‘‘మతం మారిన తర్వాత కులం ఆధారంగా రిజర్వేషన్ పొందలేరు’’: సుప్రీంకోర్టు

హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాన్ని స్వీకరించిన వ్యక్తి, గతంలోని సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందలేరని గురువారం సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు లైవ్ లా తెలిపింది.

సారాంశం

  • దిల్లీలో వేల మందిని నిర్బంధించడం సరికాదన్న ఐక్యరాజ్యసమితి స్పందన 'భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని' భారత వ్యాఖ్యానించింది.
  • హైదరాబాద్‌లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ బౌలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
  • జంతర్ మంతర్ వద్ద నిరసనలను చిత్రీకరిస్తున్న తమపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్న జర్నలిస్టులపై పోలీసులు కేసు పెట్టారు.
  • యుక్రెయిన్‌లో డ్రోన్ల పని తీరులో ఆకస్మిక మార్పునకు అమెరికా ప్రభుత్వమే కారణమని ఎలాన్ మస్క్ ఆరోపించారు.

లైవ్ కవరేజీ

  1. ‘‘మతం మారిన తర్వాత కులం ఆధారంగా రిజర్వేషన్ పొందలేరు’’: సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టు, కులం, మతం
    ఫొటో క్యాప్షన్, మతం మారిన తర్వాత రిజర్వేషన్ విషయంలో మద్రాస్ హైకోర్ట్ తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

    ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి అంతకు ముందున్న తన సామాజిక హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి అర్హుడు కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.

    హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాన్ని స్వీకరించిన వ్యక్తి, గతంలోని సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందలేరని గురువారం సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు లైవ్ లా తెలిపింది.

    ఒక వ్యక్తి మతం మారిన తర్వాత గతంలో తన మతంలో ఎదుర్కొన్న సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా, మరో మతంలో నోటిఫైడ్ వెనుకబడిన తరగతిలో ఆ వ్యక్తిని చేర్చలేరని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

    రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందాలంటే సంబంధిత వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి అయిఉండాలని ధర్మాసనం పేర్కొంది. కేవలం మతమార్పిడికి ముందు ఉన్న సామాజిక హోదా ఆధారంగా ఆ వ్యక్తిని కొత్త మతంలో వెనుకబడిన తరగతికి చెందినవారిగా పరిగణించలేమని తెలిపింది.

    1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వును సుప్రీంకోర్టు ప్రస్తావించింది.

    "అందులోని మూడో పేరా ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా వేరే ఏ మతాన్నైనా అనుసరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులాలకు చెందినవారిగా పరిగణించలేం" అని పేర్కొంది.

    మతంమారిన తర్వాత ఒక వ్యక్తి తిరిగి హిందూ మతాన్ని స్వీకరించినప్పటికీ గతంలో తనకున్న వెనుకబడిన తరగతి హోదా, రిజర్వేషన్ ప్రయోజనాలు వాటంతట అవే తిరిగి లభించవని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.

  2. దేశం విడిచి వెళ్లాలని నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు

    జ్ఞానేశ్ కుమార్‌, ఇమ్రాన్ ఖాన్‌
    ఫొటో క్యాప్షన్, జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు

    ఆమిర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌కు ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 28 నాటికి భారత్‌ను విడిచి పెట్టాలని అందులో సూచించింది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించినట్టు ఇమ్రాన్ ఖాన్‌పై ఆరోపణలు ఉన్నాయి.

    అక్టోబర్ 10న ఆగస్టు రివల్యూషన్ గ్రౌండ్స్‌లో జరిగిన నిరసనల్లో ఇమ్రాన్ ఖాన్ పాల్గొన్నారు. ఆందోళనల్లో పాల్గొన్న ఆయన్ని పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు.

    ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడని, నిరసనల్లో పాల్గొని విదేశీయుల చట్టాన్ని ఉల్లంఘించారని బీజేపీ నేత కృతి సౌమ్య ఆరోపించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    "విదేశీయుల చట్టాన్ని ఖాన్ ఉల్లంఘించారని గామ్దేవీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఆ తర్వాత ఆ ఫిర్యాదును ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు పంపించాం" అని పోలీసులు తెలిపారు.

    ఖాన్‌ను అమెరికా పౌరుడిగా గుర్తించి, ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని 7, 29 సెక్షన్లు ఉల్లంఘించినట్టు నోటిసుల్లో పేర్కొన్నారు. దీని ఆధారంగానే నిర్దేశించిన గడువులోపు దేశం విడిచి వెళ్లాలని సూచించినట్టు పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక అధికారి వివరించారు.

