ఒపెక్ నుంచి యూఏఈ తప్పుకోవడం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

ఒపెక్ దేశాలు, గల్ఫ్, చమురు, భారత్, యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, శుభాంగి మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌ - అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. మే 1న ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ (ఒపెక్) నుంచి వైదొలుగుతున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మంగళవారం ప్రకటించింది.

ఒపెక్ అనేది 12 ప్రధాన చమురు ఉత్పత్తి దేశాల కూటమి (కార్టెల్). ప్రతి సభ్య దేశానికి కేటాయించే కోటాల ద్వారా ఇవి ఎంత మొత్తంలో చమురును ఉత్పత్తి చేయాలో ఒపెక్ నిర్దేశిస్తుంది.

ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడమంటే, చమురు ఉత్పత్తిలో కూటమి నిర్దేశించే పరిమితికి ఇకపై ఇది కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని అర్థం.

2016లో ఏర్పాటైన ఒపెక్ ప్లస్ కూటమి నుంచి కూడా వైదొలుగుతున్నట్లు యూఏఈ ప్రకటించింది.

ఒపెక్ ప్లస్ కూటమిలో అన్ని ఒపెక్ సభ్య దేశాలు, అదనంగా మరో 10 దేశాలు ఉన్నాయి.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో యూఏఈ ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో.. ''జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. అరేబియా గల్ఫ్, హార్ముజ్ జలసంధిలో నెలకొన్న అంతరాయాలతో భౌగోళిక రాజకీయ ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ మార్కెట్ అవసరాలను తీర్చాలనే ప్రభుత్వ నిబద్ధతకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నాం'' అని తెలిపింది.

'' ఈ నిర్ణయం యూఏఈ దీర్ఘకాలిక వ్యూహానికి, ఆర్థిక దృక్పథానికి అనుగుణంగా ఉంది. దేశీయ ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడులను వేగవంతం చేయడంతో పాటు దాని ఇంధన రంగ అభివృద్ధిని ప్రతిబింబిస్తుంది. ప్రపంచ ఇంధన మార్కెట్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఒక బాధ్యతాయుతమైన, నమ్మకమైన ఉత్పత్తిదారుగా తన పాత్రకు కట్టుబడి ఉండటాన్ని కూడా ఇది బలపరుస్తుంది" అని ఆ ప్రకటనలో పేర్కొంది.

అమెరికా - ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ చమురు వాణిజ్యానికి అంతరాయం కలిగిస్తున్న తరుణంలో యూఏఈ ఈ కూటమి నుంచి వైదొలిగింది. ఒపెక్‌కు అనధికారిక లీడర్‌గా ఉన్న సౌదీ అరేబియాకు, యూఏఈకి మధ్య పెరుగుతోన్న విభేదాల నడుమ ఈ నిర్ణయం తీసుకుంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌పై ఎంత ప్రభావం?

ఇంధన అవసరాలు అధికంగా ఉన్న భారత్ లాంటి దేశాలకు.. ''ఈ కూటమి నుంచి యూఏఈ వైదొలగడం శుభవార్త కావచ్చు. కానీ, అది ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది'' అని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో స్ట్రాటజిక్ స్టడీస్ ప్రోగ్రామ్ డిప్యూటీ డైరెక్టర్ వివేక్ మిశ్రా అంటున్నారు.

''యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది భారత్‌కు బలమైన భాగస్వామి. ఇది తన ముడి చమురు ఉత్పత్తిని రోజుకు 5 - 6 మిలియన్ బ్యారెళ్లకు పెంచుతుందని భావిస్తున్నారు. ఇది మనకు శుభవార్త. ఎందుకంటే, మనం ముడి చమురు వినియోగదారులం, యూఏఈకి వ్యూహాత్మక భాగస్వాములం'' అని ఆయన బీబీసీతో అన్నారు.

ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం భారత్‌పై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

2026 ఫిబ్రవరి నాటికి భారత్ తన ముడి చమురు అవసరాల్లో సుమారు 91 శాతం దిగుమతి చేసుకుంది. ఈ దిగుమతుల్లో 54 శాతం మధ్య ప్రాచ్యం నుంచే వచ్చాయి.

భారత్‌కు భారీగా ముడి చమురు సరఫరా చేసే దేశాల్లో యూఏఈ ఒకటి. భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దీని వాటా 10 శాతం ఉంటుంది.

