You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కవల పిల్లలకు వేరు వేరు తండ్రులు.. ఇదెలా సాధ్యమైంది? ఈ కేసు గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- రచయిత, శాంటియాగో వనెగాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 5 నిమిషాలు
కొలంబియాలోని పాపులేషన్ జెనెటిక్స్ అండ్ ఐడెంటిఫికేషన్ లేబొరేటరీకి 2018లో ఓ మహిళ వచ్చి ఓ విజ్ఞప్తి చేశారు.
రెండేళ్ల క్రితం ఆమెకు కవల పిల్లలు పుట్టారు. వారి తండ్రి ఎవరో తెలపాలని ఆమె కోరారు.
దీంతో ల్యాబ్ మామూలుగా చేసే పరీక్షలు చేశారు. వాటిని మళ్లీ మళ్లీ చేశారు. కానీ పరీక్షా ఫలితాలు వాళ్లను ఆశ్చర్యపరిచాయి.
ఆ కవలలకు తల్లి ఒకరే కానీ తండ్రులే వేర్వేరు.
ఇది హెటిరో పేటర్నల్ సూపర్‌ఫెక్యుండేషన్ అని పిలిచే అత్యంత అరుదైన పరిస్థితి.
ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి కేసులు ఇప్పటి వరకు 20 మాత్రమే నమోదైనట్లు సైంటిఫిక్ ఆర్టికల్స్ చెబుతున్నాయి.
ఇలాంటివి జరగడం సాధ్యమేనని వాళ్లకు తెలిసినప్పటికీ నేషనల్ యూనివర్సిటీలోని నిపుణులు ఇలాంటి కేసును చూడటం ఇదే మొదటిసారి.
ఈ కేసు వారిలో ఆసక్తిని రేకెత్తించింది.
వాళ్లకు ఎలా తెలిసింది?
ఎవరైనా ఒక వ్యక్తికి తండ్రి ఎవరో నిర్థరించేందుకు ది పాపులేషన్ జెనెటిక్స్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా శాస్త్రవేత్తలు "మైక్రోశాటిలైట్ మార్కర్స్" అనే టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ఇందులో భాగంగా పిల్లలకు చెందిన డీఎన్ఏలో అతి చిన్న భాగాలను తల్లి, ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి డీఎన్ఏలతో పోలుస్తారు.
"మేము ప్రతీ డీఎన్ఏ తీసుకుంటాం. అందులో 15 నుంచి 22 పాయింట్లను పరిశీలిస్తాం. వాటినే మైక్రోశాటిలైట్స్ అని పిలుస్తాం. వాటిని ఒకదానితో ఒకటి వరుసగా పోలుస్తాం" అని ల్యాబొరేటరీ డైరక్టర్ ప్రొఫెసర్ విలియమ్ ఉసాక్వెన్ బీబీసీతో చెప్పారు.
అయితే ఈ ప్రక్రియ డీఎన్ఏను శక్తిమంతమైన మైక్రోస్కోప్ కింద పెట్టి పరిశీలించినంత తేలికకకాదు.
శాంపిల్ తీసుకున్న తర్వాత రక్తంనుంచి డీఎన్ఏను వేరు చేసేందుకు శాస్త్రవేత్తలు రసాయన ప్రక్రియ నిర్వహిస్తారు. దీని ద్వారా డీఎన్ఏను, మిగతా వాటిని వేరు చేస్తారు.
ఆ తర్వాత చాలా చాలా చిన్నగా ఉండే డీఎన్ఏను పెద్దది చేసేందుకు ప్రత్యేక పరికరాల్లోకి పంపిస్తారు.
ఆ పరికరాల్లో నుంచి వచ్చిన ద్రవంలో 15 నుంచి 22 పాయింట్లను (మైక్రోశాటిలైట్లు)గుర్తించేందుకు కాంతిని వెదజల్లే మూలకాలతో కలుపుతారు.
ఆ తర్వాత, ప్రతి నమూనాలోని మైక్రోశాటిలైట్లను చదివి వాటిని సంఖ్యా క్రమంగా మార్చగల సామర్థ్యం ఉన్న మరో యంత్రం గుండా పంపిస్తారు. ఈ ప్రక్రియను ఎలక్ట్రోఫోరెసిస్ అంటారు.
ఇందులో వచ్చిన సంఖ్యా క్రమాన్ని బట్టి బిడ్డకు తండ్రి ఎవరనే దానిని మరో డీఎన్ఏతో పోల్చి విశ్లేషిస్తారు.
బిడ్డ జన్యు క్రమంలో సగం తల్లితో మిగిలిన సగం ఆరోపిత తండ్రితో సరిపోలినప్పుడు వారే తల్లిదండ్రులని నిర్ధరిస్తారు.
అసాధారణ ఫలితం
కవలలకు సంబంధించి 2018లో వేర్వేరు తండ్రులను గుర్తించిన కేసులో శాస్త్రవేత్తలు తల్లి డీఎన్ఏలో 17 మైక్రోశాటిలైట్లు విశ్లేషించారు. వాటిని ఇద్దరు పిల్లలు ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రి డీఎన్ఏతో పోల్చి చూశారు.
ఆరోపిత తండ్రి డీఎన్ఏ ఒక పిల్లవాడితో సరిపోయింది. మరో పిల్లాడితో సరిపోలేదు.
ఏ విధంగా చూసినా ఇది అసాధారణ ఫలితం.
"నేను ఈ ల్యాబ్‌కు 26 ఏళ్ల నుంచి డైరెక్టర్‌గా ఉన్నాను. ఇలాంటి కేసు చూడటం ఇదే మొదటిసారి. ఇప్పటి వరకు ఇలాంటి కేసు ఇదొక్కటే" అని విలియం యుసాక్వెన్ చెప్పారు.
"ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉన్నాయని మేం ఇతర నివేదికల ద్వారా విన్నాం" అని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్‌లో జన్యుశాస్త్ర నిపుణురాలు ఆండ్రియా కాసాస్ అన్నారు.
డీఎన్ఏ పరీక్ష ప్రొటోకాల్ ప్రకారం, ప్రక్రియలో లోపం, లేదా నమూనాలు తారుమారు కావడం లాంటివేవీ జరగలేదని నిర్ధరించుకోవడానికి ఈ పరీక్షను వాళ్లు రెండోసారి చేశారు.
ఫలితాలు మొదటి సారి వచ్చినట్లే వచ్చాయి.
ఇది ఎందుకంత అసాధారణమైనది?
అమెరికాలోని బాల్టిమోర్‌లోని ఒక ప్రయోగశాలకు చెందిన శాస్త్రవేత్తలు 2014లో ఒక వ్యాసం ప్రచురించారు. 39,000 పితృత్వ పరీక్షల సమాచారం ఉన్న ఒక డేటాబేస్‌లో కేవలం మూడు మాత్రమే హెటెరోపాటర్నల్ సూపర్ ఫెక్యుండేషన్ కేసులు (వేర్వేరు తండ్రులతో కవలలు) ఉన్నట్లు అందులో రాశారు.
ఇలాంటివి ఎందుకు జరుగుతాయనే దాని గురించి ప్రొఫెసర్ విలియం ఉసాక్వెన్ బీబీసీకి వివరించారు.
మొదట స్త్రీకి ఇద్దరు లైంగిక భాగస్వాములు ఉండాలి. రెండోది ఆమె తక్కువ వ్యవధిలో ఇద్దరు పురుషులతో సంభోగంలో పాల్గొనాలి. ఆ సమయానికి పాలిఓవ్యులేషన్ (ఒకే రుతుచక్రంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ అండాలు విడుదల కావాలి) జరగాలి. చివరగా ఆమె రెండుసార్లు గర్భవతి కావాలి.
"ఒకదాని తర్వాత ఒకటిగా వింత సంఘటనలు, ఆపై మరో వింత సంఘటన, ఆపై ఇంకో వింత సంఘటన. అంటే వరుసగా టిక్కెట్లు కొన్నప్పుడల్లా లాటరీ తగులుతూనే ఉండాలన్నమాట" అని ఉసాక్వెన్ చమత్కరించారు.
అయితే ఇక్కడ ఆయన ఒక విషయం స్పష్టం చేశారు.
వేర్వేరు తండ్రులకు పుట్టిన కవలలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏక రూప కవలలు కాలేరు. ఎందుకంటే ఏకరూప కవలలు ఒకే అండం, శుక్రకణం నుంచి అభివృద్ధి చెందుతారు.
వ్యక్తుల గోప్యత
సాధారణంగా ఒక స్త్రీ ఒకటి కంటే ఎక్కువ అండాలను విడుదల చేసిన సందర్భాలలో వాటిలో ఒకటి మాత్రమే ఫలదీకరణ చెంది, మిగిలినవి నశించిపోతాయి.
అందుకే సూపర్ పెక్యుండేషన్ కూడా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే ఫలదీకరణ చెందని అండం నశించక ముందే రెండో ఫలదీకరణ జరుగుతుంది.
రెండు ఫలదీకరణలు 24 నుండి 36 గంటల వ్యవధిలో జరగాలి. అండాలు విడుదలైన తర్వాత 36 గంటలు మాత్రమే జీవశక్తితో ఉంటాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్లోని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అయితే "అండాలు తప్పనిసరిగా ఒకే సమయంలో విడుదల కాకపోవచ్చు" అని ఆండ్రియా కాసాస్ వివరించారు.
"కొన్నిసార్లు ఒక ఫెలోపియన్ ట్యూబ్ ఒక అండాన్ని విడుదల చేసి, రెండు లేదా మూడు రోజుల తర్వాత మరొక అండాన్ని విడుదల చేస్తుంది. దీనివల్ల రెండు వేర్వేరు సమయాల్లో ఫలదీకరణం జరిగే అవకాశం పెరుగుతుందని ఆమె చెప్పారు.
అయితే, వేర్వేరు తండ్రులు ఉన్న కవలల కేసులు చాలా తక్కువగా తెలియడానికి మరో కారణం అత్యధిక శాతం ప్రజలు పితృత్వ పరీక్ష చేయించుకోకపోవడమే.
"ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాలిక్యులర్ పద్ధతులు, పితృత్వ పరీక్షల ప్రజాదరణ పెరగడం వల్ల భవిష్యత్‌లో ఇది అంత గొప్ప విషయంగా ఉండకపోవచ్చని" ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ శాస్త్రవేత్తలు తమ వ్యాసంలో పేర్కొన్నారు.
హెటిరోపేటర్నల్ సూపర్ ఫెక్యుండేషన్ ఏ పరిస్థితులలో జరిగిందో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలకు జీవశాస్త్రపరమైన ఆసక్తి ఉన్నప్పటికీ పరీక్షకు వచ్చే వ్యక్తుల వ్యక్తిగత జీవితాల గురించి అడగకూడదన్న నియమావళి కారణంగా వారు ముందుకు వెళ్లలేకపోతున్నారు.
‘‘తల్లిదండ్రులు ఎవరో నిర్థరించే పరీక్షలు చేసేటప్పుడు వ్యక్తుల సమగ్రత, వ్యక్తిగత గోప్యత కాపాడటం అనేది ప్రధాన అంశం" అని ఉసాక్వెన్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)