  3. అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ, అంకితా భండారీ, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని ఖండించిన రాహుల్ గాంధీ

    అంకితా భండారీ తల్లిదండ్రులను నిర్బంధించడాన్ని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖండించారు.

    బాధితుల గొంతును ఈ ప్రభుత్వం నొక్కేస్తోందని, ప్రశ్నించేవారిని తప్పిస్తోందని ఆయన ఆరోపించారు.

    "ఉదయం 4 గంటలు, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అంకితా భండారీ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. వారు చేసిన తప్పు ఏంటి?, ఇండియా గేట్ వద్ద ఎలాంటి హాంగామా లేకుండా, బాధతో నిశ్శబ్ధంగా కూర్చొని, సీబీఐ విచారణ పూర్తి అయ్యే వరకు దుష్యంత్ గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించొద్దని కోరారు" అని ఎక్స్‌లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు.

    "నేను, ప్రియాంక నిన్న వారిని కలిశాం. సీబీఐ దర్యాప్తు ఫలితాలు రాకముందే హడావుడిగా నియమాకాలు పూర్తి చేశారు. ప్రశ్నించిన తల్లిదండ్రులను చీకటిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుల గొంతును అణిచివేయడం, ప్రశ్నించే వారిని పక్కన పెట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.

    "న్యాయం కోసం జరుగుతున్న పోరాటాన్ని ఎవరూ అణచివేయలేరు, ఆపలేరు. అంకితా భండారీ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగే వరకు మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.

    ఇండియా గేట్ దగ్గర నిరసన చేస్తున్న అంకితా భండారీ తల్లిదండ్రులతోపాటు పలువురిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    కొంత సమయం వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఉదయం ఐదు గంటలకు విడుదల చేసినట్టు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

  4. పాకిస్తాన్: పాఠశాల భవనం పైకప్పు కూలి 18 మంది చిన్నారులు మృతి

    పెషావర్‌లో పాఠశాల భవనం పైకప్పు కూలి 18 చిన్నారులు మృతి
    ఫొటో క్యాప్షన్, పెషావర్‌లో పాఠశాల భవనం పైకప్పు కూలి 18 చిన్నారులు మృతి

    పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ప్రైవేటు పాఠశాల భవనం కూలి 19 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 18 మంది చిన్నారులు కాగా, ఒక ఉపాధ్యాయిని కూడా ఉన్నారు.

    పెషావర్‌లోని దర్ కాలనీలో ఈ ఘటన జరిగిందని బీబీసీ ఉర్దూ పేర్కొంది.

    ప్రమాదం జరిగిన తర్వాత చనిపోయిన స్థితిలో ఉన్న 18 మంది చిన్నారులను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయిని మృతదేహాన్ని కూడా ఆసుపత్రికి తెచ్చారని లేడీ రీడింగ్ హాస్పిటల్ అధికార ప్రతినిధి మహమ్మద్ అసీమ్ తెలిపారు.

    ఈ ప్రమాదంలో మరో 40 మంది చిన్నారులు గాయపడ్డారు. వారు ఎల్ఆర్‌హెచ్‌లో చికిత్స పొందుతున్నారు . వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని మహమ్మద్ అసీమ్ అన్నారు.

  5. ఈసీఐకు సుప్రీం కోర్టు నోటీసులు

    భారత ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు
    ఫొటో క్యాప్షన్, భారత ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు

    భారత ఎన్నికల సంఘం సహా పలువురికి సుప్రీంకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసిందని ఏఐఎన్ వార్తాసంస్థ పేర్కొంది. లోక్‌సభ‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీసహా పలు ప్రతిపక్షాలు వేసిన పిటిషన్ విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీకి కోర్టు సూచించింది. ఈసీ సర్‌ను నిర్వహిస్తున్న తీరును సవాలు చేస్తూ 13 పిటిషన్లు దాఖలు కాగా వారి ఒక పిటిషనర్ వైఖరిపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

    “పిటిషన్ దాఖలు చేసిన ఒక పిటిషనర్ ప్రవర్తన గురించి వచ్చే విచారణలో అడగాలనుకుంటున్నాం” అని రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకుల పిటిషన్‌పై నోటీసులు జారీ చేస్తూ ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

    లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర 'ఇండియా' బ్లాక్ నాయకులతో కలిసి, భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 12న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సర్‌కు సంబంధించి భారత ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలను సవాలు చేస్తూ ఈ పిటిషన్లు వేశారు.

  6. అమెరికా: ‘హిందూ దేవాలయం లక్ష్యంగా కాల్పులకు పథకం’ - యువకుడి అరెస్ట్

    ఈ కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు (ప్రతీకాత్మక చిత్రం)
    ఫొటో క్యాప్షన్, ఈ కేసులో అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు (ప్రతీకాత్మక చిత్రం)

    అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పాలటిన్‌లో సామూహిక కాల్పులు జరుపుతామనే బెదిరింపుల కేసులో పోలీసులు ఓ 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేశారు.

