్గా మారాల్సిన అవసరం ఉంది, కచ్చితంగా మారతాం" అన్నారు.
బ్రిటన్‌లో కొత్త రాజకీయ నమూనా రాబోతుందని బర్నామ్ చెప్పారు.
1980ల నాటి ప్రైవేటీకరణ, డీ-ఇండస్ట్రియలైజేషన్ వంటి వాటిని ఆయన తప్పుడు నిర్ణయాలుగా అభివర్ణించారు. ఆ ప్రభావం నుంచి అనేక ప్రాంతాలు ఇప్పటికీ కోలుకోలేదని, పాయింట్లు స్కోర్ చేసే రాజకీయాల కంటే సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసి పనిచేసేలా రాజకీయాలను మారుస్తానని కొత్త ప్రధాని చెప్పారు.

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్ కోసం 10 ఏళ్ల ప్రణాళిక
పాలనా అధికారాన్ని వెస్ట్‌మిన్‌స్టర్ నుంచి దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రతి ఊరికీ చేరవేస్తానని, తద్వారా వారు మరింత మెరుగ్గా పనిచేయగలుగుతారని బర్నామ్ చెప్పారు.
ప్రజలకు నిత్యావసరాలను మళ్లీ అందుబాటు ధరల్లోకి తీసుకురావడానికి, వాటిని ప్రభుత్వ నియంత్రణలోకి తెస్తూ ఒక కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు. బ్రిటన్‌ను తిరిగి పారిశ్రామికీకరిస్తానని, బ్రిటిష్ పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
ఈ ఏడాది చివర్లో బ్రిటన్ కోసం 10 ఏళ్ల ప్రణాళికను రూపొందిస్తానని, దేశాన్ని ఎటువైపు తీసుకెళ్లాలనుకుంటున్నానో ఆ మార్గాన్ని వివరిస్తానని బర్నామ్ చెప్పారు.
పెరుగుతున్న జీవన వ్యయం నుంచి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేలా రేపటి నుంచే ప్రణాళికలను ప్రకటిస్తానని కొత్త ప్రధాని తెలిపారు. వాటి కోసం నిధులు ఎలా సమకూరుస్తామనేది కూడా వివరిస్తానన్నారు.
విద్యారంగంలో మార్పులు తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది యువతకు ఉపాధి లభించేలా సహాయం చేస్తామని, మానసిక ఆరోగ్య రక్షణతో సహా మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రధాని చెప్పారు.
ప్రజలు మెరుగైన జీవితం గడపడానికి సహాయం చేయడం గురించి ప్రస్తావిస్తూ... "దేశంలో నిరాశ్రయుల సమస్యను అంతం చేయడానికి నా మొదటి ఆదేశాన్ని జారీ చేస్తాను" అని చెప్పారు.
ప్రభుత్వంలో ఉత్తమ విలువలు, ఉత్తమ ప్రమాణాలను నెలకొల్పడంపైనే తన దృష్టి ఉంటుందని బర్నామ్ స్పష్టం చేశారు.
ప్రధాని ప్రసంగం ముగియగానే అక్కడ గుమిగూడిన ప్రజలు చప్పట్లతో అభినందించారు. అనంతరం ఆయన తన భార్యను ముద్దుపెట్టుకుని, కెమెరాల వైపు చేతులు ఊపి, ప్రధాని అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ తలుపుల గుండా లోపలికి వెళ్లారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
































