You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డోనల్డ్ ట్రంప్ నిజంగానే ఎనిమిది మంది ఇరాన్ మహిళలను మరణశిక్ష నుంచి కాపాడారా?
ఎనిమిది మంది ఇరాన్ మహిళలను మరణశిక్ష నుంచి కాపాడినట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గతవారం సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే ఇరాన్ న్యాయవ్యవస్థ దీనిని ఖండించింది.
ట్రంప్ పేర్కొన్న ఆ 8 మంది మహిళలకు అసలు మరణశిక్షే ఖరారు కాలేదని, ఆయన తప్పుడు రిపోర్టులను నమ్మారని ఇరాన్ స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో ఈ ఎనిమిది మంది మహిళల ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ వైరల్ అయ్యింది. అందులో వీరికి మరణశిక్ష వేయబోతున్నారని రాసి ఉంది.
దీనిపై స్పందిస్తూ ట్రంప్ ప్రకటన చేశారు.
ట్రంప్ వాదన సరైనదేనా?
2026 జనవరిలో ఇరాన్లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో ఈ మహిళలు పాల్గొన్నారని, ఆ ఆందోళనలను ప్రభుత్వం బలవంతంగా అణచివేసిందని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.
ఏప్రిల్ 21న, ట్రంప్ తన సోషల్ మీడియాలో అటువంటి పోస్టునే షేర్ చేస్తూ, ఈ మహిళల గురించి ఇరాన్ పాలక యంత్రాంగాన్ని ప్రశ్నించారు. మహిళల విడుదల 'మన మధ్య చర్చలకు మంచి ఆరంభం' అవుతుందని తెలిపారు.
అమెరికా, ఇరాన్ మధ్య ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉందనుకున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఆ తర్వాత ఏప్రిల్ 22, ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో మరో పోస్ట్ చేస్తూ, ఆ ఎనిమిది మంది ఇరాన్ మహిళా నిరసనకారులకు ఇక మరణశిక్ష పడదని పేర్కొన్నారు. అయితే, ఆ మహిళలకు మరణశిక్ష వేసే ఉద్దేశమే తమకు లేదని ఇరాన్ ప్రకటించింది.
డోనల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో "చాలా మంచి వార్త వస్తోంది. ఆ ఎనిమిది మంది మహిళా నిరసనకారులను చంపబోరని నాకు తెలిసింది. నలుగురిని వెంటనే విడుదల చేస్తారు, మిగిలిన నలుగురు నెల రోజులు జైల్లో ఉండాలి. అమెరికా అధ్యక్షుడిగా నా విజ్ఞప్తిని మన్నించి వారి మరణశిక్షను రద్దు చేసినందుకు ఇరాన్ నాయకులను అభినందిస్తున్నాను" అని తెలిపారు.
'మీడియా తప్పుదోవ పట్టించింది'
" ప్రత్యర్థి మీడియా చానళ్లు ప్రచారం చేసిన తప్పుడు వార్తలు ట్రంప్‌ను తప్పుదోవ పట్టించాయి. కొందరు మహిళలు ఇప్పటికే విడుదలయ్యారు, మిగిలిన వారిపై ఉన్న ఆరోపణలు మరణశిక్ష పడేంత తీవ్రమైనవి కావు'' అని ఇరాన్ న్యాయవ్యవస్థకు చెందిన 'మిజాన్' వార్తాసంస్థ రిపోర్ట్ చేసినట్లు బీబీసీ అరబిక్ తెలిపింది.
ఈ కేసుపై మరింత సమాచారం కోసం ఇరాన్ న్యాయాధికారులను సంప్రదించినట్లు, వారి సమాధానం కోసం నిరీక్షిస్తున్నట్లు బీబీసీ ప్రతినిధి లీస్ డూసెట్ తెలిపారు.
ఓస్లోలో ఉన్న 'ఇరాన్ హ్యూమన్ రైట్స్' సంస్థను బీబీసీ సంప్రదించగా, ఈ ఎనిమిది మందిలో ఐదుగురి గురించి తమకు సమాచారం ఉందని వారు పేర్కొన్నారు.
"వీరిలో డాక్టర్ గుల్నార్ నార్గీ, వీనస్ హుస్సేనీజాద్ అనే మహిళలు గత నెలలోనే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే గజల్ గలాందరీ, మెహబూబే షబానీ అనే ఇద్దరు మహిళలకు మరణశిక్ష పడే అవకాశం ఉంది. బీటా హిమతీ అనే మహిళకు ఇప్పటికే మరణశిక్ష ఖరారైంది. జనవరిలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల సమయంలో ఆమెను భర్తతో కలిపి అరెస్ట్ చేశారు" అని ఇరాన్ హ్యూమన్ రైట్స్ సంస్థ డైరెక్టర్ మహమూద్ అమిరీ మొగాదం వివరించారు.
ఇరాన్లో మరణశిక్షల పరంపర కొనసాగుతూనే ఉంది. గతవారం ఐదుగురికి మరణశిక్ష అమలు చేసినట్లు ఇరాన్ న్యాయవ్యవస్థ ధ్రువీకరించింది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నవారే. గత ఏడాది 169 మంది ఇరాన్ పౌరులకు మరణశిక్ష విధించారు, ఇది 1989 తర్వాత నమోదైన అత్యధిక సంఖ్య.
ఈ మరణశిక్షల విషయంలో మానవ హక్కుల సంఘాలు ఇరాన్‌ను విమర్శిస్తూనే ఉన్నాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇరాన్ 12 మందికి పైగా వ్యక్తులకు మరణశిక్ష వేసింది. వీరిలో కొందరిపై ఇజ్రాయెల్ తరపున గూఢచర్యం చేశారనే ఆరోపణలు ఉండగా, మరికొందరు ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)