    ఆ యువకుడు ఒక హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

    ఈ విషయమై గురువారం షికాగోలోని భారతీయ కాన్సులేట్ జనరల్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అరోరాలో ఓ మతపరమైన స్థలాన్ని లక్ష్యంగా చేసుకోవడానికి జరిగిన విఫలయత్నం గురించిన వార్తలు కాన్సులేట్ దృష్టికి వచ్చాయి, సమయానికి స్పందించి చర్యలు తీసుకున్నందుకు పోలీసులను అభినందిస్తున్నాం. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్నాం" అని పేర్కొంది.

    "మౌంట్ ప్రాస్పెక్ట్ పోలీసులకు ఒక వ్యక్తి నుంచి అనుమానాస్పద సందేశం వచ్చిన తర్వాత సామూహిక కాల్పులు జరగవచ్చనే సమాచారం అందింది." ఆ తర్వాత నిందితుడిని అతని ఇంటి బయట అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుడి ఇంటిలో సోదాలు చేయగా, ఒక రైఫిల్,అనేక మ్యాగజైన్లు వందలాది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్ తెలిపింది.

  7. ‘బౌలింగ్ వ్యూహాలే దెబ్బతీశాయి’ - శ్రేయస్ అయ్యర్

    Team India, Shreyas Iyer, West Indies, Bengaluru, Hyderabad
    ఫొటో క్యాప్షన్, “బౌలింగ్ వ్యూహాన్ని అమలు చేయడంలో విఫలమయ్యాం” వెస్టిండీస్‌తో నాల్గో టీ20 మ్యాచ్ ఓటమిపై శ్రేయస్ అయ్యర్ వివరణ

    ఇండియా -విండీస్ మధ్యన హైదరాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. 24 పరుగుల తేడాతో వెస్టీండిస్ గెలిచింది. దీంతో ఐదు మ్యాచుల ఈ సిరీస్ 2-2తో సమమైంది. ఇక ఫలితం తేలేది ఐదో మ్యాచ్‌లోనే. ఈ మ్యాచ్ ఈనెల 17వ తేదీన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

    హైదరాబాద్‌లో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తమ బౌలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బౌలింగ్ వ్యూహాన్ని సరిగా అమలు చేయడంలో విఫలమయ్యామని అంగీకరించాడు.

    టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. కెప్టెన్ షై హోప్ అద్భుతమైన బ్యాటింగ్‌తో 50 బంతుల్లోనే 102 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు.

    భారత్ 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 19.3 ఓవర్లలో 223 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. టీమిండియాలో 23 బంతుల్లో 56 పరుగులు చేసిన సంజూ శామ్‌సన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత తిలక్ వర్మ 43 , నితీష్ రెడ్డి 41 పరుగులు చేశారు. కీమో పాల్ ఐదు వికెట్లు తీసుకున్నాడు.

    రన్ ఛేజ్‌లో బ్యాట్స్‌మెన్ పోరాటాన్ని కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రశంసించాడు. కానీ మ్యాచ్ మధ్యలో బౌలింగ్ ప్రణాళికలను మార్చడంలో తాము విఫలమయ్యామని చెప్పాడు.

    విండీస్ బౌలర్లును శ్రేయస్ ప్రశంసించాడు. “వారు ఫీల్డ్‌ను చాలా తెలివిగా వాడుకున్నారు. ప్రణాళికలను చక్కగా అమలు చేశారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్‌పై అదనపు బౌన్స్ కూడా లభించింది. పరిస్థితులను విండీస్ బౌలర్లు బాగా అర్థం చేసుకొన్నారు. మధ్య ఓవర్లలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకున్నారు” అన్నారు.

  8. ‘దిల్లీ నిరసనలు మా అంతర్గత వ్యవహారం’: ఐరాస వ్యాఖ్యపై భారత్ స్పందన

    మోదీ, భారత్, ఐక్యరాజ్యసమితి
    ఫొటో క్యాప్షన్, ఐక్యరాజ్యసమితి కామెంట్స్‌పై స్పందించిన కేంద్రం

    దిల్లీలో వేల మందిని నిర్బంధించడం సరికాదన్న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం హై కమిషనర్ వ్యాఖ్యలు ‘భారత్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడమేనని’ భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ అన్నారు.

    “ఐక్యరాజ్యసమితి ఆందోళనలు నిరాధారమైనవి. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంతో సమానమైన వాటిని అంగీకరించలేమని స్పష్టం చేశాం”అని రణ్‌ధీర్ జైస్వాల్ బుధవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు.