''భారత వ్యూహాత్మక భాగస్వామి యూఏఈ. సొంతంగా యూఏఈ తన ఉత్పత్తిని పెంచితే, అదనపు చమురును సరఫరా చేయగలదు. ఎందుకంటే, ఇక ఒపెక్ నియమ, నిబంధనలకు ఇది కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు'' అని న్యూదిల్లీలోని మిడిల్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ ఫెలో మీనా సింగ్ రాయ్ తెలిపారు.

ఒపెక్ దేశాలు, గల్ఫ్, చమురు, భారత్, యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని హెచ్‌పీ రిఫైనరీ (ప్రతీకాత్మక చిత్రం)

అమెరికా - ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం ముగుస్తున్నప్పుడు యూఏఈ ముందస్తుగా తీసుకున్న చర్యలలో ఇదొకటి అని ఆమె చెప్పారు.

''ఒకవేళ చమురు డిమాండ్ పెరిగితే, దానిని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశాలను తెరిచి ఉంచాలని యూఏఈ కోరుకుంటోంది. ప్రధానంగా చైనా, జపాన్, కొరియా, భారత్ నుంచి ఈ డిమాండ్ వస్తుంది'' అని తెలిపారు.

హార్ముజ్ జలసంధి మూసి ఉన్నంత కాలం, ఒపెక్ నుంచి యూఏఈ వైదొలిగినా.. తక్షణమే ఎలాంటి ప్రభావం ఉండదని వివేక్ మిశ్రా చెప్పారు.

లక్షల కొద్దీ బ్యారెళ్ల చమురును ఎగుమతి చేసేందుకు మౌలిక సదుపాయాల విషయంలో యూఏఈ ఈస్ట్ కోస్టులో ఉన్న ఫుజైరా పోర్టు ఇంకా సిద్ధంగా లేదని అన్నారు.

హార్ముజ్ జలసంధి అనేది అత్యంత ఇరుకైన సముద్ర మార్గం. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఇది అత్యంత కీలకమైన మార్గం. అరేబియా సముద్రంతో గల్ఫ్‌ను ఇది అనుసంధానిస్తుంది.

సముద్ర మార్గం గుండా జరిగే ప్రపంచ చమురు వాణిజ్యంలో 25 శాతం, ప్రపంచ ఎల్‌ఎన్‌జీ ఎగుమతుల్లో 20 శాతం హార్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. తెహ్రాన్‌పై అమెరికా దాడుల్లో సుప్రీం నేత అయతొల్లా అలి ఖమేనీ మరణించినప్పటి నుంచి, అంటే ఫిబ్రవరి 28 నుంచి ఈ జలసంధి దాదాపుగా మూసి ఉంది.

దీంతో ప్రపంచ చమురు, సహజ వాయువు వాణిజ్యానికి తీవ్ర అంతరాయం నెలకొంది.

ఈ మూసివేతతో భారత ఎల్‌పీజీ, ఎల్ఎన్‌జీ సరఫరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఒపెక్ నుంచి యూఏఈ వైదొలగడం చమురు ధరలు తగ్గేందుకు సాయపడుతుండొచ్చని క్లైమేట్ ట్రెండ్స్ వ్యవస్థాపకురాలు ఆర్తి ఖోస్లా తెలిపారు.

''యూఏఈతో సమగ్ర వాణిజ్య భాగస్వామ్యం ఉన్న భారత్‌కు ఈ నిర్మాణాత్మక మార్పు స్వల్ప నుంచి మధ్యకాలిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. మధ్య కాలంలో స్థిరమైన సరఫరా, ధరలు తగ్గడం వల్ల భారత్ ప్రయోజనం పొందడంతో పాటు, ప్రస్తుతానికి దేశ ఇంధన భద్రతకు కూడా ఉపశమనం కలిగిస్తుంది'' అని తెలిపారు.

