పసిఫిక్ మహాసముద్రంలో మునిగిన పడవ, ఐస్ బాక్సులో కూర్చుని 5 రోజుల పాటు సముద్రంలో గడిపిన ఆ ఇద్దరినీ ఎలా రక్షించారంటే...

ఫొటో సోర్స్, Mexican Navy
మెక్సికోలో ఐదు రోజుల పాటు సముద్రం మధ్యన ఒక కూలర్ బాక్సు (ఐస్‌గడ్డలు కరిగిపోకుండా ఉంచే పెట్టెలు)లో కూర్చుని గడిపిన ఇద్దరు మత్స్యకారులను రక్షించారు.
గత బుధవారం (ఆగస్టు 19) మెక్సికన్ నౌకాదళం రక్షించే వరకు వాళ్లు ఆ బాక్సులో కూర్చుని నీటిపై తేలుతూ గడిపారు.
బాక్సులో తమ దగ్గరున్న సంచిని ఊపి తమను వెతుకుతున్న విమానంలోని సిబ్బంది దృష్టిలో పడగలిగామని ఆ మత్స్యకారులు తెలిపారు.
నౌకాదళం విడుదల చేసిన వీడియోలలో, ఆ ఇద్దరు మత్స్యకారులు తాము కొన్ని రోజుల పాటు సముద్రంలో తేలియాడటానికి సహాయపడిన నీలం రంగు కూలర్ బాక్సులో నిలబడి కనిపించారు.
మెక్సికో నైరుతి తీరంలోని చియాపాస్ ప్రావిన్స్‌లోని టోనాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల డేనియల్ గెర్రెరో మార్టినెజ్, 32 ఏళ్ల జోస్ లూయిస్ బోర్డెలాస్ల కథ.

నౌకదళం రక్షించిన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. ''నేను నా కుటుంబాన్ని మళ్లీ చూస్తానని అనుకోలేదు" అని మార్టినెజ్ అన్నారు.
ఐదు రోజులుగా ఆహారం లేకపోవడంతో డీహైడ్రేషన్‌కు గురైన ఈ మత్స్యకారులు ఇప్పుడు తమ ఇళ్లకు వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు.
సముద్రంలో తప్పిపోయిన వీరిద్దరినీ రక్షించడానికి నౌకాదళం 'ట్రైనోమియల్' అనే ఆపరేషన్‌ను నిర్వహించింది. ఇందులో ఒక గస్తీ నౌక, ఒక ఇంటర్ సెప్టర్ వెస్సెల్, ఒక విమానం పాల్గొన్నాయి.

ఫొటో సోర్స్, Armada de México
పసిఫిక్ మహాసముద్రంలో కొట్టుకుపోతూ...
మెక్సికో పసిఫిక్ తీరంలో ఉన్న ఒక మత్స్యకారుల గ్రామమే పరేడాన్. ఇది సముద్రానికి, ఆ ప్రాంతంలోని సరస్సులకు మధ్య ఉంది. ఈ ప్రాంత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా సంప్రదాయంగా వస్తున్న చేపల వేటపై ఆధారపడి ఉంది.
ఇక్కడ రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర జీవులను పట్టుకుని స్థానికులు జీవనోపాధి పొందుతుంటారు. చేపల కోసం వెళ్లిన మత్స్యకారులు అనేక రోజులపాటు సముద్రంలో గడుపుతారు.
డేనియల్, జోస్‌లు చేపల వేట కోసం ఆగష్టు 14న సముద్రం మీదకు వెళ్లారు. వాళ్లు చివరిసారిగా ఆగష్టు 15న భూమి మీద ఉన్న వారితో మాట్లాడారు.
తర్వాత వారితో కాంటాక్ట్ తెగిపోవడంతో వారి ఆచూకీ కనుగొనడంలో సహాయం చేయాలని కుటుంబ సభ్యులు, తోటి జాలర్లు, స్థానిక మత్స్య సహకార సంఘాలు నౌకాదళాన్ని అభ్యర్థించాయి.
స్థానిక మీడియా నివేదికల ప్రకారం, ‘‘తెల్లవారుజామున ఒక భారీ అల వారి పడవను ఢీకొట్టి దానిని తలక్రిందులు చేసింది. అల తాకినప్పుడు, వారు తమ వస్తువులను కాపాడుకోవడానికి ప్రయత్నించారు. కానీ కొన్ని క్షణాల్లోనే వారు సముద్రం మధ్యలో చిక్కుకు పోయారు. వారి చేతికి దొరికింది ఒక కూలర్ బాక్స్, కొన్ని పెట్రోలు డబ్బాలు మాత్రమే’’
పట్టుకున్న చేపలు పాడైపోకుండా దాచేందుకు వాడే ఐస్‌బాక్స్ వారి ప్రాణాలను కాపాడింది. దాన్ని వాళ్లు ఒక పడవలాగా ఉపయోగించుకోగలిగారు.

ఫొటో సోర్స్, Armada de México
'అన్నం, నీరు లేకుండా 5 రోజులు'
ఆ ఐదు రోజులు తమకు తాగడానికి నీరు గానీ, ఆహారం గానీ లేదని జాలర్లు చెప్పారు. రోజంతా ఎండలో గడిపారు. వర్షం కూడా లేదు. దీంతో తాగడానికి నీరు కూడా సేకరించలేకపోయామని వారు అన్నారు.
తీరానికి 240 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉండగా వీరి పడవ ప్రమాదానికి గురైంది. సమీపంలో ఎక్కడ భూమి జాడ లేకపోవడంతో వారిని కనుక్కోవడం చాలా కష్టంగా మారింది.
రెస్క్యూ ఆపరేషన్ జరిగినట్లు మెక్సికన్ అధికారులు ధృవీకరించారు. కానీ పడవ మునిగిపోవడంపై వారు ఇంకా ఎలాంటి నివేదికను విడుదల చేయలేదు.
కుటుంబాలను తిరిగి కలిసిన తర్వాత స్థానిక మీడియాతో క్లుప్తంగా మాట్లాడటం మినహా, డేనియల్, జోస్ సముద్రంలో జరిగిన ప్రమాదం గురించి ఎలాంటి ఇతర సమాచారం ఇవ్వలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