    "ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలు, ఆందోళనలపై స్పందించకపోవడం చూస్తుంటే వారిది పక్షపాత వైఖరిగా అర్థం చేసుకోవచ్చు” అన్నారు.

    "ఇలానే కొనసాగితే, దేశాలు కలిసి పని చేసే ఈ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. సంస్థగా వారి విశ్వసనీయత కూడా దెబ్బతింటుంది" అని అభిప్రాయపడ్డారు.

    సీజేపీ నిరసనల సందర్భంగా పోలీసులు తీసుకున్న చర్యలపై ఐక్యరాజ్యసమితి మానవహక్కుల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. అదుపులోకి తీసుకున్న వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

  9. యుక్రెయిన్ డ్రోన్స్ వేగంపై అమెరికానే పరిమితులు విధించి ఉండొచ్చు : మస్క్

    యుక్రెయిన్, ఎలాన్ మస్క్, అమెరికా,
    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ డ్రోన్స్ వేగాన్ని నియంత్రిస్తుంది అమెరికా ప్రభుత్వమేనన్న ఎలాన్ మస్క్

    యుక్రెయిన్ ఉపయోగిస్తున్న కొన్ని ఆయుధాలపై అమెరికా ప్రభుత్వం పరిమితులు విధించి ఉండొచ్చని స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.

    యుక్రెయిన్ సైన్యం రష్యాపై దాడులు చేయడానికి ,అలాగే తన వైమానిక రక్షణ వ్యవస్థలను నిర్వహించడానికి స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను విస్తృతంగా వినియోగించుకుంటోంది. అయితే మంగళవారం రాత్రి నుంచి కొన్ని డ్రోన్లు, ఆయుధాలు స్టార్ లింక్‌తో కనెక్ట్ కావడంలో సమస్యలు ఎదుర్కొన్నాయని యుక్రెయిన్ తెలిపింది.

    అమెరికా ప్రభుత్వం నియంత్రించే స్టార్ షీల్డ్ వ్యవస్థలో ఏర్పాటుచేసిన వేగ పరిమితులు అమెరికా సైన్యం, అధ్యక్షుడి నిర్ణయాల ప్రకారం ఉంటాయని మస్క్ ఎక్స్‌లో తెలిపారు.

    "వేగం లేదా వినియోగంపై ఏవైనా పరిమితులను అమెరికా సైన్యం, అంతిమంగా అమెరికా అధ్యక్షుడు నిర్ణయిస్తారు" అని మస్క్ అన్నారు.

    కనెక్టివిటీని పునరుద్ధరించాలని యుక్రెయిన్ చేసిన విజ్ఞప్తులపై మస్క్ ఎక్స్‌లో స్పందించారు.

    దీనిపై జెలియన్‌స్కీ యూకే మీడియాతో మాట్లాడుతూ: " బహుశా ఒక పెద్ద సాంకేతిక సమస్య కావచ్చని భావిస్తున్నా.మేం దానిని సరిచేయాలని అడుగుతున్నాం." అన్నారు.

    స్పేస్‌ఎక్స్ యాజమాన్యంలోని స్టార్‌లింక్, మంగళవారం రాత్రి వేగ పరిమితిని గంటకు 100 మైళ్లకు (160 కిలోమీటర్లకు) పరిమితం చేసింది. దీని అర్థం, అంతకంటే వేగంగా ప్రయాణించే ఏ ఆయుధాలైనా నెట్‌వర్క్‌కు కనెక్టివిటీని కోల్పోతాయి.

  10. జర్నలిస్ట్‌పై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ నమోదు

    దిల్లీ పోలీస్, జంతర్ మంతర్,
    ఫొటో క్యాప్షన్, జర్నలిస్టులపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు, కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు

    దిల్లీలోని బూటాసింగ్ రౌండ్ అబౌట్ వద్ద అక్టోబరు 3న జరిగిన నిరసన ప్రదర్శనలలో తన అధికారిక విధులకు ఆటంకం కలిగించారని, కులం పేరుతో అవమానించి, బెదిరించారంటూ దిల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ భగత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

    ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో శాంతి భద్రతల పరిరక్షణలో విధులలో ఉన్న తనను ఓ జర్నలిస్టు కులంపేరుతో దూషించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని తాను, తన ఆపరేటర్, కానిస్టేబుల్ రవి దహియా విన్నారని తెలిపారు.

    అయితే అక్టోబర్ 3న దిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా ఇద్దరు మహిళా జర్నలిస్టులతోపాటు ఓ యువతి పోలీసులపై లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులలో ఏసీపీ వివేక్ భగత్ కూడా ఉన్నారు.

  11. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేశ్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌నుక్లిక్ చేయండి.