అత్తని 9 కిలోమీటర్లు మోసుకెళ్లిన కోడలు, అలోక్ పుతుల్, బీబీసీ కోసం, రాయ్‌పూర్ నుంచి..
ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా, మైన్‌పాట్ ప్రాంతంలోని జంగల్‌పారా గ్రామంలో హృదయవిదారక దృశ్యమొకటి వెలుగులోకి వచ్చింది.
పింఛన్ కోసం ఒక మహిళ 90 ఏళ్లున్న తన అత్తను వీపుపై మోసుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చింది.
సోమారి బాయి గిరిజన మహిళ. ఆమెకు రావాల్సిన రూ.1500 పెన్షన్ సొమ్ము గత మూడు నెలలుగా రావడం లేదు. దీంతో కోడలు రుక్మిణియా తన అత్తని వీపుపై మోసుకుంటూ రాళ్లురప్పలు, వాగులు దాటుకుంటూ 9 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ బ్యాంకుకు తీసుకెళ్లారు.
వాళ్ల ఊరికి సరైన రోడ్డు మార్గం గానీ, రవాణా సౌకర్యాలు గానీ లేవు.
సోమారి బాయి బ్యాంకు ఖాతాకు సంబంధించిన కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఆ ఖాతా సేవలు నిలిచిపోయాయని బ్యాంక్ మేనేజర్ అల్తాఫ్ మీర్జా తెలిపారు. ప్రస్తుతం ఆ అకౌంట్‌కు సంబంధించిన కేవైసీ, మొబైల్ నంబర్ అనుసంధాన ప్రక్రియ పూర్తయింది.
ఇకపై బ్యాంక్ మిత్ర ద్వారా పింఛన్ సొమ్ము నేరుగా వృద్ధురాలి ఇంటికే వెళ్లి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ గ్రామానికి చేరుకుని ఆరా తీశారు. సోమారి బాయి పింఛను విత్‌డ్రా చేసే అవకాశం ఆమె కోడలు రుక్మిణియాకు కల్పించనున్నట్లు మైన్‌పాట్ ఎస్డీఎం ఫగేశ్ సిన్హా తెలిపారు.