ఒపెక్ దేశాలు, గల్ఫ్, చమురు, భారత్, యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆస్ట్రియాలోని వియన్నాలో ఒపెక్ ప్రధాన కార్యాలయం (ఫైల్ ఫోటో)

ఒపెక్, ఒపెక్ ప్లస్ చరిత్ర

ఆస్ట్రియాలోని వియన్నా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోన్న శాశ్వత అంతర్-ప్రభుత్వ సంస్థ ఒపెక్. సభ్య దేశాల పెట్రోలియం విధానాలను ఏకీకృతం చేయడం, పెట్రోల్ మార్కెట్లను స్థిరీకరించాలన్నదే ఒపెక్ ఉద్దేశ్యమని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

పెట్రోల్ ఉత్పత్తి చేసే ఐదు దేశాలు ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, వెనెజ్వెలాలు 1960 సెప్టెంబర్‌లో బాగ్దాద్‌లో దీన్ని ఏర్పాటు చేశాయి. అప్పటి నుంచి 12 దేశాల కూటమిగా ఇది విస్తరించింది. దానిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒకటి.

అమెరికా ఎనర్జీ ఇన్‌ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. ప్రపంచ ముడి చమురు ఉత్పత్తిలో 35 శాతం ఈ దేశాలదే. చమురు ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద దేశం సౌదీ అరేబియా ఈ కూటమికి డీఫ్యాక్టో లీడర్‌గా వ్యవహరిస్తుందని అంటే అనధికారిక నాయకత్వం వహిస్తుందని చెప్పుకోవచ్చు.

సభ్య దేశాలకు కోటాలను కేటాయించడం ద్వారా సరఫరాను పెంచడం లేదా తగ్గించడం ద్వారా చమురు ధరలను దశాబ్దాలుగా ఈ కూటమి నియంత్రిస్తుంది.

ఎక్సాన్, షెల్, మొబిల్, టెక్సాకో, బ్రిటీష్ పెట్రోలియం, స్టాండర్డ్ ఆయిల్ ఆఫ్ కాలిఫోర్నియా, గల్ఫ్ వంటి 'సెవెన్ సిస్టర్స్'గా పిలిచే అత్యంత శక్తివంతమైన పాశ్చాత్య కంపెనీల గ్రూప్ ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్న సమయంలో.. మధ్య ప్రాచ్య దేశాల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ కూటమి ఏర్పడింది.

రష్యా, బహ్రెయిన్‌తో పాటు అదనంగా 10 దేశాలతో ఒపెక్ ప్లస్ కూటమి 2016లో ఏర్పడింది.

యూఏఈ ఒపెక్ నుంచి వైదొలగిన తొలి దేశమేమీ కాదు. ఖతార్, ఇండోనేషియా, ఈక్వెడార్, అంగోలా, గబాన్‌లు అంతకుముందు ఈ కూటమి నుంచి తప్పుకున్నాయి.

ఒపెక్‌లో నాలుగో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు యూఏఈ. 2024 గణాంకాల ప్రకారం, రోజుకు 29.2 లక్షల బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేస్తోంది.

ఒపెక్ నుంచి యూఏఈ వైదొలుగుతున్నట్లు నిర్ణయం తీసుకున్న తర్వాత.. బేస్‌లైన్ ఆయిల్ ప్రొడక్షన్ కోటాల విషయంలో ఎన్నో ఏళ్లుగా ఒపెక్ నాయకత్వానికి, యూఏఈకి మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లు ఆయిల్ అండ్ గ్యాస్ జర్నల్ మంగళవారం రిపోర్ట్ చేసింది.

ఒపెక్ సభ్య దేశంగా తనకు కేటాయించిన కోటాకు మించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు యూఏఈ ఇటీవల ఏళ్లలో పెట్టుబడులు పెట్టింది.

ఈ నిష్క్రమణ... సౌదీ అరేబియా, యూఏఈ మధ్య విచ్ఛిన్నమైన సంబంధాలను తెలియజేస్తుంది. గల్ఫ్ సహకార మండలిలో ఈ రెండు సభ్య దేశాలు. ఆరు అరబ్ దేశాలు ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి.

''గల్ఫ్ సహకార మండలి ఎన్నడూ ఐక్యంగా లేదు. సౌదీ అరేబియా, యూఏఈలు ఈ ప్రాంతంలో రెండు అతిపెద్ద శక్తివంతమైన దేశాలు. వాటి మధ్య సహకారంతో పాటు పోటీ కూడా ఉంటుంది. కానీ, అవి తమ భౌగోళిక స్థానాన్ని మార్చుకోలేవు" అని మీనా సింగ్ రాయ్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)